• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆపద్బాంధవా.. ఆరెంజ్ ఆర్మీ రక్షకా: నీ కోసమే వెయిటింగ్ ఇక్కడ

|

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఆటతీరును మెరుగుపరచుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. ప్రత్యర్థికి స్వల్ప స్కోరును లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ- దాన్ని కాపాడుకునే సత్తా సన్‌రైజర్స్‌కు ఉంది. ప్రత్యర్థి జట్టును ఆ స్కోరు దరిదాపులకు రానివ్వకుండా చేయగల పకడ్బందీ వ్యూహాలు ఆరెంజ్ టీమ్‌కు సొంతం. టార్గెట్‌ను ఛేజ్ చేయడానికి బరిలోకి దిగితే.. స్వల్ప స్కోరును కూడా అందుకోలేక చతికిల పడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. ఆ తరువాత వచ్చే టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరడానికి పోటీ పడుతుంటారు. ఇది ప్రతి మ్యాచ్‌లోనూ జరిగే తంతు.

హ్యాట్రిక్ లాస్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఆడిన మూడు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఓ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ టీమ్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 13 ఎడిషన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

ఎనిమిది పరుగులకు చివరి నాలుగు వికెట్లు..

జట్టు స్కోరు 67 పరుగుల వద్ద ఉన్న సమయంలో తొలి వికెట్ కోల్పోయింది హైదరాబాద్. ఓపెనర్ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసిన అతను హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన మనీష్ పాండే ఎక్కువ సేపు నిలవలేదు. ఏడు బంతులను ఆడిన అతను రెండు పరుగులు చేశాడు. జట్టు స్కోరు 90 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్ పతనానికి కారణం అదే. ఆ తరువాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా నిలదొక్కుకోలేకపోయారు. రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. ఒక్కొక్కరు కనీసం 10 పరుగులు చేసి ఉన్నా హైదరాబాద్ గెలిచేదే.

కేన్ మామ ఒక్కడే దిక్కు..

హైదరాబాద్ ఓటమిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. హైదరాబాద్ అభిమానులు ఆవేదనను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై షేర్ చేసుకుంటున్నారు. కేన్ విలియమ్సన్ వస్తేనే జట్టుకు విజయాలు అందుతాయని కామెంట్స్ చేస్తున్నారు. కేన్ మామ ఒక్కడే ఆపద్బాంధవుడంటున్నారు. కేన్ విలియమ్సన్ జట్టులో ఉన్నప్పటికీ.. గాయం వల్ల మ్యాచ్‌లను ఆడట్లేదు. అతను త్వరలోనే కోలుకుంటాడని మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. కేన్ విలియమ్సన్ తరువాతి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేకపోలేదు.

మిడిలార్డర్ బలహీనం..

బలహీనమైన బ్యాటింగ్‌ లైనప్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి గెలిచే మ్యాచ్‌లో ఓడింది. రోహిత్ సేన కట్టుదిట్టమైన బౌలింగ్‌, అద్భుత ఫీల్డింగ్‌తో 137 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..13 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), క్వింటన్ డికాక్(39 బంతుల్లో 5 ఫోర్లు 40), కీరన్ పొలార్డ్(22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో విజయ్ శంకర్(2/19), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/29) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు

English summary
Here is how Twitter reacted on the Sunrisers Hyderabad lost their match against Mumbai Indians at Chennai in IPL 2021 season. For the first time in IPL history, Sunrisers Hyderabad have lost their first 3 matches of the season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X