వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్ వచ్చాక భారత్‌తో అమెరికా అలాగే ఉంటుందా... స్టయిల్ మార్చేస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నరేంద్ర మోదీ, జో బైడెన్

జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక భారత్‌తో ఆ దేశ సంబంధాలు ఎలా ఉంటాయన్నదాని గురించి చాలా చర్చ జరుగుతోంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

''బైడెన్‌కు ఫోన్‌లో అభినందనలు చెప్పాను. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిబద్ధులై ఉండాలని మేం అనుకున్నాం. ఉమ్మడి ప్రాథమ్యాల గురించి చర్చించాం. కోవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం అందించుకునే విషయమై మాట్లాడుకున్నాం’’ అని మోదీ ట్విటర్‌లో తెలిపారు.

అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టబోతున్న కమలా హారిస్‌తోనూ మోదీ మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో మోదీ సాన్నిహిత్యంగా మెలిగారు. ట్రంప్‌కు బైడెన్ రాజకీయ ప్రత్యర్థి అయిన కారణంగా... మోదీతో ఆయన సంబంధాలు లాంఛనప్రాయంగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే, భారత్, అమెరికా మధ్య సంబంధాలు గత 20 ఏళ్లలో చాలా బలపడ్డాయని, ఇక్కడి నుంచి రెండు దేశాలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బైడెన్-హారిస్ ద్వయం అమెరికాలో అధికారంలోకి వచ్చాక ఆ దేశంతో భారత్‌కున్న సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఓ వర్చువల్ సెమినార్ ఏర్పాటు చేసింది.

''బైడెన్-హారిస్ నేతృత్వంలో అమెరికా, భారత్ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. స్టైల్ వేరేలా ఉండొచ్చు. మౌలికంగా సంబంధాలు ఇంకా బలపడతాయి. పరస్పర కార్యకలాపాలు పెరుగుతాయి. ఒకటైతే మారుతుంది. ఇక నుంచి అమెరికా విదేశాంగ విధాన నిర్ణయాలు ట్విటర్‌లో కనిపించవు’’ అని ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ దౌత్యవేత్త సురేంద్ర కుమార్ అన్నారు.

జో బైడెన్

ట్రంప్ పాలనలోని విదేశాంగ విధానాలనే బైడెన్ కొనసాగించవచ్చని, కానీ పద్ధతులు కాస్త మారుతాయని మాజీ దౌత్యవేత్త రోనెన్ సేన్ అభిప్రాయపడ్డారు.

రోనెన్ సేన్ దౌత్యవేత్తగా ఉన్న సమయంలో జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్‌లను చాలా సార్లు కలిశారు. ట్రంప్‌ను మాత్రం ఒకేసారి కలిశారు.

''గత 20 ఏళ్లుగా అమెరికా విదేశాంగ విధానాల్లో మార్పులేవీ లేవు. భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని... చైనా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయన్నదానితో కలిపి చూడాల్సి ఉంటుంది. భారత్ ఈ అంశాన్ని గమనిస్తుంది. చైనాతో అమెరికా పోటీపడుతుంది, ఎదురునిలుస్తోంది. కానీ, రెండు దేశాల మధ్య సంఘర్షణైతే లేదు. భౌగోళిక రాజకీయాల పరంగా చూస్తే, భారత్ అమెరికాకు చాలా ముఖ్యం. అయితే, చైనాతో వివాదాల్లో క్షేత్ర స్థాయిలో అమెరికా మనకు మద్దతు ఇస్తుందని, మన కోసం సేనలను పంపుతుందని ఆశించలేం’’ అని రోనెన్ సేన్ అన్నారు.

రక్షణ రంగంలో భారత్, అమెరికాల మధ్య పరస్పర సహకారం పెరగవచ్చని రోనెన్ సేన్ అన్నారు.

''గత నాలుగేళ్లలో ఈ విషయంలో చాలా పురోగతి కనిపించింది. కానీ, ఇంకా చాలా విషయాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. 2005లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను పూర్తిగా అమలు చేయలేదు. అమెరికా, భారత్ రక్షణ సహకారం పెంపొందించుకోవడం 1987లో మొదలైంది’’ అని ఆయన చెప్పారు.

రక్షణ వ్యహారాల్లో అమెరికాకు భారత్ అత్యంత సన్నిహత దేశాల్లో ఒకటిగా ఉంది.

1970వ దశకంలో భారత్-సోవియట్ యూనియన్ మధ్య ఉన్న స్నేహం కన్నా మించి ఇప్పుడు భారత్-అమెరికా మధ్య స్నేహం ఉందని మేజర్ జనరల్ అశోక్ మెహతా అన్నారు.

1975లో భారత్, అమెరికాల మధ్య ఒకే ఒక్క సైనిక అభ్యాస కార్యక్రమం జరిగిందని, ప్రస్తుతం ఏడాదిలో అలాంటివి 300 దాకా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

''రక్షణ సాంకేతికత విషయంలో అమెరికాతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయి. కానీ, రెండు దేశాల మధ్య ఇంకా అమ్మకందారు, కొనుగోలుదారు అన్న పరిస్థితే ఉంది. సైనిక సాంకేతికత బదిలీ, 'మేక్ ఇన్ ఇండియా’ విషయంలో పెద్దగా కృషి జరగలేదు. బైడెన్ పాలన కాలంలో భారత్ ఈ దిశగా పనిచేయాలి’’ అని అశోక్ మెహతా అన్నారు.

కమలా హారిస్

ఏ అంశాలు అమెరికాకు ముఖ్యం?

భారత్ సైనిక ఉపకరణాల్లో ఇప్పటికీ 80 శాతం రష్యా మోడళ్లపై ఆధారపడినవి, ఆ దేశం నుంచి దిగుమతైనవేనని అశోక్ మెహతా అన్నారు. ఈ పరిస్థితిని అమెరికా మార్చాలని కోరుకుంటుందని అభిప్రాయపడ్డారు.

చైనాకు ఎదురుగా భారత్ పటిష్ఠంగా నిలవాలని బైడెన్ ఆశిస్తారని, అలాంటి పక్షంలో సాంకేతికత బదిలీ విషయంలో కృషి చేయాల్సి ఉంటుందని అశోక్ మెహతా అన్నారు.

ఇక పాకిస్తాన్‌తో అమెరికా విదేశాంగ విధానం కూడా ట్రంప్ పాలనలో ఉన్నట్లుగానే కొనసాగుతుందని ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికాల్లో భారత్ దౌత్యవేత్తగా పనిచేసిన అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు.

''భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చాలా సార్లు ముందుకువచ్చారు. కానీ, బైడెన్ అలా చేయరు. భారత్ పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటారు. చైనాతోనూ అమెరికా విదేశాంగ విధానం ఇదివరకటిలానే కొనసాగుతుంది. కొంచెం స్వరం మారొచ్చు’’ అని ఆయన అన్నారు.

''2016లో సోషల్ మీడియా ద్వారా ట్రంప్ గెలిచేందుకు రష్యా సాయపడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. రష్యాతో బైడెన్ సంబంధాలు గొప్పగా ఉండకపోవచ్చు. మరోవైపు ట్రంప్ యురోపియన్ దేశాలను, నాటోను విమర్శిస్తూ మాట్లాడారు. యురోపియన్ దేశాలతో బైడెన్ మెరుగ్గా వ్యవహరించవచ్చు. చైనాను ప్రతిఘటించేందుకు యురోపియన్ దేశాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు ఆయన చేయవచ్చు. ఇరాన్‌తో వ్యవహారాలు బైడెన్‌కు సవాలుగానే ఉంటాయి. ట్రంప్‌ విధానాలనూ ఆయన కొనసాగించరు. అలాగని, ఆ దేశంతో రాజీకి కూడా రారు. ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ వ్యవహరించినంత ఉదారంగా బైడెన్ వ్యవహరించకపోవచ్చు’’ అని అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

మోదీ, డోనల్డ్ ట్రంప్

ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ వీసా నిబంధనల విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నైపుణ్యవంతుల కోసం అమెరికా ద్వారాలు తెరుచుకునే ఉండొచ్చు. అయితే, దేశీయ పరిస్థితుల ప్రభావం కూడా దీనిపై ఉంటుంది.

ఈ ఏడాది ఆగస్టు 15న బైడెన్ ప్రసంగిస్తూ బారతీయ అమెరికన్లకు అండగా ఉంటానని అన్నారు.

బైడెన్-హారిస్ ప్రభుత్వంలోనూ చాలా మంది భారతీయ అమెరికన్లకు స్థానం లభించవచ్చని అరుణ్ కుమార్ సింగ్ అన్నారు.

ఇక డోనల్డ్ ట్రంప్, మోదీ మధ్య చాలా సాన్నిహిత్యం కనిపించినా, వాణిజ్యం విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు.

''అమెరికాతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చు. 2019 జూన్‌లో 'సిస్టమ్ ఆఫ్ ప్రెఫరెన్స్’ జాబితా నుంచి భారత్‌ను అమెరికా తొలగించింది. అయితే, తర్వాత మళ్లీ ఆ స్థానం కల్పించింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న ఎగుమతుల్లో పది శాతం మాత్రమే 'డ్యూటీ ఫ్రీ’ జాబితాలో ఉంటున్నాయి. ఈ వాటా పెరగాలి’’ అని రోనెన్ సేన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India US relations after Biden enters white house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X