• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్‌లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?

By BBC News తెలుగు
|

పాకిస్తాన్ గ్యాస్

పాకిస్తాన్‌లో కొత్తగా గ్యాస్ నిక్షేపాలేవీ గుర్తించకపోతే, ఇప్పుడున్న వాటి నుంచి వచ్చే గ్యాస్ మరో 12 నుంచి 14 ఏళ్లకు మాత్రమే సరిపోతుందని ఆ దేశ ప్రధానికి పెట్రోలియం వ్యవహారాల సలహాదారుడిగా ఉన్న నదీమ్ బాబర్ అంటున్నారు.

అయితే, వచ్చే ఏడాది జూన్ వరకూ గ్యాస్ ధరలను ప్రభుత్వం పెంచబోదని, అంతర్జాతీయ మార్కెట్ నుంచి చవగ్గా దిగుమతులు చేసుకుంటుండటమే ఇందుకు కారణమని ఆయన బీబీసీతో చెప్పారు.

ఈ చలి కాలంలో దేశంలో గ్యాస్ కొరత రావొచ్చని ఇదివరకు ప్రజలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.

ఎకానామిక్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ సమాచారం ప్రకారం పాకిస్తాన్‌లో వార్షికంగా 400 కోట్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. అయితే, దేశంలో వార్షిక వినియోగం మాత్రం 600 కోట్ల క్యూబిక్ అడుగుల వరకూ ఉంది.

ఈ లోటును పూడ్చుకోవడానికి పాకిస్తాన్ ఎల్ఎన్‌జీని (ద్రవరూపంలో ఉన్న గ్యాస్. దీన్ని తిరిగి గ్యాస్‌లా మార్చుతారు) దిగుమతి చేసుకుంటుంది. కానీ, గ్యాస్ అవసరాలు పూర్తి స్థాయిలో వీటితో తీరడం లేదు.

పాకిస్తాన్‌లో ప్రస్తుతం మొత్తంగా 120 కోట్ల క్యూబిక్ అడుగుల సామర్థ్యం కలిగిన రెండు ఎల్ఎన్‌జీ టెర్మినళ్లు నడుస్తున్నాయి.

పాకిస్తాన్ గ్యాస్

అసలు గ్యాస్ కొరత ఎందుకు ఉంది?

పాకిస్తాన్‌లో గ్యాస్ ఉత్పత్తి స్థాయి త్వరత్వరగా పడిపోతూ ఉందని నదీమ్ బాబర్ చెబుతున్నారు.

''గత ప్రభుత్వం ఎల్ఎన్‌జీ వ్యవస్థపై దృష్టి పెట్టి ఓ మంచి పని చేసింది. కానీ, స్థానికంగా గ్యాస్ ఉత్పత్తి చేసే విషయంలో అలసత్వం వహించి తప్పు కూడా చేసింది'' అని ఆయన అన్నారు.

''గత ప్రభుత్వం ఐదేళ్లలో కొత్తబ్లాకులు ఏవీ కేటాయించలేదు. డ్రిల్లింగ్‌ను మార్చాల్సినంత వేగంగా మార్చలేదు'' అని అన్నారు.

''డిమాండ్ పెరుగుతూపోతోంది. ఎల్ఎన్‌జీని మనం ఎంతవరకూ తెచ్చోగలమన్నదానిపై పరిమితి ఉంది. సరఫరా, డిమాండ్ మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఇంధన రంగ నిపుణులు ఎవరైనా ఐదేళ్ల క్రితం ఈ పరిస్థితిని అంచనా వేసి ఉండేవారే. నేను ప్రభుత్వంలో లేనప్పటి నుంచి ఈ విషయం చెబుతున్నా'' అని నదీమ్ చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు అవుతోంది. మరి, ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏం చేసింది?

ఈ ప్రశ్నకు... ''స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ రంగంపై దృష్టి పెట్టాం. కానీ, దీని ఫలితాలు మూడు, నాలుగేళ్ల తర్వాతే కనిపిస్తాయి. కొత్తగా డ్రిల్లింగ్ మొదలుపెట్టాలి. కొత్త నిక్షేపాలు కనుక్కోవాలి. ఇందుకు కొన్నేళ్లు పడుతుంది'' అని నదీమ్ సమాధానం ఇచ్చారు.

పాకిస్తాన్ గ్యాస్

''ఇప్పుడు దిగుమతులు చేసుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గం. ప్రభుత్వమే స్వయంగా ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకుని, అప్పులను పెంచుకోవడం సరికాదు. ఈ రంగాన్ని మేం అందరి కోసం తెరిచాం. ఎల్ఎన్‌జీ టెర్మినళ్లు పెట్టేందుకు ఐదు సంస్థలు ముందుకువచ్చాయి. వాటికి మేం అనుమతులు ఇచ్చాం. వాటిలో రెండు వచ్చే రెండు, మూడు నెలల్లో క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నాయి. ఇంకో ఏడాది తర్వాత రెండు టెర్మినళ్లు మొదలవుతాయి'' అని నదీమ్ వివరించారు.

టెర్మినళ్లు ఇప్పటికే ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నకు... ''ఇది అనుకున్నవెంటనే అయ్యే పని కాదు. చట్టాలను మార్చాల్సి వచ్చింది. అనుమతులు మంజారు చేయాల్సి వచ్చింది. ఇదివరకటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు ఎనిమది ఏళ్లు పట్టిందన్న విషయం మనం గమనించాలి'' అని ఆయన బదులిచ్చారు.

పాకిస్తాన్ గ్యాస్

సాధారణంగా పాకిస్తాన్‌లో చలికాలంలో గ్యాస్ ధరలు పెరుగుతుంటాయి.

ఎల్ఎన్‌జీ విషయంలో ఇదివరకటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా విమర్శలు చేసింది. మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ ఈ వ్యవహారమై విచారణ కూడా ఎదుర్కొంటున్నారు.

గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల కన్నా తక్కువ ధరలకు తాము గ్యాస్ కొనుగోలు చేస్తున్నామని నదీమ్ బాబర్ అన్నారు. అందుకే చలి కాలంలోనూ ధరలు పెంచబోవడం లేదని చెప్పారు.

అయితే, గత ప్రభుత్వ ఒప్పందాల వల్ల దీర్ఘా కాలిక లాభాలు ఉంటాయని, ధరల హెచ్చుతగ్గుల ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు అంటున్నారు.

మరోవైపు గ్యాస్ కనెక్షన్లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అలాంటి ఆంక్షలేవీ లేవని, కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయని నదీమ్ అన్నారు.

''పైప్ ద్వారా ఇంటికి గ్యాస్ రావడం అన్నది ఓ విలాసవంతమైన సౌకర్యం. సాధారణంగా సిలిండర్ల ద్వారా గ్యాస్ సరఫరా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్‌లో ఇప్పుడు 27 శాతం మంది వినియోగదారులకు పైప్ ద్వారా గ్యాస్ లభిస్తోంది. 27 నుంచి 28 శాతం మంది ఎల్‌పీజీ వాడుతున్నారు. మిగతా వాళ్లు ఇతర రకాల ఇంధనాలను వాడుతున్నారు'' అని ఆయన చెప్పారు.

''స్థానికంగా గ్యాస్ ఉత్పత్తికి 700 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే, వినియోగదారులకు దానిపై 275 నుంచి 300 రూపాయలు వసూలు చేయాల్సి వస్తోంది. వినియోగదారుల్లో 90 శాతం మంది ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారు. మరోవైపు సరఫరా తగ్గిపోతోంది. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, గ్యాస్ ఎక్కడి నుంచి ఇస్తాం. అయినా, మేం వాటిపై ఆంక్షలు ఏమీ పెట్టలేదు'' అని నదీమ్ చెప్పారు.

''సరఫరాలో లోటును దృష్టిలో పెట్టుకుని, ఏటా గ్యాస్ కనెక్షన్లపై ఓజీఆర్ఏ ఓ పరిమితిని నిర్ణయించింది. ఈ ఏడాదికి నాలుగు లక్షల కనెక్షన్లు ఇవ్వాలన్న పరిమితి ఉంది. మాకు 28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కొత్త సొసైటీలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోండి. ఎల్ఎన్‌జీకి ధర చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. ఎంతైనా దిగుమతి చేసుకుంటాం. కానీ, వినియోగదారులు మూడు రెట్లు ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. ధరలను, సరఫరాను, కొత్త కనెక్షన్లను మేం సమతుల్యం చేసుకోవాలి'' అని నదీమ్ అన్నారు.

నదీమ్ బాబర్

'12 నుంచి 14 ఏళ్లకు సరిపోయే గ్యాస్ ఉంది’

పాకిస్తాన్‌లోని ప్రస్తుత నిక్షేపాల్లో మరో 12 నుంచి 14 ఏళ్లకు సరిపోయే గ్యాస్ మాత్రమే ఉందని నదీమ్ అన్నారు.

గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 90 నిక్షేపాలు గుర్తించిందని, తాము రెండేళ్లలో 26 నిక్షేపాలను గుర్తించామని ఆయన చెప్పారు. కాకపోతే, ఇవన్నీ చాలా చిన్నవని అన్నారు.

''అవి మొత్తం కలిపి 25 కోట్ల క్యూబిక్ అడుగుల వరకూ ఉంటాయి. మరోవైపు ఇప్పటికే ఉన్న నిక్షేపాల నుంచి ఉత్పత్తి 40 కోట్ల క్యూబిక్ అడుగుల మేర తగ్గిపోయింది. అయితే, నిరాశచెందాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌కు ఇంకా చాలా సామర్థ్యం ఉంది'' అని నదీమ్ చెప్పారు.

భద్రత కారణాల దృష్ట్యా దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో నిక్షేపాల కోసం ఇంకా అన్వేషించలేదని, ఇటు సముద్రంలోనూ అన్వేషించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

''చమురు, గ్యాస్ కోసం అన్వేషించదగ్గ ప్రాంతాలు పాకిస్తాన్‌లో 30 నుంచి 35 శాతం మేర ఉన్నాయి. ఇప్పటికి 8 నుంచి 9 శాతం మేర క్షేత్రాలను మాత్రమే లీజుకు ఇచ్చాం. పనులు జరుగుతున్న ప్రాంతాలు 5 నుంచి 6 శాతం మాత్రమే ఉన్నాయి'' అని నదీమ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cooking gas shortage in Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X