• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్‌తో బ్రెజిల్‌లో చాలామంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు..

By BBC News తెలుగు
|

కోవిడ్ మహమ్మారి ప్రారంభమై ఏడాదిపైనే అవుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.

కరోనావైరస్ చిన్నపిల్లలకు అరుదుగా సోకుతుందనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ బ్రెజిల్‌లో 1,300 పిల్లలు కోవిడ్ బారినపడి చనిపోయారు.

జెస్సికా రికార్టేకు ఏడాది నిండిన బాబు ఉన్నాడు.

బాబుకు ఒంట్లో నలతగా ఉండడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.

తనకున్న లక్షణాలు కోవిడ్ లక్షణాలు కాదని చెప్తూ డాక్టర్ ఆ బాబుకు కోవిడ్ పరీక్షలు చేయలేదు.

రెండు నెలల తరువాత ఆ బాబుకు అనారోగ్యం ఎక్కువై చనిపోయాడు.

టీచర్‌గా పని చేస్తున్న జెస్సికాకు మొదట్లో పిల్లలు పుట్టలేదు. రెండేళ్లపాటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసి, ఇంక పిల్లలు పుట్టరని నిశ్చయించుకున్నాక ఈ బాబు పుట్టాడు.

తనకు లూకాస్ అని పేరు పెట్టారు. లూకాస్ అంటే వెలుగు అని అర్థం. తమ జీవితాల్లో వెలుగు నింపాడని బాబుకు ఆ పేరు పెట్టుకున్నామని జెస్సికా చెప్పారు.

లూకాస్ తిండి తినడానికి ఎప్పుడూ మారాం చేయడు. కానీ కొన్ని రోజులుగా సరిగా తినకపోవడంతో జెస్సికాకు అనుమానం వచ్చింది.

బాబుకు పళ్లు వస్తున్నాయేమో అనుకున్నారు. కానీ బాబుకు జ్వరంతో పాటూ, శ్వాస తీసుకోవడం కష్టమయింది. అప్పుడు వెంటనే లూకాస్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయాలని డాక్టర్‌ను అడిగారు.

"ఆక్సీమీటర్‌తో చెక్ చేస్తే లూకాస్‌కు ఆక్సిజన్ స్థాయి 86% చూపించింది.

అంటే సాధారణ స్థాయిలోనే ఉంది" అని జెస్సికా చెప్పారు.

లూకాస్‌కు జ్వరం లేదు. అందుకని డాక్టర్ కోవిడ్ పరీక్షలు చేయించక్కర్లేదని చెప్పారు. అది సాధారణ గొంతు నొప్పి, జలుబు కావొచ్చని అన్నారు.

పిల్లల్లో కోవిడ్ చాలా అరుదుగానే కనిపిస్తోందని చెప్పి బాబుకు కొన్ని యాంటీబయోటిక్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు.

లూకాస్‌కు ప్రైవేట్‌గా మరోచోట పరీక్ష చేయించే అవకాశం లేకపోయింది.

10 రోజులు యాంటీబయోటిక్స్ వాడిన తరువాత లూకాస్‌కు మిగతా లక్షణాలు తగ్గాయిగానీ విపరీతంగా నీరసం మాత్రం అలాగే ఉండిపోయింది. దాంతో అది కోవిడ్ కావచ్చనే అనుమానం జెస్సికాకు బలపడింది.

"నేను మా అత్తగారికి, అమ్మావాళ్లకి, బాబును చూసుకునే ఆయాకు చెప్తూనే ఉన్నాను. కానీ, వాళ్లెవరూ నమ్మలేదు. నేను ఊరికే భయపడుతున్నానని, టీవీ చూడొద్దు, న్యూస్ చూడొద్దని నాకు సలహా ఇచ్చారు. కానీ నాకు తెలుసు, నా బాబు మామూలుగా లేడు. తను సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నాడు"

అది 2020 మే, కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈశాన్య బ్రెజిల్‌లోని సియర్‌లో టాంబోరిల్‌లో అప్పటికే కోవిడ్ వల్ల ఇద్దరు చనిపోయారు.

"అక్కడ అందరూ అందరికీ తెలుసు. ఈ మరణ వార్తలు వినగానే అందరం షాక్ అయ్యాం"

అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మళ్లీ ఆస్పత్రికి వెళుతూ ఉంటే జెస్సికాకు, లూకాస్‌కు కరోనా సోకుతుందేమోనని జెస్సికా భర్త ఇజ్రాయెల్ భయపడ్డారు.

కానీ రోజులు గడుస్తున్నకొద్దీ లూకాస్ ఒంట్లో ఏమీ బాగుండలేదు. ఎక్కువగా నిద్రపోతూ ఉన్నాడు.

జూన్ 3న, లూకాస్‌కు ఎడతెరిపి లేకుండా వాంతులు అయ్యాయి.

బాబును ఇంక ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పలేదు. అప్పుడు డాక్టర్ లూకాస్‌కు కోవిడ్ టెస్ట్ చేశారు.

లూకాస్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బాబును సోబ్రల్‌లో ఉన్న కోవిడ్ ఐసీయూలో చేర్చారు. అక్కడ లూకాస్‌కు మల్టీ-సిస్టం ఇంఫ్లమేటరీ సిండ్రోం (ఎంఐఎస్) ఉందని నిర్థరించారు.

ఇది కోవిడ్ వల్లే వస్తుంది. వైరస్, ముఖ్యమైన అవయవాల్లో ఇంఫ్లమేషన్‌కు కారణం అవుతుంది.

పిల్లలకు కరోనావైరస్ సోకిన ఆరు వారాల వరకూ ఈ సిండ్రోం వారిని బాధపెడుతుంది. అయితే, ఇది చాలా అరుదు.

కానీ మహమ్మారి సమయంలో ఈ కేసులు బాగా పెరుగుతున్నాయని సావో పావోలో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్ట్ డాక్టర్ ఫాతిమా మారినో తెలిపారు.

అయితే అన్ని మరణాలకూ ఈ సిండ్రోం కారణం కాకపోవచ్చని ఆమె అన్నారు.

టాంబోరిల్‌ నుంచి సోబ్రల్‌కు రెండు గంటల ప్రయాణం. లూకాస్‌ ఉన్న గదిలో ఎక్కువసేపు ఉండడానికి జెస్సికాకు అనుమతి లేదు. మనసు మళ్లించుకోవడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేసేవారు.

"ఆ మిషన్ శబ్దం బీప్ బీప్ అని వినిపిస్తూనే ఉండేది. మిషన్ ఆగిపోయే వరకు ఆ శబ్దం వినిపించింది. మిషన్ ఆగిపోయింది. అంటే ఆ మనిషి ఇంక లేడు అని మాకు తెలుసు. కానీ, కొద్ది క్షణాల తరువాత మళ్లీ మిషన్ చేసే బీప్ శబ్దం వినిపించింది. నేను ఏడ్చేశాను" అని జెస్సికా చెప్పారు.

లూకాస్‌కు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. కానీ, వాళ్లు బాబును మళ్లీ బతికించగలిగారు.

లూకస్‌కు ప్రమాదకరం అనిపించే లక్షణాలు ఏమీ లేవని, అయినా సరే తన కండీషన్ చాలా సీరియస్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందని లూకాస్‌కు చికిత్స చేసిన డాక్టర్ చెప్పారు.

కోవిడ్ బారిన పడిన చాలామంది పిల్లలకు కోమార్బిడిటీస్ ఉన్నట్లు లేదా అధిక బరువు ఉన్నట్లు తేలిందని ఫోర్టలేజా పిల్లల ఆస్పత్రిలో డాక్టర్ లోహన్నా టవరెస్ తెలిపారు. కోమార్బిడిటీస్ అంటే డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్‌లాంటి ఉన్న కండిషన్లు. ఇవి ముందు నుంచే ఉన్నవి.

అయితే లూకాస్‌కు ఇలాంటి సమస్యలేవీ లేవు.

లూకాస్ 33 రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు. ఆ సమయంలో జెస్సికాను మాత్రమే బాబును చూసేందుకు అనుమతించేవారు.

లూకాస్‌కు ఇమ్యునోగ్లోబులిన్ అనే ఖరీదైన మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తు అది లూకాస్‌కు తేలికగానే లభించింది.

లూకాస్ పరిస్థితి మరింత దిగజారడంతో ఇమ్యునోగ్లోబులిన్ రెండో డోసు కూడా అవసరమైంది.

లూకాస్‌కు కాస్త మెరుగవడంతో తనకు పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ తీసేశారు. తనకు స్పృహ రావడంతో వీడియో కాల్ చేసి జెస్సికా, ఇజ్రాయెల్‌లతో మాట్లాడించారు.

"మా గొంతు వినగానే లూకాస్ ఏడ్చేశాడు" అని జెస్సికా చెప్పారు.

వాళ్లు బాబును ప్రాణాలతో చూడడం అదే చివరిసారి. తరువాతి వీడియో కాల్‌లో బాబులో చలనం లేదు.

లూకాస్‌కు మళ్లీ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు నిర్థరించారు.

అయితే, లూకాస్‌కు తగ్గిపోతుందని, త్వరలోనే ఐసీయూ నుంచి బయటికొస్తాడని డాక్టర్లు జెస్సికా దంపతులకు భరోసా ఇచ్చారు.

"ఆరోజు రాత్రి నా సెల్ ఫోన్ సైలెంట్‌లో పెట్టి పడుకున్నాను. లూకాస్ వచ్చి నన్ను ముద్దుపెట్టుకున్నట్టు కల వచ్చింది. చాలా ఆనందం కలిగింది. పొద్దున్న లేచేసరికి హాయిగా అనిపించింది. అప్పుడే నా సెల్ చూసుకుంటే డాక్టర్ దగ్గర నుంచి 10 కాల్స్ ఉన్నాయి.

లూకాస్ ఆక్సిజెన్ లెవెల్స్ బాగా పడిపోయాయని, హార్ట్ రేట్ తగ్గిపోయిందని, తెల్లవారుజామునే లూకాస్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

లూకాస్‌ను మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడే కోవిడ్ టెస్ట్ చేసి ఉంటే తన బాబు బతికి ఉండేవాడని జెస్సికా అంటున్నారు.

"డాక్టర్లకు అనిపించినా అనిపించకపోయినా కోవిడ్ టెస్ట్ చేయడం ముఖ్యం. చిన్నపిల్లలకు లోపల ఏమవుతోందో తెలీదు, వాళ్లు చెప్పలేరు. మనమే పరీక్షలు చేసి తెలుసుకోవాలి" అని ఆమె అన్నారు.

వ్యాధికి తగ్గట్టుగా సరైన చికిత్స అందించకపోవడం వల్లే లూకాస్ కండిషన్ సీరియస్ అయిపోయిందని జెస్సికా భావిస్తున్నారు.

"లూకాస్ ఊపిరితిత్తులు 70% పనిచేయలేదు, గుండె సైజు 40% పెరిగింది. ఈ పరిస్థితే రాకుండా కాపాడి ఉండవచ్చు" అని ఆమె అన్నారు.

అందుకు డాక్టర్ మోంటే కూడా అంగీకరించారు. ఎంఐఎస్ రాకుండా ఆపలేకపోవచ్చుగానీ వ్యాధిని ముందే గుర్తించి ఉంటే పరిస్థితి తీవ్రం అయేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

"పరిస్థితి బాగా దిగిజారిపోయిన తరువాత లూకాస్ ఐసీయూకు వచ్చాడు. ముందే ఆస్పత్రిలో చేర్చి ఉంటే ఆ బాబును కాపాడగలిగి ఉండేవాళ్లం" అని డాక్టర్ మోంటే తెలిపారు.

తన కథను అందరితో పంచుకోవాలని, అందరికీ ఇదొక హెచ్చరికగా ఉండాలని జెస్సికా కోరుకుంటున్నారు.

"మీ పోస్టులు చూసి మేము జాగ్రత్తపడ్డాం. మా బిడ్డను సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాం. మా బిడ్డను కాపాడుకోగలిగాం అని నాకు చాలామంది చెప్తూ ఉంటారు.

"నాకు ఏదైతే దక్కలేదో అది వీరికి దక్కేలా చేయడమే నా ఉద్దేశం. నాకు కావాల్సినప్పుడు సరైన సమాచారం, సహాయం అందలేదు. నాకు ఇలాంటి సమాచారం ఉండుంటే నేను మరింత జాగ్రత్తపడేదాన్ని" అని జెస్సికా తెలిపారు.

పిల్లల్లో కోవిడ్

'పిల్లలకు కరోనావైరస్ సోకదనేది అపోహ'

పిల్లలకు కరోనావైరస్ సోకదనే అపోహలు ఉన్నాయని, తన పరిశోధనలో పిల్లలకు, పసిబిడ్డలకు కరోనా సోకిన కేసులు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ ఫాతిమా మరినో అంటున్నారు.

బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం..2020 ఫివ్రబరి నుంచి 2021 మార్చి 15 లోపల బ్రెజిల్‌లో కోవిడ్ బారిన పడి కనీసం 852 మంది తొమ్మిదేళ్ల లోపు పిల్లలు చనిపోయారు. వీరిలో ఏడాది వయసున్న పసిబిడ్డలు 518 మంది ఉన్నారు.

అయితే, తన అంచనాల ప్రకారం కోవిడ్ బారిన పడి ఇంతకు రెట్టింపు సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని డాక్టర్ ఫాతిమా తెలిపారు.

కోవిడ్ టెస్టులు కావాల్సినన్ని చేయకపోవడం వల్ల అధికారిక లెక్కల్లో సంఖ్య తక్కువగా కనిపిస్తోందని ఆమె అంటున్నారు.

డాక్టర్ ఫాతిమా అంచనాల ప్రకారం కోవిడ్ వల్ల 2,060 మంది తొమ్మిదేళ్ల లోపు పిల్లలు చనిపోయారు. అందులో 1,302 మంది పసిబిడ్డలు ఉన్నారు.

పిల్లల్లో కోవిడ్

అసలు ఏం జరుగుతోంది?

బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో, పిల్లల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితి బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా కొరత, మందుల కొరత కనిపిస్తోంది. ఐసీయూలన్నీ నిండిపోయాయి. అనేకమంది రోగులకు బెడ్లు లభించడం లేదు.

ప్రస్తుతం బ్రెజిల్‌లో పి.1 అనే వైరస్ వేరియంట్ కనిపిస్తోంది. ఇది ఇంతకు ముందు వేరియంట్ కన్నా ప్రమాదకరమైనదని నిపుణులు అంటున్నారు.

పిల్లల్లో కోవిడ్ మరణాలు పెరగడానికి కారణం టెస్టులు చేయకపోవడమేనని డాక్టర్ ఫాతిమా అంటున్నారు.

"పిల్లలను చాలా సీరియస్ కండిషన్లలో ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. పెద్దవాళ్లకే తగినన్ని టెస్టులు చేయట్లేదు. పిల్లలకు ఇంకా తక్కువగా జరుగుతున్నాయి" అని ఆమె అన్నారు.

అయితే, దీనికి కారణం టెస్ట్ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడం కాదు. పిల్లల్లో కరోనావైరస్ లక్షణాలు వేరుగా కనబడుతున్నాయి.

"పిల్లల్లో విరేచనాలు, కడుపు నొప్పి, గుండెల్లో నొప్పి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాములుగా కోవిడ్ పాజిటివ్ కేసుల్లో వచ్చేదానికంటే ఎక్కువగా వస్తున్నాయి. వ్యాధిని సరైన సమయానికి గుర్తించకపోవడం వలన, పిల్లలు ఆస్పత్రికి వచ్చే లోపే బాగా నీరసపడిపోతున్నారు. వాళ్ల పరిస్థిత్రి తీవ్రంగా ఉంటోంది" అని డాక్టర్ ఫాతిమా వివరించారు.

అయితే, పేదరికం, ఆస్పత్రి సౌకర్యాలు అందకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.

బ్రెజిల్‌లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. 20ఏళ్ల లోపు కోవిడ్ రోగులలో 5,857 మందికి వెనకబాటుతనం కారణంగా సరైన వైద్య సదుపాయాలు అందక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని తేలింది.

నల్లజాతీయుల పిల్లలు, పేదరికంలో మగ్గుతున్నవారి పిల్లలే అధికంగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ ఫాతిమా కూడా అంగీకరించారు.

అలాగే, పోషకాహార లోపం వల్ల కూడా వీరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటోందని ఆమె తెలిపారు.

16 ఏళ్లు లోపు పిల్లలకు వ్యాక్సీన్లు లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే కాకుండా, ఐసీయూలో ఉంచిన పిల్లలను వారి తల్లిదండ్రులు తరచూ చూసేందుకు వీలు ఉండదు. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ఆల్బర్ట్ సాబిన్ పిల్లల ఆస్పత్రి ఐసీయూలో పని చేస్తున్న డాక్టర్ సినారా కార్నెయరో అంటున్నారు.

"తల్లిదండ్రులు పక్కన లేకపోవడం పిల్లలను మానసికంగా కుంగదీస్తోంది. దాంతో ఈ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. అమ్మనాన్నల ముఖాలు చూడకుండా పిల్లలు కన్నుమూయడం చాలా బాధాకరం. మేము వీడియో కాల్స్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఈ మానసిక బాధ వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది" అని ఆమె వివరించారు.

పిల్లల్లో కోవిడ్

పిల్లలకు కరోనావైరస్ సోకినట్లు ఎప్పుడూ అనుమానించాలి?

రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ సూచనల ప్రకారం..

  • పాలిపోయినట్లు ఉండడం, ముట్టుకుంటే ఒళ్లు చాలా చల్లగా ఉండడం
  • ఊపిరి సరిగ్గా అందకపోవడం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు గొంతులోంచి శబ్దాలు రావడం
  • స్పందించకపోవడం, పిలిస్తే పలకకపోవడం
  • పెదాల చుట్టూ నీలంగా కమిలినట్టు కనిపించడం
  • ఫిట్స్ రావడం
  • ఆపకుండా ఏడవడం, సరిగా పనులు చేయలేకపోవడం, అలిసిపోవడం
  • శరీరంపై దద్దుర్లు
  • అబ్బాయిలకు వృషణాల్లో నొప్పి

పై లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కోవిడ్ టెస్ట్ చేయించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why so many children are dying in Brazil with coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X