వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోనల్డ్ ట్రంప్ ఆ ఓటింగ్ యంత్రాలను ఎందుకు తప్పుపడుతున్నారు? వాటిలో నిజంగా లోపాలు ఉన్నాయా? - రియాలిటీ చెక్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఓటింట్ యంత్రం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాడిన కొన్ని యంత్రాల వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అంటున్నారు. జనాలు తనకు వేసిన లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, తన ప్రత్యర్థికి బదిలీ అయ్యాయని ఆయన ఆరోపించారు.

డొమినియన్ ఓటింగ్ సిస్థమ్స్ సంస్థకు చెందిన ఓటింగ్ యంత్రాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఈ విమర్శలు చేశారు. తనకు పడ్డ ఓట్లను తొలగించారని, తన రాజకీయ ప్రత్యర్థుల కనుసన్నల్లో ఆ సంస్థ నడుస్తోందని... ఇలా రకరకాల ఆరోపణలు ట్రంప్ చేశారు.

ఇంతకీ ఆయన చేస్తున్న వాదనలేంటి? వాటిలో వాస్తవం ఉందా?

అమెరికా ఎన్నికలు

ట్రంప్: ''దేశ వ్యాప్తంగా నాకు పడిన 27 లక్షల ఓట్లను డొమినియన్ తొలగించింది’’

వాస్తవం: ఈ ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ లేవు.

ట్రంప్ అనుకూల మీడియా 'వన్ అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్’ (ఓఏఎన్ఎన్)లో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ ఆరోపణ చేశారు.

దేశవ్యాప్తంగా తనకు పడ్డ లక్షల ఓట్లను డొమినియన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ తొలగించిందని అన్నారు.

ఎడిసన్ రీసెర్చ్ అనే ఎన్నికల పరిశీలన సంస్థ ఈ విషయమై సమాచార విశ్లేషణ చేసిందంటూ ఓఏఎన్ఎన్ తమ కథనంలో పేర్కొంది.

అయితే, ఓఏఎన్ఎన్ చెబుతున్నట్లుగా తాము ఎలాంటి నివేదికా ఇవ్వలేదని, ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని ఎడిసన్ రీసెర్చ్ సంస్థ ప్రెసిడెంట్ లారీ రోసిన్ వెల్లడించారు.

తమ ఆరోపణలకు ఓఏఎన్ఎన్ ఎలాంటి రుజువులూ చూపలేదు.

ట్రంప్ ట్వీట్

కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్‌కు పడ్డ ఓట్లను బైడెన్‌కు పడ్డట్లుగా డొమినియన్ ఓటింగ్ యంత్రాలు మార్చాయని 'ఫాక్స్ న్యూస్’ టీవీ చానెల్ వ్యాఖ్యాత శాన్ హనీటి చెబుతున్న కథనాన్ని కూడా ట్రంప్, ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మిషిగన్ రాష్ట్రంలోని ఆంట్రిమ్ కౌంటీలో డొమినియన్ ఓటింగ్ యంత్రాల్లో సమస్య వచ్చిందని, మిగతా కౌంటీల్లోనూ ఈ తరహా సాఫ్ట్‌వేర్ లోపం ఉండొచ్చని ఆ కథనంలో ఉంది.

''ఆంట్రిమ్ కౌంటీలో ఓ సమస్య వచ్చిన మాట నిజమే. కానీ, దానికి కారణం డొమినియన్ సాఫ్ట్‌వేర్ కాదు. మానవ తప్పిదం వల్లే అది జరిగింది’’ అని మిషిగన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాసెలిన్ బెన్సన్ చెప్పారు.

ఆంట్రిమ్ కౌంటీ ఎన్నికల సిబ్బంది ఒకరు యంత్రాన్ని సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు. బైడెన్ 3 వేల ఓట్ల తేడాతో గెలిచినట్లు మొదట ఫలితం వచ్చింది.

రిపబ్లికన్ పార్టీ మద్దతు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఫలితం రావడంతో ఎన్నికల అధికారుల అనుమానం వచ్చి యంత్రాన్ని మరోసారి సరిగ్గా కాన్ఫిగర్ చేసి ఫలితం చూశారు. అప్పుడు ట్రంప్ 2,500 ఓట్ల తేడాతో గెలిచినట్లు చూపించింది.

''మొదట వచ్చిన లెక్క తప్పు అని త్వరగా గుర్తించి సరిచేశారు. ఒక వేళ అప్పుడు గుర్తించకున్నా, అది తర్వాతి దశలో బయటపడేదే. ఇలాంటి పొరపాట్లను గుర్తించేందుకు తనిఖీ ప్రక్రియ కూడా అందులో ఉంది. ఇలాంటి పొరపాట్లు రాష్ట్రంలో ఇతర చోట్ల జరిగినట్లు ఏ ఆధారాలూ లేవు’’ అని బెన్సన్ చెప్పారు.

జార్జియా రాష్ట్రంలోనూ డొమినియన్ ఓటింగ్ యంత్రాలను చాలా వాడారు. డొమినియన్ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలూ కనిపించలేదని జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్పారు.

'మా ఓటింగ్ యంత్రాలు ఓట్లను తొలగించాయని, తారుమారు చేశాయని కొందరు చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం అవాస్తవం’ అంటూ డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

తప్పుడు సమాచారం

ట్రంప్: ''డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ 'రాడికల్ లెఫ్ట్’ సొంత సంస్థ’’

వాస్తవం: డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ 'రాడికల్ లెఫ్ట్’ సొంతం కాదు. గతంలో అటు రిపబ్లికన్లకూ, ఇటు డెమొక్రాట్లకు ఆ సంస్థ విరాళాలు ఇచ్చింది.

ట్రంప్ 'రాడికల్ లెఫ్ట్’ అని ఎవరిని ఉద్దేశించి అంటున్నారన్నదానిపై స్పష్టత లేదు. అయితే, డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్‌తో క్లింటన్ కుటుంబం, నాన్సీ పెలోసీ తదితర డెమొక్రటిక్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ ఇంటర్నెట్‌లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. ట్రంప్ కూడా ఇవే ఆరోపణలు చేస్తుండవచ్చు.

డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు గతంలో విరాళాలు ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులను ఆశించే ఇలాంటి సంస్థలు తమ లాబీయింగ్ కోసం ఇలా విరాళాలు ఇవ్వడం అమెరికాలో సాధారణమే.

తాము ఏ రాజకీయ పార్టీ సొంతమూ కాదని... పెలోసీ, క్లింటన్ కుటుంబాల సభ్యులతో యాజమాన్యపరంగా తమకు ఎలాంటి సంబంధాలూ లేవని డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్‌లో తమకు ఎలాంటి వాటాలూ లేవని, ఆ సంస్థ కార్యకలాపాల్లో తాము ఎప్పుడూ భాగం కాలేదని క్లింటన్ ఫౌండేషన్ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థతో తాము ఇప్పుడు కలిసి పనిచేయడం లేదని పేర్కొంది.

2014లో క్లింటన్ ఫౌండేషన్‌కు డొమినియన్ విరాళాలు ఇచ్చింది. పేద దేశాలకు ఎన్నికల సాంకేతికను అందించడంలో సాయపడేందుకు ముందుకు వచ్చింది.

రిపబ్లికన్ సెనేట్ మెజార్టీ నాయకుడు మిచ్ మెక్‌కానెల్ సెనెట్ కమిటీకి కూడా డొమినియన్ విరాళాలు అందజేసింది.

పెలోసీకి గతంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన నదీమ్ ఎల్షామీని డొమినియన్ తమ సంస్థలో నియమించుకుంది. పెలోసికి ఈ సంస్థతో సంబంధాలున్నాయని చెబుతున్నవారు ఈ నియమాకం గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే, గతంలో రిపబ్లికన్ పార్టీతో సంబంధాలున్నవారిని కూడా డొమినియన్ నియమించుకుంది.

ఇటీవల అమెరికా ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ ట్రాన్సిషన్ టీమ్ సభ్యులకు కూడా డొమినియన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

డొమినియన్ అనుబంధ సంస్థ స్మార్ట్మాటిక్‌కు బైడెన్ టీమ్‌లో సభ్యుడైన పీటర్ నెఫ్పెంగర్‌ ఛైర్మన్‌గా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

స్మార్ట్మాటిక్‌కు పీటర్ ఛైర్మన్‌గా ఉన్న మాట వాస్తవమే. కానీ, ఆ సంస్థ డొమినియన్‌కు అనుబంధ సంస్థ కాదు... దానితో పోటీపడుతున్న ప్రత్యర్థి సంస్థ.

అమెరికా ఎన్నికలు

ట్రంప్: ''టెక్సాస్‌తో పాటు చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు సరిగ్గా లేవని తిరస్కరించారు’’

వాస్తవం: ఓటింగ్ యంత్రాలకు టెక్సాస్ సర్టిఫికేషన్ (ఆమోదం) ఇవ్వని మాట నిజమే. ఆ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు భిన్నమైన విధానాన్ని అనుసరించింది.

అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఓటింగ్ యంత్రాలను సర్టిఫై చేసేందుకు దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రమాణాలను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

అయితే, టెక్సాస్ రాష్ట్రం ఇంకొన్ని అదనపు ప్రమాణాలను నిర్దేశించుకుంది. ఏ ఓటుకు ఆ ఓటును గుర్తించేలా, ప్రతి బ్యాలెట్‌కూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలన్నది వీటిలో ఒకటి. డొమినియన్ ఓటింగ్ యంత్రాలు ఈ సదుపాయం కల్పించలేదు.

అయితే, అన్నీ రాష్ట్రాల్లో ఇలా బ్యాలెట్లపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు ఉండవు. ఓటర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఇలా చేయకూడదని కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపు

''ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పెట్టడం భద్రతపరంగా మంచిదే. కానీ, అదే సమయంలో ఓటర్ల గోప్యతకు సమస్య కూడా. రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య నిబంధనలు, ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేశాయనే విశ్వాసం నాకుంది’’ అని టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త, ఓటింగ్ యంత్రాలపై జాతీయ మార్గదర్శకాల విషయంలో సలహాదారుడిగా ఉన్న డాన్ వలాక్ అన్నారు.

''ఓటింగ్ సిస్టమ్ ఓట్లను తొలగించిందని గానీ, ఓట్లు గల్లంతు లేదా తారుమారు అయ్యాయని గానీ చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Trump blames the voting machines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X