ధోనీసేనకు దెబ్బ మీద దెబ్బ: ఆ ఆల్‌రౌండర్ స్వదేశానికి : రైనా, భజ్జీలు ఆడకపోవడానికి: సీఈఓ
చెన్నై: టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సారి ఏ మాత్రం కాలం కలిసిరావట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో వరుసగా పరాభవాలను చవి చూస్తోంది ఎల్లో ఆర్మీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ నుంచి మొట్టమొదటగా ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగిపోయే జట్టుగా గుర్తింపు పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇంకా నాలుగు మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సి ఉంది.

డ్వేన్ బ్రావో అవుట్..
ఈ దశలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆల్‌రౌండర్ అందుబాటులో లేకుండా పోయాడు. గాయం కారణంతో స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. అతను ఈ టోర్నమెంట్లో మిగిలిన నాలుగు మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ అధికారికంగా వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో డ్వేన్ బ్రావో స్వదేశానికి వెళ్తాడని తెలిపారు. ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

సురేష్ రైనా, హర్భజన్ ఆడకపోవడానికి..
ఈ ఇంటర్వ్యూలో కాశీ విశ్వనాథన్ పలు విషయాలపై స్పందించారు. ఐపీఎల్-2020 సీజన్లో టీమ్ వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పెదవి విప్పడం ఇదే తొలిసారి. జట్టు ఆల్‌రౌండర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఆడకపోవడానికి గల కారణాలపై చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్లే వారిద్దరు జట్టుకు దూరం అయ్యారని తెలిపారు. వారి వ్యక్తిగత కారణాలను గౌరవించాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్మెంట్పై ఉందని చెప్పారు. అందుకే- వారిపై ఎలాంటి ఒత్తిడిని తీసుకుని రాలేదని పేర్కొన్నారు.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా..
ఈ పరిస్థితుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కిన చెన్నై సూపర్ కింగ్స్.. వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన ధోనీ సేన మూడింట్లో మాత్రమే నెగ్గింది. ఏడు అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ స్థాయికి దిగజారడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆడిన ప్రతి సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ సారి ఆ అవకాశం దక్కకపోవచ్చు.

రైనా, భజ్జీలకు బదులుగా..
సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లకు బదులుగా టీమ్ మేనేజ్మెంట్ పియూష్ చావ్లా, కర్ణ్ శర్మలను జట్టులోకి తీసుకుంది. వారిద్దరూ ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లను ఆడిన పియూష్ చావ్లా.. ఎకానమీ దారుణంగా ఉంది. 9.09 ఎకానమీ రేటును సాధించాడతను. కర్ణ్ శర్మ పరిస్థితీ దాదాపు అంతే. కర్ణ్ శర్మ బౌలింగ్ ఎకానమీ 8.66గా నమోదైంది. వారిద్దరూ ఏ స్థాయిలో పరుగులను సమర్పించుకున్నారో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. డ్వేన్ బ్రావో అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన స్థానంలో కొత్తవారికి తీసుకునే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. బ్రావోకు బదులుగా ఇమ్రాన్ తాహిర్‌కు తుదిజట్టులో స్థానం కల్పిస్తారని తెలుస్తోంది.