అమెరికా ఎన్నికలు ఫేస్‌బుక్‌కు కఠిన పరీక్ష-ఫలితాలు ఆలస్యమైతే అలజడే- జుకర్‌బర్గ్ హెచ్చరిక..
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యూఎస్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారం, ఫలితాలు, కవరేజ్‌కు సంబంధించి జుకర్ బర్గ్ చేసిన తాజా వ్యాఖ్యలు తన ఉద్యోగులతో పాటు ఎన్నికల యంత్రాంగానికీ హెచ్చరికలుగా కూడా ఉన్నాయి.

అమెరికా ఎన్నికలపై ఫేస్బుక్ ఆందోళన..
గతంలో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు పునరావృతం కాకూడదని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆకాంక్షించారు. గతంలో ఎన్నికల సందర్భంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి ఘటనలు జరిగాయని, ఇప్పుడు తిరిగి అవి పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని జుకర్‌బర్గ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఫేస్బుక్ ఉద్యోగులు కఠిన పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని జుకర్‌బర్గ్ సూచించారు. గతంలో ఫేస్బుక్ ఎన్నికలను ప్రభావితం చేసిందన్న అపప్రద ఎదుర్కొందని, ఈసారి అలాంటి ఆరోపణలు పునరావృతం కాకుండా ఉద్యోగులు కచ్చితంగా వ్యవహరించాలని జుకర్‌బర్గ్ సూచించారు.

ఫలితాల ఆలస్యంతో అశాంతి తప్పదన్న జుకర్‌బర్గ్...
ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల పరిస్ధితులు చూస్తుంటే ఫలితాలు చాలా ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోందని, అదే జరిగితే ప్రజల్లో అశాంతి తప్పదని జుకర్‌బర్గ్ హెచ్చరించారు. ఎన్నికల్లో తమకు నచ్చిన నేతలను ఎంచుకునే విషయంలో ఓటర్లలో స్పష్టమైన చీలిక కనిపిస్తోందని జుకర్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో ఎన్నికల ఫలితాల్లో కచ్చితమైన విజేతను ఎంపిక చేయడం కూడా కష్టమవుతుదని ఆయన అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఓటర్లలో నిరాశ పెరిగి సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు.

ప్రకటనలపై వివాదాలతో ఫేస్బుక్ అప్రమత్తం..
ప్రస్తుత ఎన్నికల్లోనూ ఫేస్బుక్ చివరి నిమిషంలో కొత్త ప్రకటనలను రాజకీయ పార్టీల నుంచి స్వీకరించడంపై ప్రత్యర్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే చెల్లింపులు పూర్తయిన ప్రకటనలు కూడా మధ్యలో నిలిచిపోవడంపైనా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో ఇలాంటి తప్పిదాలను నివారించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు. మరోవైపు నలువైపులా పెరుగుతున్న ఒత్తిడితో ఫేస్బుక్ కూడా ప్రకటన విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తోంది.