టీ-20 చరిత్రలోనే సరికొత్త రికార్డు... 1000 సిక్సర్లు కొట్టిన క్రిస్‌గేల్
అబుదాబి: టీ20 క్రికెట్లో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన ఈ కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్.. టీ20 ఫార్మాట్లో 1000 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. కార్తీక్ త్యాగీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచి గేల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. తద్వార ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
🐐 One 🐐 thousand 🐐 T20 🐐 sixes 🐐#SaddaPunjab #IPL2020 #KXIP #KXIPvRR @henrygayle pic.twitter.com/vMf9oseXmM
— Kings XI Punjab (@lionsdenkxip) October 30, 2020
ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లన్నీ ఆడే గేల్.. అత్యధిక సిక్సర్ల జాబితాలో వెయ్యి సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంటే.. ఇతర బ్యాట్స్‌మన్ కనీసం అతని దరిదాపుల్లో కూడా లేరు. యూనివర్స్ బాస్ తర్వాత వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ 690 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా.. బ్రెండన్ మెక్ కల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రీ రస్సెల్ (447), ఏబీ డివిలియర్స్ (417) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక గేల్ నెలకొల్పిన ఈ రికార్డును మరెవరూ అందుకోలేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జోఫ్రా ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడో బంతిని భారీ సిక్సర్ కొట్టిన గేల్.. 99 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. కానీ ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయ్యాడు. ఆర్చర్ వేసిన అద్భుత యార్కర్‌ను అంచనా వేయలేకపోయిన గేల్ కట్ అండ్ బౌల్ట్ అయ్యాడు. దాంతో తీవ్ర నిరాశకు గురైన యూనివర్స్ బాస్ అసహనం బ్యాట్‌ను నేలకు కొట్టాడు. అయితే ఆ వెంటనే బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ అద్భుత బంతని కొనియాడుతూ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ సీన్ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంది. అటు కామెంటేటర్లు కూడా ఇది కదా క్రీడాస్పూర్తి అంటే.. బాస్ బాసే అని కొనియాడారు.
క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99) పరుగుల విధ్వంసానికి కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) క్లాసిక్ ఇన్నింగ్స్ తోడవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్ ముందు 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (10 బంతుల్లో 3 సిక్స్‌లతో 22) కూడా ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలోఆర్చర్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు.