వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్ చైనా వివాదం

ల‌ద్దాఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైన్యంతో ఉద్రిక్త‌త‌ల్లో 20 మంది భార‌త సైనికులు అమ‌రులైన అనంత‌రం మోదీ ప్ర‌భుత్వ దౌత్య విధానాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

బంగ్లాదేశ్ మొద‌లుకొని నేపాల్ వ‌ర‌కూ.. గ‌త కొన్ని రోజులుగా పొరుగునున్న దేశాల‌తో భార‌త్ సంబంధాల్లో ఒడిదొడుకులు క‌నిపిస్తున్నాయి. భార‌త్‌కు సంబంధించి పోరుగుదేశాలు స్పందిస్తున్న తీరు ఈ బంధాల‌ను మ‌రింత దిగ‌జారుస్తోంది.

తాజాగా ఈ దేశాల జాబితాలో భూటాన్ కూడా చేరిపోయింది. కొన్ని రోజులుగా ఈ దేశం పేరు కూడా చ‌ర్చ‌ల్లో వినిపిస్తోంది.

భారత్ చైనా వివాదం

కార‌ణం ఏమిటి?

ఇటీవ‌ల భూటాన్‌కు స‌రిహ‌ద్దుల్లోని అసోం బాక్సా జిల్లాలో వంద‌ల మంది రైతులు భూటాన్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. కాలా న‌ది నుంచి సాగు నీటి స‌ర‌ఫ‌రాను భూటాన్ నిలిపివేసింద‌ని వారు ఆరోపిస్తున్నారు.

ఈ అంశం భార‌తీయ మీడియాలో ప‌తాక శీర్షిక‌ల్లో నిల‌వ‌డంతో భూటాన్ విదేశాంగ శాఖ వివ‌ర‌ణ కూడా ఇవ్వాల్సి వ‌చ్చింది.

ఆగ్నేయ భూటాన్‌లోని సండ్రోప్ జోంగ్‌ఖార్ న‌గ‌రం.. భార‌త్‌లోని అసోంతో స‌రిహ‌ద్దు క‌లిగివుంటుంది. ఈ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డే ద‌రంగా, బోగాజులీ, బ్ర‌హ్మ‌పాడా లాంటి 26 గ్రామాలున్నాయి.

న‌దికి దిగువ‌నుండే ఈ గ్రామాలు చాలా పేద గ్రామాలు. భూటాన్ నుంచి వ‌చ్చే కాలా న‌ది జ‌లాల సాయంతో ఏళ్లత‌ర‌బ‌డి వీరు వ్య‌వ‌సాయం చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది స‌కాలంలో నీరు రాక‌పోవ‌డంతో.. భూటాన్ కావాల‌నే నీటిని ఆపేసింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు.

1951 నుంచీ తాము ఈ న‌దీ జ‌లాల‌పైనే ఆధార‌ప‌డ్డామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అసౌక‌ర్య‌మూ త‌మ‌కు క‌ల‌గ‌లేద‌ని రైతులు చెబుతున్నారు.

ఇప్పుడు నీరు ఆగిపోవ‌డంతో.. జూన్‌ 22న ధర్నాలో కూర్చోవాల‌ని కాలీపుర్ బోగాజులీ కాలా న‌దీ జోన‌ల్ డ్యామ్ క‌మిటీ తీర్మానించింది.

భారత్ చైనా వివాదం

రైతుల స‌మ‌స్య ఏమిటి?

"భూటాన్‌తో మ‌న బంధాలు చాలా పురాత‌న‌మైన‌వి. ఇన్నేళ్లుగా వారి వైపు నుంచి మ‌న‌కు ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌లేదు. కానీ మేం రైతులం. వ్య‌వ‌సాయ‌మే మా జీవ‌నాధారం. వ్య‌వ‌సాయానికి నీరు దొర‌క‌క‌పోతే మా ప‌రిస్థితి ఏమిటి? మేం ధ‌ర్నాకు కూర్చునే ముందు ఈ విష‌యంపై స్థానిక ప‌రిపాల‌నా విభాగంతో మాట్లాడాము. కానీ మా గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అందుకే ధ‌ర్నాలో కూర్చున్నాం. మేం భూటాన్‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి నినాదాలు చేయ‌లేదు. అలాగే ఎలాంటి చెత్త మాట‌లూ మాట్లాడ‌లేదు. మా స‌మ‌స్య‌ను నిజానికి భార‌త్ లేదా అసోం ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి" అని గ‌త ఎనిమిదేళ్లుగా కా‌లా న‌ది జోన‌ల్ డ్యామ్ క‌మిటీకి అధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్న మ‌హేశ్ నార్జ‌రీ వ్యాఖ్యానించారు.

ధ‌ర్నా చేయ‌డం వ‌ల్ల భూటాన్ నుంచి నీళ్లు వ‌చ్చాయా?

"ఈ ఏడాది భూటాన్ త‌మ పౌరుల సాగు ప్ర‌యోజ‌నాల కోసం న‌దిపై కొత్త కాలువలు‌ నిర్మించింది. మ‌రోవైపు మ‌న‌కు రావాల్సిన నీరు రావ‌డం లేదు. ఇన్ని సంవ‌త్స‌రాలుగా మ‌న రైతులు వారికివారే భూటాన్ స‌రిహ‌ద్దును దాటి కాలువ‌లు నిర్మించి నీరు తీసుకొచ్చేవారు. కానీ కోవిడ్‌-19 వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ‌.. భూటాన్ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. మ‌న కాలువ‌ల్లో రాళ్లు, మ‌ట్టి ప‌డ‌టంతో నీరు త‌గ్గిపోతున్నాయి. భూటాన్ వాళ్లు మ‌ళ్లీమ‌ళ్లీ మ‌న కోసం కాలువ‌లు ఎందుకు త‌వ్వుతారు. ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే.. ఇక్క‌డి 500 రైతు కుటుంబాలు అన్యాయం అయిపోతాయి" అని నార్జ‌రీ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు భూటాన్ నీటిని నిలిపివేస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను భార‌త్‌-భూటాన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేష‌న్‌లోని సండ్రోప్ జోంగ్‌ఖార్ విభాగ స‌ల‌హాదారు షెరింగ్ నాంగ్యేల్ ఖండించారు.

"భార‌త్‌, భూటాన్‌ల మ‌ధ్య ఏళ్ల నుంచీ స్నేహ‌పూర్వ‌క సంబంధాలున్నాయి. ఇప్ప‌టికీ స‌రిహద్దుకు రెండు వైపులా ప్ర‌జ‌ల మ‌ధ్య మంచి సంబంధాలున్నాయి. అసోంలోని సరిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు కాల న‌ది నుంచి ఏళ్లుగా నీరు తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి వివాదాలూ రాలేదు. కాలువలు త‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మైన సిబ్బందికి మేమే చెల్లింపులు చేస్తాం. భార‌త్ మీడియాలో వ‌స్తున్న వార్తలు నిరాధార‌మైన‌వి." అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

भारत-चीन विवाद के बीच भूटान क्यों आया चर्चा में?

భూటాన్ ఏమంటోంది?

ఈ అంశంపై భూటాన్ విదేశాంగ శాఖ జూన్ 26న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. "భార‌త్‌లోని అసోం, ఉదాల్‌గురి జిల్లాల్లోని రైతుల‌కు సాగు నీరు అంద‌‌కుండా కాలా నీటిని నిలిపివేశామ‌ని జూన్ 24 నుంచి భార‌త్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి. ఇవి మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తున్నాయి. నీటిని భార‌త్‌లోకి వెళ్ల‌కుండా ఎందుకు అడ్డుకుంటాం చెప్పండి" అని పేర్కొంది.

"కొన్ని ద‌శాబ్దాలుగా భూటాన్ జ‌ల వ‌న‌రుల‌ను అసోం రైతులు ఉప‌యోగించుకుంటున్నారు. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ కూడా అవే ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల భూటాన్ స‌రిహ‌ద్దుల‌ను మూసేశాం. దీంతో అసోంలోని కొంద‌రు రైతులు భూటాన్‌లోని ప్ర‌వేశించి.. త‌మ కాలువ‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసుకోలేక‌పోతున్నారు. అసోంలోకి నీరు సాఫీగా వెళ్లేలా సాగునీటి కాలువ‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించేందుకు సండ్రోప్ జోంగ్‌ఖార్ జిల్లా అధికారులు, స్థానికులతో క‌లిసి ప‌నిచేస్తున్నారు."

భూటాన్‌, అసోం ప్ర‌జ‌ల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే ల‌క్ష్యంతో కొంద‌రు ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని భూటాన్ వ్యాఖ్యానించింది.

భూటాన్ ప్రవేశ ద్వారం

భూటాన్ స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతోంది?

భార‌త్‌-చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితుల న‌డుమ భూటాన్ పేరును లేవ‌నెత్తి బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని ఇరుకున‌ప‌డేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా?

భూటాన్‌కు సరిహ‌ద్దుల్లోని భార‌త గ్రామాల‌న్నీ బోడోల్యాండ్ ప్రాదేశిక మండ‌లి (బీటీసీ) ప‌రిధిలో ఉంటాయి. ఒక‌ప్పుడు ఈ ప్రాంతాల్లో బోడోల్యాండ్ తీవ్ర‌వాద సంస్థ‌లు క్రియాశీలంగా ప‌నిచేసేవి. అయితే 2013లో హాగ్రామ మోహిలారి నేతృత్వంలోని బోడోల్యాండ్ లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ (బీఎల్‌టీ)తో అప్ప‌టి వాజ్‌పేయీ ప్ర‌భుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని త‌ర్వాతే బీటీసీని ఏర్పాటుచేశారు.

ఒప్పందం అనంత‌రం హాగ్రామ మోహిలారి నేతృత్వంలోని బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్‌).. బీటీసీలో అధికారంలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని అధికారంలోనున్న భాజ‌పా ప్ర‌భుత్వానికి త‌మ 12 మంది ఎమ్మెల్యేల‌తో బీపీఎఫ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అయితే బీటీసీ ఎన్నిక‌ల్లో ఈ సారి బీజేపీ, బీపీఎఫ్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

బీటీసీ ప‌రిధిలోని ప్రాంతాల్లో బీపీఎఫ్ ప‌నితీరుపై బీజేపీ నాయ‌కులు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అదే స‌మ‌యంలో బీపీఎఫ్ అవినీతికీ పాల్ప‌డింద‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం బీటీసీ ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. ఇప్పుడు ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్ పాల‌న కొన‌సాగుతోంది.

భారత్ చైనా వివాదం

"ఈ ఘ‌ట‌న‌ల వెనుక రాజ‌కీయ కోణం ఉంది. ఈసారి చాలా మంది ప్ర‌ముఖ బీపీఎఫ్ నాయ‌కులు బీజేపీతో చేతులు క‌ల‌పబోతున్నారు. వీరు బీపీఎఫ్ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు. వీరే నీళ్ల‌ను నిలిపివేయాల‌ని సండ్రోప్ జోంగ్‌ఖార్ అధికారుల‌పై ఒత్తి‌డి తెస్తున్నారు. మ‌రికొంద‌రైతే నిర‌న‌స‌లు చేప‌ట్టాల‌ని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. కానీ భూటాన్‌లోని అధికారుల‌కు ప‌రిస్థితులు తెలుసు. అందుకే వారు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌‌రించారు. భూటాన్.. భార‌త్‌కు మంచి మిత్ర‌దేశం. ఇలాంటి చ‌ర్య‌లు రెండు దేశాల మ‌ధ్య విభేదాలు తీసుకురావ‌డంతోపాటు రెండు దేశాల స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌నూ దెబ్బ‌తీస్తాయి"అని భార‌త్‌-భూటాన్ స‌రిహ‌ద్దు వ్య‌వ‌హారాల నిపుణుడైన‌, భూటాన్‌లోని గేలేఫు ప‌ట్ట‌ణానికి చెందిన సామాజిక కార్య‌క‌ర్త ఒక‌రు చెప్పారు.

మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయ‌ని బోడోల్యాండ్ ప్రాంతంలోని ఏకైన లోక్‌స‌భ స్థానం కోక్ర‌ఝార్‌కు చెందిన స్వ‌తంత్ర ఎంపీ న‌వ్ కుమార్ స‌ర్నియా ఆరోపించారు.

"భూటాన్‌తో ప్ర‌స్తుతం వ‌చ్చిన స‌మ‌స్య‌... చైనా, నేపాల్‌ల‌తో వ‌చ్చిన వివాదం లాంటిది కాదు. జిల్లా పరిపాల‌నా విభాగం భూటాన్‌తో మాట్లాడితే.. స‌రిహ‌ద్దుల్లోని రైతులకు నీళ్లు వ‌చ్చేస్తాయి. అయితే స‌రిహ‌ద్దు గ్రామాల్లో ఎలాంటి సాగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థా లేదు. ప్ర‌జ‌లు అటువైపు వెళ్లి.. రాళ్లు, మ‌ట్టితో తాత్కాలిక కాలువ‌లు నిర్మించుకుంటున్నారు. ఇక్క‌డి నీటి పారుద‌ల‌, భూమి కోత‌, ఆన‌క‌ట్ట‌ల గురించి పార్ల‌మెంటులో చాలాసార్లు ప్ర‌స్తావించాను. బీటీసీలో చాలా అవినీతి జ‌రు‌గుతోంది. నీటి పారుద‌లకు సంబంధించి కోట్ల రూపాయ‌ల అవినీతి చోటుచేసుకుంది. కాలా న‌దిపై నాలుగు కోట్ల‌తో నిర్మించిన ఆన‌క‌ట్ట దెబ్బ‌తింది. కొంద‌రు ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయాలు చేస్తున్నారు. రైతులు నిర‌స‌న‌లు చేప‌ట్టేలా రెచ్చ‌గొడుతున్నారు. ఇదేమీ అంత పెద్ద స‌మ‌స్య కాదు."

నీళ్లు ఆపేయ‌డం పేరుతో కొంద‌రు భార‌త్‌-భూటాన్‌ల మ‌ధ్య సంబంధాల‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స్థానిక బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు.

"భూటాన్ ఎప్పుడూ భార‌త్‌కు మంచి మిత్ర‌దేశమే. ప్ర‌ధాని మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలి విదేశీ ప‌ర్య‌ట‌న భూటాన్‌తోనే మొద‌లుపెట్టారు. రెండు దేశాల మ‌ధ్య చాలా జ‌ల విద్యుత్ ప్రాజెక్టులు న‌డుస్తున్నాయి. రైతుల విష‌యానికి వ‌స్తే.. అస‌లు స‌మస్యేంటో మొద‌ట‌ గుర్తించాలి. కొంద‌రు చిన్న‌చిన్న విష‌యాల‌నే చాలా పెద్ద‌వి చేసి చూపిస్తున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే భూటాన్ కూడా స్పందించింది. ఇంకా ఎవ‌రైనా రాజ‌కీయాలు చేయాల‌నుకుంటే.. వారు దేశానికి న‌ష్టం చేస్తున్న‌ట్లే. ఎందుకంటే ఇది భార‌త్‌-భూటాన్‌ల బంధాల‌ను దెబ్బ‌తీసే విష‌యం" అని అసోం బీజేపీ ఉపాధ్య‌క్షుడు విజ‌య్ కుమార్ గుప్త వ్యాఖ్యానించారు.

భారత్ చైనా వివాదం

అసోం ప్ర‌భుత్వం ఏం చెబుతోంది?

"భూటాన్‌.. భార‌త్‌కు నీటిని నిలిపివేసింద‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. కాలువ‌లు స‌హ‌జంగా పూడుకుపోవ‌డం వ‌ల్లే నీరు ఆగిపోయింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భూటాన్ సాయం చేస్తోంది" అని అసోం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుమార్ సంజ‌య్ కృష్ణ ఓ ట్వీట్ చేశారు.

నీటికి సంబంధించి రెండు దేశాల మ‌ధ్య.. ఎలాంటి వివాద‌మూ లేదు. ఇదివ‌ర‌కు ఇక్క‌డ స‌రిహ‌ద్దు ఉండేది కాదు. ప్ర‌జ‌లు ఎలాంటి అడ్డూ లేకుండానే హాయిగా అటూఇటూ వెళ్లేవారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా మాట్లాడుకొని ప‌రిష్క‌రించుకొనేవారు. అయితే 2003లో రాయ‌ల్ భూటాన్ ఆర్మీతో క‌లిసి మ‌న సైన్యం అసోంకి చెందిన‌ వేర్పాటువాదుల‌పై ఆప‌రేష‌న్ ఆల్ క్లియ‌ర్ చేప‌ట్టింది. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య కంచె వేశారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌నూ మోహ‌రిస్తున్నారు. ఇప్పుడు భూటాన్‌లోకి వెళ్లాలంటే ప్ర‌త్యేక పాస్‌లు కావాలి. దీంతో అటువైపు వెళ్ల‌డం అంత తేలిక కాదు అని భార‌త్‌-భూటాన్ వ్య‌వ‌హారాల‌పై 20 ఏళ్లుగా ప‌నిచేస్తున్న ‌రాజు నార్జ‌రీ వ్యాఖ్యానించారు.

భూటాన్‌లోని జ‌ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భార‌త్ పెట్టుబ‌డుల‌పై అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. "56 న‌దులు భూటాన్ నుంచి బోడోల్యాండ్‌లోకి వ‌స్తాయి. నీళ్ల‌ను ఆపేయ‌లేదంటూ భూటాన్ చెప్పిన మాట వాస్త‌వ‌మే. అయితే ఇక్క‌డి రైతులకు ఇదివ‌ర‌కు కంటే త‌క్కువ నీరే వ‌స్తోంది. భూటాన్‌లోని న‌దుల‌పై భారీ జ‌ల విద్యుత్ ప్రాజెక్టుల‌ను భార‌త్ నిర్మిస్తోంది. దీంతో న‌దుల్లో పారే నీరు త‌గ్గిపోతోంది. నిజానికి ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాలి. న‌దికి దిగువ ప్రాంతాల్లోనున్న రైతులకు ఎంత హాని జ‌రుగుతుందో చెప్పాలి. ఎందుకంటే ఇది వంద‌లాది రైతుల జీవ‌నాధారానికి సంబంధించిన స‌మ‌స్య" అని రాజు వివ‌రించారు.

భారత్ చైనా వివాదం

భార‌త్‌-భూటాన్ సంబంధాలు

భార‌త్‌, భూటాన్‌‌ల మ‌ధ్య సంబంధాలు ప్ర‌త్యేక‌మైన‌వి. మోదీ 2014లో ప్ర‌ధాని అయిన త‌ర్వాత తొలి విదేశీ ప‌ర్య‌ట‌న భూటాన్‌తోనే మొద‌లుపెట్టారు. పొరుగు దేశాల సంబంధాలకే తాము అగ్ర తాంబూలం ఇస్తామ‌ని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు.

నెహ్రూ హ‌యాం నుంచే భూటాన్‌తో మంచి సంబంధాలున్నాయి. 1958లో నెహ్రూ భూటాన్‌లో ప‌ర్య‌టించి.. భూటాన్ స్వాతంత్ర్యానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌కటించారు. భూటాన్‌పై జ‌రిగే ఏ దాడినైనా త‌మ‌పై జ‌రిగిన‌ట్టే భావిస్తామ‌ని పార్ల‌మెంటు వేదిక‌గా ఆయ‌న చెప్పారు.

భూటాన్ కూడా.. భార‌త్‌తో మంచి సంబంధాల‌ను క‌లిగివుంది. భార‌త్‌లో ఏ పార్టీ ప్ర‌భుత్వ‌మున్నా.. రెండు దేశాల‌ సంబంధాల్లో ఎలాంటి మార్పూ రాలేదు.

600 ఎండ‌బ్ల్యూ ఖ‌లోంగ్‌ఛూ జేవీ జ‌ల‌విద్యుత్ ప్రాజెక్ట్‌.. రెండు దేశాల స‌న్నిహిత సంబంధాల‌కు తాజా ఉదాహ‌ర‌ణ‌. ఈ ప్రాజెక్టు కింద భూటాన్‌లో ఓ భార‌త్ సంస్థ‌ జ‌ల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bhutan's name heard in indo China conflict
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X