• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీలంకలో ఆహార అత్యవసర పరిస్థితి ఎందుకు? ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?

By BBC News తెలుగు
|
శ్రీలంక

శ్రీలంకలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన కఠినమైన లాక్‌డౌన్‌లతో నిత్యవసరాలను కొనుక్కోవడానికి ప్రజలు భారీగా లైన్లలో నిలబడుతున్నారు.

ప్రభుత్వ సూపర్‌మార్కెట్లలో సరకులు దాదాపుగా అడుగంటిపోయాయి. కొన్నిచోట్ల పూర్తిగా ఖాళీ అయిపోయాయి. పాల పొడి, బియ్యం వంటి దిగుమతి చేసుకునే ఇతర ఆహార వస్తువులు కూడా ఇక్కడ పరిమితంగానే దొరుకుతున్నాయి.

అయితే, ఆహార ఉత్పత్తుల కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. కావాలనే మీడియా అన్నింటినీ ఎక్కువచేసి చూపిస్తోందని ఆరోపిస్తోంది.

ఆ తర్వాత కొన్ని రోజులకే ఇక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విదేశీ మారక నిల్వల సంక్షోభం నడుమ శ్రీలంక కేంద్ర బ్యాంకు అధిపతిని కూడా పదవి నుంచి తప్పించారు.

శ్రీలంక

ప్రభుత్వం ఏం చేసింది?

నిత్యవసర వస్తువుల సరఫరాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటాబాయ రాజపక్స ఆగస్టు 30న వెల్లడించారు.

ఆహారపు పదార్థాల అక్రమ నిల్వలు, ద్రవ్యోల్బణం కట్టడికి ఈ అత్యవసర పరిస్థితి తప్పనిసరని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

శ్రీలంక రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. మరోవైపు ధరలు, విదేశీ అప్పులు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ విదేశీ పర్యటకం కూడా భారీగా దెబ్బతింది.

ఇక్కడి ఆర్థిక వ్యవస్థ కొన్ని నెలల ముందువరకు పురోగతి బాటలోనే నడిచేది. ఆసియాలోని పటిష్ఠ ఆర్థిక వ్యవస్థల్లో శ్రీలంక ఒకటిగా కొనసాగేది.

2019లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ స్థాయిని ''అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీ’’కి ప్రపంచ బ్యాంకు పెంచింది.

అదే సమయంలో దేశ రుణ భారం కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ)లో 39 శాతంగా ఉన్న అప్పులు.. 2019నాటికి 69 శాతానికి పెరిగాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

శ్రీలంక

ధరలకు ఏమైంది?

ఆర్థిక సంక్షోభం నడుమ కొన్ని నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

పంచదార, ఉల్లిపాయలు, పప్పుల ధరలు కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి.

మేలో పతాకస్థాయికి చేరిన బియ్యం ధరలు.. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వచ్చాయి. రిటైల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణ విధించడమే దీనికి కారణం.

వ్యాపారుల నుంచి ఆహార పదార్థాలు, నిత్యవసరాలను కొనుగోలుచేసి, తక్కువ ధరలకే ప్రజలకు అందించేందుకు అత్యవసర పరిస్థితి నిబంధనలు తోడ్పడుతున్నాయి.

ఆహార పదార్థాల కొరతపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు దేశ ఆర్థిక శాఖ స్పందిస్తూ... ''ఇవన్నీ కృత్రిమంగా సృష్టిస్తున్న కొరతలే’’అని చెప్పింది.

''కొందరు కావాలనే కొరత ఉందని చెబుతున్నారు. దీని వల్ల మార్కెట్‌లో ఆహారపు ధరలు పెరుగుతున్నాయి’’ అని పేర్కొంది.

''అన్ని వేళల్లోనూ అన్ని నిత్యవసర సరకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మేం కచ్చితంగా చెప్పగలం’’ అని బీబీసీకి శ్రీలంక ఆర్థికశాఖ వెల్లడించింది.

శ్రీలంక

మరోవైపు ఈ ఆహార ఉత్పత్తుల కొరత వార్తల వెనుక ఉన్నది ప్రధాన ప్రతిపక్షమే అని కేంద్రమంత్రి అజిత్ నివార్ద్ కబ్రల్ ఆరోపించారు.

పంచదార, బియ్యం, పప్పులు, పాలపొడి లాంటి సరకుల కోసం షాపుల ఎదుట భారీ వరుసలు కనిపిస్తున్నాయి.

''నేను గంటసేపు లైన్‌లో నిలబడ్డాను. అయితే, బియ్యం, పాల పొడి దొరకలేదు. నా వరకు వచ్చేసరికే అవి అయిపోయాయి’’ అని కొలంబో శివార్లలోని గంపాహా ప్రభుత్వ సూపర్‌మార్కెట్‌ ఎదుట వరుసలో నిలబడిన రమ్య శ్రియానీ చెప్పారు.

మరోవైపు, అత్యవసర పరిస్థితిని ప్రకటించడంపై శ్రీలంక పార్లమెంటు సభ్యులు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు చట్టాలు అందుబాటులో ఉన్నప్పుడు.. అత్యవసర పరిస్థితి ఎందుకు విధించాల్సి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.

''ఇది కేవలం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం, దేశాధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నమే. దేశ ప్రజల ప్రాణాలను వారు పణంగా పెడుతున్నారు’’ అని శ్రీలంక పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీకి చెందిన ఎరన్ విక్రమరత్నే చెప్పారు.

శ్రీలంక

సేంద్రియ వ్యవసాయమే కారణమా?

గత ఏప్రిల్‌లో రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మొక్కల్ని నిర్వీర్యంచేసే రసాయనాల దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

అయితే ప్రభుత్వ చర్యలు, వీటి అమలు విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

''మేం సేంద్రియ వ్యవసాయానికి వ్యతిరేకం కాదు. నిజమే నాసిరకమైన ఎరువులను, రసాయనాలను దిగుమతి చేస్తున్నారు. అయితే అన్నింటిపైనా రాత్రికిరాత్రే నిషేధం విధించడం సరికాదు’’ అని ఆల్ సిలోన్ ఫార్మ్స్ ఫెడరేషన్ నేషనల్ ఆర్గనైజర్ నమల్ కరుణరత్నే చెప్పారు.

ఒక్కసారిగా సేంద్రియ వ్యవసాయానికి మారడంతో ఉత్పత్తులపై పెద్దయెత్తున ప్రభావం పడిందని కొందరు రైతులు చెబుతున్నారు.

''రసాయన ఎరువులతో పోలిస్తే, సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంతో మా మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది’’ అని అంపారా జిల్లా రైతుల సంఘం అధ్యక్షుడు హెచ్‌సీ హేమకుమార అన్నారు.

శ్రీలంక

శ్రీలంకలోని రైతుల్లో 90 శాతం మంది రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారని జులైలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఇక్కడ వరి, రబ్బరు, టీ పండించేవారు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు.

వ్యవసాయ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో టీ వాటా ఇక్కడ పది శాతం వరకు ఉంటుంది. తాజా మార్పులతో తమ దిగుబడి 50 శాతం వరకు తగ్గిపోయిందని కొందరు రైతులు చెబుతున్నారు.

ఒక్కసారిగా ఇలా సేంద్రియ వ్యవసాయానికి మళ్లితే దేశ ఆహార భద్రతకే ముప్పని జర్మనీలోని హోహెన్‌హీమ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు చెందిన ప్రొఫెసర్ సాబైన్ జికేలి అన్నారు.

''ఒక్కసారిగా మనం సేంద్రియ వ్యవసాయానికి మారకూడదు. ఇది దశల వారీగా జరగాలి’’అని ఆమె వివరించారు.

''సేంద్రియ వ్యవసాయానికి సాధారణంగా మూడేళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఈ సమయం అనేది దేశ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పారు.

శ్రీలంక

భూటాన్‌లోనూ ఇలానే

సేంద్రియ వ్యవసాయానికి మళ్లుతున్నట్లు 2008లో భూటాన్ ప్రకటించింది. 2020నాటికి వంద శాతం సేంద్రియ వ్యవసాయ దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ఈ లక్ష్యానికి భూటాన్ చాలా దూరంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. సేంద్రియ వ్యవసాయం వల్ల దేశ వ్యవసాయ దిగుబడి బాగా తగ్గిందని, ఫలితంగా దిగుమతులు పెరిగాయని వెల్లడైంది.

శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ముప్పుందని జికేలి హెచ్చరించారు. భూటాన్‌పై అధ్యయనం చేపట్టినవారిలో ఆమె కూడా ఒకరు.

''ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఆహార భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశముంది’’ అని హెచ్చరించారు.

శ్రీలంక

శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా విదేశీ అప్పులు తీర్చడానికే చాలా నిధులు వెచ్చించాల్సి వస్తోంది.

2019 నవంబరులో ఇక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు.. గత జులైనాటికి 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

మొత్తంగా నాలుగు బిలియన్ డాలర్లకుపైనే శ్రీలంకకు విదేశీ అప్పులు ఉన్నాయి. వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

పంచదార, గోధుమ, డెయిరీ ఉత్పతులు, వైద్య సామగ్రి లాంటి అత్యవసర సరకుల దిగుమతులపై ఈ సంక్షోభం మరింత ప్రభావం చూపే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Why is there a food emergency in Sri Lanka? Did prices rise as a result of government action
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X