• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా ఎందుకు మెరుగ్గా ఉంది?

By BBC News తెలుగు
|

భారత ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ ఏడాది 10.3 శాతం క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. తలసరి జీడీపీ వృద్ధి రేటులో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ భారత్‌ను దాటేయొచ్చని కూడా పేర్కొంది.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

''విద్వేషపూరిత సాంస్కృతిక జాతీయవాదంతో ఆరేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. బంగ్లాదేశ్ కూడా భారత్‌ను అధిగమించేయనుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

https://twitter.com/RahulGandhi/status/1316224292347023360

ఆయన ఆ ట్వీట్‌తో పాటు పోస్ట్ చేసిన గ్రాఫ్‌లో 2020లో తలసరి జీడీపీ బంగ్లాదేశ్‌లో 1876.5 డాలర్లుగా, భారత్‌లో 1888 డాలర్లుగా ఉన్నట్లుగా చూపించారు.

ఐఎంఎఫ్ అంచనాలపై ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు కూడా ట్విటర్‌లో స్పందించారు.

''అభివృద్ధి చెందుతున్న సాటి దేశం మంచి ప్రదర్శన చేయడం శుభ వార్తే. కానీ, భారత్‌కు మాత్రం ఇది షాక్‌కు గురిచేసే విషయం. ఐదేళ్ల క్రితం భారత్ కన్నా బంగ్లాదేశ్ 25 శాతం వెనుకంజలో ఉంది. భారత్ సాహసోపేతమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు తేవాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

https://twitter.com/kaushikcbasu/status/1316567126115848193

పోలిక ఎంతవరకూ సబబు?

ఈ ఏడాది భారత్ ఆర్థికవ్యవస్థ 10.3 శాతం క్షీణిస్తుందని అంచనా వేసిన ఐఎంఎఫ్... బంగ్లాదేశ్ జీడీపీ మాత్రం 3.8 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. చైనా మయన్మార్‌ల జీడీపీలు కూడా పెరుగుతాయని పేర్కొంది.

భారత్ జనాభా బంగ్లాదేశ్ జనాభాతో పోల్చితే 8 రెట్లు ఎక్కువని, పైగా 2019లో భారత్‌ కొనుగోలు శక్తి బంగ్లాదేశ్ కన్నా 11 రెట్లు ఎక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

దీని అర్థం బంగ్లాదేశ్ గణాంకాలతో పోల్చుకుని, భారత్ ఆందోళనపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

https://twitter.com/TheDailyPioneer/status/1316336482458583040

దేశ జీడీపీని జనాభాతో భాగించి తలసరి జీడీపీ లెక్కిస్తారు. ఎక్కువ జనాభా ఉన్న దేశంలో తలసరి జీడీపీ తక్కువగా ఉండటం సహజమే.

ఇక భారత జీడీపీ క్షీణత తాత్కాలిక పరిణామమని, రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలెపింగ్ కంట్రీ (ఆర్ఐఎస్) ప్రొఫెసర్ ప్రబీర్ డే అంటున్నారు.

''భారత్‌తో పోల్చితే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ విలువ 250 బిలియన్ డాలర్లు. భారత్ ఆర్థికవ్యవస్థ విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దక్షిణాసియా దేశాల్లోకెల్లా భారత్‌పైనే అత్యధిక ప్రభావం పడింది. దేశ జీడీపీ 23.9 శాతం క్షీణించింది.

బంగ్లాదేశ్, చైనాల్లో క్షీణత భారత్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది. భారత్‌లో విధించిన స్థాయిలో లాక్‌డౌన్ ఇతర దేశాల్లో అమలు కాలేదు. దీని ప్రభావం కూడా ఐఎంఎఫ్ అంచనాల్లో కనిపిస్తోంది.

అయితే, బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న విషయం వాస్తవమేనని కూడా ప్రబీర్ అన్నారు.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థ

బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లు. ఆ దేశ ఆర్థికవ్యవస్థలో అత్యధికంగా వస్త్ర రంగం, విదేశాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్ వారి భాగస్వామ్యం ఉంది.

తయారీ రంగంలో బంగ్లాదేశ్ వేగంగా ఎదుగుతోంది. వస్త్ర రంగంలో చైనా తర్వాతి స్థానం బంగ్లాదేశ్‌దే. బంగ్లాదేశ్‌లో తయారయ్యే వస్త్రాల ఎగుమతులు ఏటా 15 నుంచి 17 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నాయి.

2018 జూన్‌లో బంగ్లాదేశ్ నుంచి ఎగుమతైన వస్త్ర ఉత్పత్తుల విలువ 36.7 బిలియన్ డాలర్లు. 2021లో దీన్ని 50 బలియన్ డాలర్లకు చేర్చాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరోవైపు భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తయారీ రంగం 39.3 శాతం మేర క్షీణించింది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్‌కు చెందిన దాదాపు 25 లక్షల మంది వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్లు సొంత దేశంలో ఉంటున్న తమవారికి డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇలా పంపుతున్న మొత్తం ఏటా 18 శాతం చొప్పున పెరుగుతోంది. 2019లో ఇలా విదేశాల్లో ఉంటున్నవారి నుంచి బంగ్లాదేశ్‌కు 19 బిలియన్ డాలర్ల డబ్బు వచ్చింది. విదేశాల నుంచి వచ్చే డబ్బు బంగ్లాదేశ్ జీడీపీలో 5 శాతం మేర ఉంటుంది.

విదేశాల నుంచి వచ్చే డబ్బుపై, వస్త్ర రంగంపై కరోనావైరస్ సంక్షోభం ప్రభావం పడటం బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థపై ప్రధానంగా ప్రభావం చూపించిందని ఐఎంఎఫ్ పేర్కొంది.

వీటితో పాటు వానలు, వరదల కారణంగా అక్కడ వ్యవసాయం రంగం దెబ్బతింది.

ఇక భారత్‌లో జీడీపీ క్షీణతకు కరోనా సంక్షోభం, దాని వల్ల విధించిన లాక్‌డౌన్ కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది.

షేక్ హసీనా

భారత్‌లోలాగా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు బంగ్లాదేశ్‌లో ఉండవు. అక్కడి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలే అంతటా అమలవుతాయి.

ప్రజల మధ్య జాతి, మత, భాష, రాష్ట్రం లాంటి విభజనలు కూడా తక్కువ.

బంగ్లాదేశ్‌లో మహిళలను స్వశక్తులను చేసే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయని కౌశిక్ బసు అన్నారు.

అక్కడి వస్త్ర రంగంలోని కార్మిక శక్తిలో మహిళలది కీలక భాగస్వామ్యం. సమాజంలో మహిళలు ముందుంటే, మెరుగైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రబీర్ అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్ మంచి మార్కెట్ విలువను కూడా సంపాదించుకుంది. ఆ దేశంలో తయారైన వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. బంగ్లాదేశ్‌తో వ్యాపారం చేసిన దేశాలు, మళ్లీ మళ్లీ ఆ దేశంతో వ్యాపారం చేసేందుకు ముందుకువస్తాయి.

బంగ్లాదేశ్

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), సులభరత వాణిజ్య విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మాత్రం బంగ్లాదేశ్ కాస్త వెనుకబడి ఉందని ప్రబీర్ అన్నారు.

ప్రాజెక్టులకు త్వరగా అనుమతులిచ్చే వ్యవస్థ బంగ్లాదేశ్‌లో లేదు. ఒక్కో కేసును పరిగణనలోకి తీసుకుంటూనే, అక్కడి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుంది. అయినా, కరోనా సమయంలో చైనా నుంచి బయటకు వచ్చిన 16 జపాన్ సంస్థలు బంగ్లాదేశ్‌లో తమ పరిశ్రమలు నెలకొల్పాయి. ఢాకాకు 30 కి.మీ.ల దూరంలో ఇటీవలే హోండా సంస్థ తమ ప్లాంటును ఏర్పాటు చేసింది.

ఇక బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా మెరుగ్గా ఎందుకు ఉందన్న ప్రశ్నకు... ''బంగ్లాదేశ్ మెట్ల ద్వారా పైకి ఎక్కుతోంది. భారత్ లిఫ్ట్‌లో వెళ్తోంది. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు లిఫ్ట్ ఆగిపోతుంది. కానీ, మెట్ల ద్వారా వెళ్లేవారు పైకి వెళ్లొచ్చు. రెండు దేశాల ఆర్థికవ్యవస్థల పునాదుల మధ్య ఉన్న తేడా ఇదే'' అని ప్రబీర్ సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bangladesh GDP better than India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X