వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అగ్నిపథ్

అది నేపాల్‌లోని లుంబినీ రాష్ట్ర రాజధాని బుట్వాల్‌లో ఉన్న గూర్ఖా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్. ఉదయం పది గంటలైంది.. అక్కడున్న యువకులంతా చెమటతో తడిసి ముద్దయిపోయారు. వారిలో కొందరు కూరగాయలు తరుగుతున్నారు. కొందరు బట్టలు ఉతుకుతున్నారు. మరికొందరు క్యారంబోర్డు ఆడుతున్నారు.

వేసవికాలం వేడి మండిపోతోంది. అందరూ చొక్కాలు విప్పుకుని ఉన్నారు. పక్కనే ఉన్న పచ్చని కొండపై నలుపు, తెలుపు మేఘాలు దోబూచులాడుతున్నాయి.

ఆ శిక్షణా కేంద్రంలో ట్రైనర్ రమేశ్ థాపా నేపాల్ గూర్ఖాలకు బ్రిటిష్, భారత సైన్యాల్లో చేరడానికి శిక్షణ ఇస్తారు. రమేశ్ తండ్రి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. నాలుగేళ్ల క్రితం ఆయన చనిపోయారు. రమేశ్ తల్లి లండన్‌లో ఉంటున్నారు.

రమేశ్ థాపా కూడా భారత సైన్యంలో చేరేందుకు ప్రయత్నించారు కానీ, కుదరలేదు.

1947 త్రైపాక్షిక ఒప్పందం, నేపాల్ గూర్ఖాలకు బ్రిటిష్, భారత సైన్యాల్లో చేరే అవకాశం కల్పించింది.

రమేశ్ థాపా శిక్షణా కేంద్రంలో కనీసం 100 మంది యువకులు ఉంటారు. వారందరూ 15 నుంచి 20 సంవత్సరాల లోపు వారే. వీరంతా నేపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఇక్కడ శిక్షణ పొందాలంటే నెలకు రూ.13,000 ఫీజు చెల్లించాలి.

ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం వరకు ఇక్కడి యువకులంతా ఉత్సాహంతో సాధన చేస్తూ ఉన్నారు. జూన్ 14న భారతదేశం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించింది. దాంతో, వారికి నిరాశ, నిస్పృహలు ఆవరించాయి.

అక్కడి యువకులంతా భారత సైన్యంలో చేరడానికి చాలా కష్టపడుతున్నారని, అగ్నిపథ్ పథకం ప్రకటన తరువాత వారిలో ఆ ఉత్సహం నీరుగారిపోయిందని రమేశ్ థాపా అంటున్నారు.

"బ్రిటిష్ సైన్యంలో నేపాల్ గూర్ఖాలకు ఏడాదికి 172 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ, భారత సైన్యంలో 1000 మందికి పైగా రిక్రూట్ చేస్తారు. భారతదేశంలో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి ఈ యువకులు చాలా నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఈ నేపాలీ గూర్ఖాలు ఎవరూ భారత సైన్యంలో చేరడానికి ఇష్టపడకపోవచ్చు. నాలుగేళ్ల తరువాత ఈ పిల్లలు ఏం చేస్తారు? గూర్ఖాలు కఠోర శ్రమ చేస్తారు. కానీ, అగ్నిపథ్ పథకం వాళ్ల కష్టంపై నీళ్లు జల్లింది" అని రమేశ్ అన్నారు.

అగ్నిపథ్

'చైనా, పాకిస్తాన్‌లు మమ్మల్ని పిలుస్తున్నాయి'

లుంబినీకి చెందిన సచిన్ కున్వర్ (22) గత అయిదేళ్లుగా ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. భారత సైన్యంలో చేరాలన్నది ఆ యువకుడి లక్ష్యం.

సచిన్ తండ్రి ఇంద్ర బహదూర్ కున్వర్ కూడా భారత సైన్యంలో పనిచేసేవారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత ఆయన పంజాబ్‌లోని డీఎస్‌ఈలో చేరారు.

అగ్నిపథ్ పథకం గురించి వినగానే సచిన్ ఎంతగా కలతచెందారంటే, ఇప్పుడు పాకిస్తాన్ లేదా చైనా సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

"మాకు భారతదేశం ఒక్కటే కాదు. చైనా, పాకిస్తాన్ కూడా మమ్మల్ని పిలుస్తున్నాయి. ఆ దేశాల సైన్యాల్లో మేం చేరవచ్చు. గూర్ఖాల ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. మాకు పర్మినెంట్ ఉద్యోగం కావాలి. అది భారత్‌లో అయినా, చైనా లేదా పాకిస్తాన్‌లో అయినా ఫరవాలేదు. మాకు ఏ దేశం సౌకర్యాలు కల్పిస్తుందో ఆ దేశం పట్ల నిబద్ధత చూపిస్తాం" అని సచిన్ బీబీసీతో అన్నారు.

అయితే, సచిన్‌ని ఓ ప్రశ్న అడిగాం. మీ నాన్న భారత్ కోసం పోరాడారు. మరి, మీరు చైనా లేదా పాకిస్తాన్ కోసం పోరాడతారా? అని అడిగాం.

దానికి సచిన్ జవాబిస్తూ, "మా నాన్నకి భారతదేశం శాశ్వత ఉద్యోగం ఇచ్చింది. అన్ని సౌకర్యాలు కల్పించింది. కాబట్టి ఆయన ఆ దేశానికి విధేయులుగా ఉంటారు. అది ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ, ఆయన విధేయతను నేనెందుకు ఫాలో అవుతాను? అగ్నిపథ్ కింద, నేను భారత్ పట్ల విధేయత చూపించలేను. మాకు చైనా నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడూ పిలుస్తూనే ఉంది. చైనా, పాకిస్తాన్‌లు తమ సైన్యాల్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటే మేం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం" అన్నారు.

సచిన్ చెప్పిన మాటలతో అక్కడున్న యువకులంతా సమ్మతించారు. అగ్నిపథ్ పథకం ద్వారా తాము భారత సైన్యంలోకి వెళ్లబోమని చెప్పారు.

అగ్నిపథ్

'కేవలం నాలుగేళ్ల కోసం అక్కడికి వెళ్లి ఏం చేస్తాను?'

"భారత్ కోసం ప్రాణాలు ఇవ్వగలిగితే చైనా లేదా పాకిస్తాన్ కోసం ఎందుకివ్వలేం?" అని ప్రశ్నిస్తున్నారు నరేశ్ మెహతా. భారత్ కోసం ప్రాణాలు అర్పించినందుకు ప్రతిఫలంగా మాకు అగ్నిపథ్ దక్కింది అంటూ ఆక్రోశం వెళ్లబుచ్చారు.

నరేశ్ మెహతా, నేపాల్‌లోని కంచన్‌పూర్ నివాసి. ఇది ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంది. నరేశ్ తండ్రి శంకర్ సింగ్ మెహతా భారతదేశంలో ట్రక్కు నడిపేవారు. నాలుగేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. 21 ఏళ్ల నరేశ్ 12వ తరగతి వరకు చదివారు.

పుర్తి శ్రద్ధాసక్తులతో భారత సైన్యంలో చేరడానికి కఠోర శ్రమ చేస్తున్నారు నరేశ్. అగ్నిపథ్ పథకం తన కలలను నాశనం చేసిందని వాపోయారు.

"నాలుగేళ్ల తరువాత నేపాల్ తిరిగివచ్చి ఏం చేస్తాం? అగ్నిపథ్ స్కీం కింద నేను భారత్ సైన్యంలో చేరదలుచుకోలేదు. నేపాల్ ప్రభుత్వం, చైనా, పాకిస్తాన్‌లతో ఒప్పందం చేసుకోవాలి. మాకోసం ఈ రెండు దేశాల సైన్యం తలుపులు కూడా తెరుచుకోవాలి. ఇక చాలు, భారత్ తన ఇష్టానుసారం చెప్పే మాటలు ఇక వినలేం. గూర్ఖాలు భారతదేశం కోసం చాలా చేసారు. కానీ, వాళ్లు మాకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదు" అన్నారు నరేశ్.

నేపాల్‌కు భారత్‌, బ్రిటన్‌లతో ఉన్న త్రైపాక్షిక ఒప్పందం లాంటిది చైనా, పాకిస్తాన్‌లతో లేదు. 1947లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, నేపాల్ గూర్ఖాలను భారత, బ్రిటిష్ సైన్యాల్లో రిక్రూట్ చేసుకుంటారు.

అయితే, సింగపూర్‌, బ్రూనైలతో కూడా నేపాల్‌కు ఎలాంటి ఒప్పందం లేకపోయినా గుర్ఖాలు ఆ దేశాల సైన్యాల్లోనూ చేరుతున్నారు.

నేపాల్ కేవలం భారత్‌పైనే ఆధారపడితే, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలే ఎదువరువుతుంటాయని నరేశ్ మెహతా అన్నారు. అక్కడున్న యువకులంతా నరేశ్ మాటలతో ఏకీభవించారు.

నేపాల్‌లోని గుల్మీకి చెందిన బిమల్ పాండే కూడా ఇదే మాట అన్నారు. బిమల్ తండ్రి రాంప్రసాద్ పాండే భారతదేశంలో వంట పనిచేసేవారు. ఇప్పుడు ఆయన దుబాయ్‌లో కుక్‌గా పనిచేస్తున్నారు. 19 ఏళ్ల బిమల్ భారత సైన్యంలో చేరాలనే తపనతో కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అగ్నిపథ్ స్కీంపై బిమల్ చాలా కోపంగా ఉన్నారు.

"భారత సైన్యంలో చేరాలన్నది నా కల. ఇప్పుడు నాలుగేళ్ల కోసం అక్కడికెళ్లి ఏం చేస్తాను? గత నాలుగేళ్లుగా చాలా కష్టపడి ఫీజు కట్టి, ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, పాకిస్తాన్.. ఏ సైన్యంలోనైనా చేరిపోతాను. మాకెవరూ అంటరానివారు కాదు. చైనా, పాకిస్తాన్‌లకు వ్యూహాత్మకంగా మేము ప్లస్ పాయింట్ అవుతాం" అన్నారు బిమల్.

అగ్నిపథ్

'గూర్ఖాలకు అగ్నిపథ్ స్కీం నుంచి మినహాయింపు ఇవ్వకపోతే..'

భారత సైన్యం నుంచి రిటైర్ అయినవాళ్లు చాలామంది బుట్వాల్‌లో నివసిస్తున్నారు. మేం ఈ యువకులతో మాట్లాడుతూ ఉంటే, భారత సైన్యంలో 34 ఏళ్లు పనిచేసిన కెప్టెన్ నారాయణ్ పౌడెల్ కూడా అక్కడే నిలబడి వింటున్నారు.

కెప్టెన్ పౌడెల్ కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్నారు. అలాగే భారత్ నుంచి శ్రీలంక వెళ్లిన పీస్ మేకింగ్ ఫోర్స్‌లో కూడా భాగం పంచుకున్నారు.

ఈ యువకులు కోపంలో ఇలా మాట్లాడుతున్నారా? లేక నిజంగానే చైనా లేదా పాకిస్తాన్ సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా అని మేం ఆయన్ను అడిగాం.

దానికి కెప్టెన్ పౌడెల్ సమాధానమిస్తూ, "అగ్నిపథ్ స్కీం మీద కోపం అయితే ఉంది. గూర్ఖాలకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇవ్వకపోతే, చైనా, పాకిస్తాన్ వీరికి అవకాశాలు ఇవ్వవచ్చు. భారత్‌కు వ్యూహాత్మకంగా గూర్ఖాలు చాలా ముఖ్యమని గ్రహించాలి. నేపాలీ గూర్ఖాల సేవలను ఉపయోగించుకునేందుకు చైనా, పాకిస్తాన్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఈ యువకులు కేవలం కోపంతో ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకోను. నేపాల్‌లో భారత వ్యతిరేక భావన బలంగా ఉంది. అగ్నిపథ్ ఈ భావనకు మరింత ఆజ్యం పోస్తోంది" అని అన్నారు.

భారత్ భవిష్యత్తు సైన్యం కోసం ఈ పని చేస్తోంది.. అది సరైనదే కానీ, దాన్ని గొప్పగా దండోరా వేయనవసరం లేదని కెప్టెన్ పౌడెల్ అన్నారు.

"అగ్నిపథ్ స్కీం కింద 25 శాతం సైనికులకు శాశ్వత పదవులిస్తుంది. అలాంటప్పుడు ఎంతమందికి గూర్ఖాలకు పర్మినెంట్ ఉద్యోగాలివ్వగలదో అంతమందినే రిక్రూట్ చేసుకోవాలి. భారత్ కోసం ప్రతి యుద్ధంలో గూర్ఖాలు ప్రాణాలను అర్పించారు. అలాంటి గూర్ఖాల అంకితభావానికి గౌరవం ఇవ్వకపోతే భారతదేశానికే నష్టం" అన్నారు కెప్టెన్ పౌడెల్.

అగ్నిపథ్

జనరల్ అశోక్ కుమార్ మెహతా గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన డిఫెన్స్ విశ్లేషకుడిగా వ్యాసాలు రాస్తున్నారు.

"జులై 25న దిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో 'నేపాలీ గూర్ఖాలకు అగ్నిపథ్ స్కీమ్' అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా, నేపాల్‌కు చెందిన జనతా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు, పోలీసు ఫెడరేషన్ అధ్యక్షుడు గౌరవ సుబేదార్ మేజర్ ఖేమ్ జంగ్ గురుంగ్ ఒక ఆడియో సందేశాన్ని పంపారు. అగ్నిపథ్ స్కీం, భారత సైన్యం కార్యాచరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని, అలాగే గూర్ఖాల ఉత్సాహంపై నీరు జల్లుతుందని ఆయన అన్నారు. ఎందుకంటే, కొన్నేళ్లకే ఉద్యోగం ఉంటుంది. పెన్షన్ ఉండదు. అగ్నివీరులు సైన్యం నుంచి బయటకు వచ్చిన తరువాత భారత వ్యతిరేక కార్యకపాలకు పాల్పడవచ్చు. భారత వ్యతిరేక మావోయిస్టు గ్రూపులు వారిని ఉపయోగించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, భారత్, నేపాల్ సంబంధాలలో గూర్ఖాలు దౌత్యపరమైన వారధిగా ఉంటున్నారు. అగ్నిపథ్ వల్ల ఈ వారధి బలహీనపడుతుంది" అని అశోక్ కుమార్ మెహతా అన్నారు.

మేజర్ జనరల్ గోపాల్ గురుంగ్ కూడా ఈ సెమినార్‌లో ప్రసంగించారు.

"చైనా మళ్లీ నేపాల్ గూర్ఖాలను తమ సైన్యంలో చేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా చైనా పన్నే వ్యూహం కావచ్చు. గూర్ఖాల పరాక్రమ చరిత్ర చైనాకు బాగా తెలుసు. దాని పట్ల ఆ దేశం కుతూహలం కనబరుస్తుంది కూడా. చైనా 1962లో గూర్ఖాలను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నప్పుడు, భారత యుద్ధ ఖైదీల కంటే గూర్ఖాలతో మెరుగ్గా వ్యవహరించింది. 2020లో చైనా దీని గురించి ఒక అధ్యయనం నిర్వహించింది. నేపాలీలకు భారత సైన్యంలో చేరాలనే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకొస్తుంది అనే అంశాలను అధ్యయనం చేసింది. ఇప్పుడు అగ్నిపథ్ వల్ల గూర్ఖాలు చైనా పట్ల ఆకర్షితులు కావచ్చు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why are Nepali Gurkhas angry about Agnipath scheme... Do they want to join Pak, China army?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X