• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్‌లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?

By BBC News తెలుగు
|

పాకిస్తాన్‌లో లోదుస్తుల అమ్మకం ఎందుకు అంత కష్టం

సెక్యూరిటీ గార్డులు అడ్డుకుంటారేమోనని భయపడే చాలా ప్రాంతాలను మనం ఊహించవచ్చు. పాకిస్తాన్‌ విషయానికి వస్తే మహిళల లోదుస్తులు అమ్మే షాపులు కూడా అలాంటి కేటగిరీలోకే రావచ్చు.

అక్కడ లోదుస్తుల గురించి మాట్లాడ్డం తప్పుగా భావించడం, అవి మహిళలకు సౌకర్యంగా ఉండేలా చూసే వాళ్లు ఉన్నతస్థానాల్లో ఎవరూ లేకపోవడంతో.. దేశంలో తమ కొలతలకు తగినట్టుండే లోదుస్తులు కొందరు సంపన్నులకే పరిమితమవుతున్నాయి.

15 నెలల క్రితం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రంగుల అద్దాలున్న ఒక షాపులోకి వెళ్లకుండా మార్క్ మూర్‌ను ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు.

మహిళల లోదుస్తుల షాపులోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని ఆయన్ను అడిగారు.

ఆయనొక దౌత్యాధికారి అని, భార్య కోసం లోదుస్తులు కొనడానికి వచ్చారని మూర్ స్నేహితుడు అబద్ధం చెప్పిన తర్వాత సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోపలికి వెళ్లనిచ్చారు.

మూర్ నిజానికి లీసెస్టర్‌కు చెందిన ఒక వ్యాపారి. ఆయన తన లక్ష్యానికి పనికొచ్చే ఒక పరిశోధన చేస్తున్నారు.

మార్క్ మూర్.. పాకిస్తానీ మహిళల కోసం అందుబాటు ధరలో, సౌకర్యంగా ఉండే హైక్వాలిటీ లోదుస్తులు తయారు చేయాలని అనుకుంటున్నారు.

సమస్యేంటంటే.. ఈ సెక్యూరిటీ గార్డులే కాదు, ఆయన ప్రయత్నానికి లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.

స్థానిక మార్కెట్లో నాసిరకం లోదుస్తులు కొనుక్కుంటూ ఉంటారు

మహిళల లోదుస్తుల విషయానికి వస్తే పురుషులకు, మహిళలకు వేరువేరు ఆలోచనలు ఉంటాయి.

అవి 'సెక్సీగా, ఆకట్టుకునేలా' ఉండాలని పురుషులు అనుకుంటారని మూర్ చెప్పారు.

"వాళ్లు లేసులు, ట్రాన్స్‌పరెంట్ ఫాబ్రిక్ లాంటి వాటి గురించి మాట్లాడుతారు. మహిళలు మాత్రం లోదుస్తుల విషయంలో సౌకర్యం, మన్నిక చూస్తారు" అని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌లో చాలామంది మహిళలకు ఖరీదైన లోదుస్తులను దిగుమతి చేసుకునేంత స్థోమత ఉండదు. అలాంటి సౌకర్యం, మన్నిక ఉన్న లోదుస్తులు పొందడమనేది వారికొక కల.

తక్కువ ధరకు వచ్చేవి వేసుకోవడం వల్ల వాటికి ఉండే హుక్స్, అండర్ వైర్స్ లాంటివి తుప్పుపట్టడం, పదునుగా ఉండి చర్మానికి గుచ్చుకోవడం, కోసుకుపోవడం లాంటివి జరుగుతుంటాయి.

"గత పదేళ్లుగా నేను కోరుకున్న షేప్, నా సైజు బ్రా కోసం నేను వెతుకుతూనే ఉన్నా. మెటీరియల్ సరిగా ఉండదు. అవి వేసుకుంటే చెమటపట్టినపుడు దురదలు వస్తాయి. నాకు కప్ చుట్టూ రాషెస్ వచ్చాయి" అని 27 ఏళ్ల హీరా ఇనామ్ బీబీసీకి చెప్పారు.

మార్కెట్లో చాలా మంది మహిళలు ఇలాంటి సమాధానమే చెప్పారు.

"నాకు ఫిట్‌గా ఉండే, నా చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రా వెతకడానికి నేను చాలా డబ్బు, టైం, ఎనర్జీ ఖర్చుపెట్టాను. కానీ ఇప్పటికీ అలాంటిది దొరకలేదు. కప్‌లో ఉన్న వైరింగ్ అసౌకర్యంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే అది చర్మాన్ని కోసేస్తుంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో మహిళ చెప్పారు.

వీటిని ఎక్కువగా రంగుల అద్దాలు ఉన్న షాపుల్లో అమ్ముతారు

అంటే, హై క్వాలిటీ, అందుబాటు ధరలో ఉండే లోదుస్తులకు అక్కడ చాలా డిమాండ్ ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ఎంఅండ్ఎస్, డెబెన్‌హామ్స్‌లో పనిచేసిన అనుభవం మార్క్ మూర్‌కు ఉంది.

పాకిస్తాన్ టెక్స్‌టైల్ హబ్ అయిన ఫైసలాబాద్‌లోని తన ఫ్యాక్టరీలో లోదుస్తులు తయారు చేస్తున్నారు..మూర్.

అయితే, అవి అమ్ముడు కాకుండా అలాగే పేరుకుపోతున్నాయి.

అలా ఎందుకు జరుగుతోంది

మొదటి కారణం ఏంటంటే వాటి గురించి చాలామందికి తెలీదు.

పాకిస్తానీ మహిళల కోసం మార్కెటింగ్ చేయడం చాలా కష్టమని నిరూపితమైంది. లోదుస్తులు కొనడం కాదు కదా, వాటి గురించి బహిరంగంగా చర్చించడం కూడా అక్కడ పెద్ద తప్పుగా చూస్తారు.

కాలక్రమేణా.. ఆనోటా ఈనోటా వీటిగురించి అందరికీ తెలిసింది.

30 ఏళ్ల క్రితం కరాచీలో కిటకిటలాడే మీనా బజార్లో మంచి క్వాలిటీ, ఫిట్ ఉండే లోదుస్తులు అమ్మే రీటైలర్ల వ్యక్తిగత సిఫారసుల ఆధారంగా అమ్మకాలు పెరిగాయి.

వాటికి దూరంగా ఉన్న మహిళల కోసం, కొనుగోలుదారులను ఆకట్టుకునేలా పత్రికల్లో జాగ్రత్తగా ఎంపిక చేసిన ప్రకటనలు వచ్చేవి.

కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ పత్రికలు పక్కనపడిపోయాయి.

ఫైసలాబాద్‌లోని మూర్ ఫ్యాక్టరీ మధ్య స్థాయి ఉత్పత్తులు తయారుచేస్తోంది

స్త్రీల లోదుస్తులు అమ్మే షాపులు విండో డిస్‌ప్లేలతో ఆకట్టుకునేలా ఉండవు.

పాకిస్తాన్‌లో పరిస్థితులను మూర్ కొన్ని నెలలపాటు గమనించారు.

లోదుస్తులు అమ్మే చాలా షాపులకు ఊరూపేరూ ఉండదు. వాటికి రంగుల అద్దాలు బిగించి ఉంటాయి. అంటే ఆ షాపులో ఏం అమ్ముతారో ఆ దారిలో వెళ్లేవారికి పెద్దగా తెలియదు.

కొన్ని షాపింగ్ సెంటర్లలో అండర్ వేర్ షాపులు ఉంటాయి. కానీ అక్కడకు కొంతమంది మాత్రమే వస్తుంటారు.

ఒక పెద్ద రీటైలర్ లేదా పెద్ద బ్రాండ్‌తో కలవాలని మూర్‌కు చాలా మంది సలహాలు ఇచ్చారు. అంటే మగవాళ్లు నిండిన బోర్డ్ రూంలో తక్కువ ధరలో, సౌకర్యవంతంగా ఉండి, సెక్సీగా ఉండని తన లోదుస్తుల కాన్సెప్ట్ గురించి ఆయన వివరించాల్సి ఉంటుంది.

"ఒకసారి నేను నా టీమ్ అక్కడున్న టేబుల్ మీద బ్రా, పాంటీస్ పెట్టగానే.. మగవాళ్లంతా నవ్వారు" అని ఆయన చెప్పారు.

"బ్రాలు, పాంటీలు లైంగిక ఆసక్తిని రేకెత్తించే ఉత్పత్తులు కావని ప్రజలకు తెలిసేలా చేయడమే ఇప్పుడు నా అతిపెద్ద ఉద్యమం" అని మూర్ అన్నారు.

నేను వినియోగదారులకు సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అందించే ఉత్పత్తిని తయారు చేస్తున్నాను. వాటిని అమ్మడం, కొనడం సర్వ సాధారణం కావాలి" అని ఆయన అన్నారు.

కానీ ఆరోజు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది.

లోదుస్తులను మామూలుగా కొనే రోజు రావాలని మూర్ భావిస్తున్నారు

మార్క్ మూర్ చూసిన చాలా తయారీ కంపెనీల్లో లోదుస్తుల తయారీని ఆమోదించే డిజైనర్లు, అధికారులు అందరూ పురుషులే.

"అలాంటి మగాళ్ల కోసం మేం మా ఐడియాలు చెప్పాల్సి ఉంటుంది" అని ఫైసలాబాద్‌ ఫ్యాక్టరీలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న కామర్ జమాన్ అన్నారు.

"సలహాల కోసం లేదంటే సాయం కోసం మహిళలను అక్కడికి పిలిపిస్తుంటారు. కానీ అక్కడ సంభాషణ ఇబ్బందికరంగా ఉంటుంది. మగాళ్లతో నిండిన బోర్డ్ రూంలో లోదుస్తుల్లో తమకు ఏది నచ్చిందో చెప్పడం వారికి అంత సౌకర్యంగా ఉండదు" అని జమాన్ చెప్పారు.

అయితే తన సొంత ఫ్యాక్టరీలో ఉన్నత ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవాలనుకున్న మూర్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

"మేం ఉన్నత ఉద్యోగాల్లో మహిళలను నియమించడానికి ప్రకటనలు కూడా ఇచ్చాం. కానీ, వచ్చిన వారిలో కొందరు 'మా ఇంట్లో వాళ్లతో మాట్లాడి చెబుతాం అన్నారు. తర్వాత వారిలో ఇద్దరు లోదుస్తుల ఫ్యాక్టరీలో పనిచేయడానికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని చెప్పారు" అని మూర్ వివరించారు.

ఈ ఫ్యాక్టరీలో మహిళలు పనిచేయడం కూడా తప్పుగానే భావిస్తున్నారు

"నేను ఇక్కడికి ఇంటర్వ్యూకు వచ్చినపుడు నాతోపాటూ మా ఆయన వచ్చాడు. నేను సెలక్ట్ అయ్యాక, నువ్విక్కడ పనిచేస్తున్నావనే విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ విషయాన్ని పెద్దది చేస్తారని అన్నారు" అని ఆ ఫ్యాక్టరీలో పనిచేసే సుమైరా చెప్పారు.

ఇంటర్వ్యూకు వచ్చే ముందు కుట్టుపని ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్తున్నానని తన తండ్రికి చెప్పానని మరో ఉద్యోగి అన్నారు.

"మా నాన్న నా మాట అసలు వినలేదు. నేను ఫ్యాక్టరీకి వెళ్లి చూసొస్తానని, అక్కడ వాతావరణం సరిగా లేకుంటే ఆ ఉద్యోగం చేయనని నేను ఆయనకు నచ్చజెప్పాల్సి వచ్చింది" అన్నారు.

ఈ ఫ్యాక్టరీలో పనిచేసే పురుషులు కూడా మాటలుపడ్డారు

లోదుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసే మగవాళ్లు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది.

తన ఉద్యోగం గురించి మొదట కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్వర్ బీబీసికి చెప్పారు.

"నేనెక్కడ పనిచేస్తున్నానో తెలిసి నా స్నేహితులు ఆటపట్టించారు. మా ఇంట్లోవాళ్లు ఫ్యాక్టరీకి పంపించడానికి ఇష్టపడలేదు. చివరికి నేను జాయినయ్యాను. కుట్టిన బ్రాను మరో మహిళా ఉద్యోగికి అందిస్తుంటే మొదట్లో సిగ్గుపడేవాడిని. కానీ ఇప్పుడు చాలా మెరుగ్గా, సౌకర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది కూడా ఒక పనే కదా" అని అన్వర్ అన్నారు.

ఇప్పుడు ఫ్యాక్టరీ ఉద్యోగులకు వేరే సమస్యలొచ్చిపడ్డాయి.

తన ప్రయత్నం ఫలించకపోతే ఫ్యాక్టరీని నడపడం కష్టమని మూర్ నిర్ణయం తీసుకోవచ్చు.

ఫ్యాక్టరీ మూసేస్తే ఎంతోమంది ఉద్యోగులు హఠాత్తుగా రోడ్డున పడతారు.

అయితే ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం తనకు లేదని ఆయన బీబీసీకి చెప్పారు.

"పాకిస్తాన్‌లో ఇవి అమ్ముడయ్యేలా ఏదో ఒక దారి వెతకాలని మూర్ నాతో చెప్పారు. లోదుస్తులు అమ్మాలనే ఆలోచన ఇక్కడ పనిచేయదు. దాన్ని వదిలేయాలనే ఒక కోణం మాత్రం ఉంది. కానీ ఈ ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పారు మూర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is it difficult to sell women's inner wear in Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X