కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి .. మేడారం జాతరలో కీలకంగా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా..
కరోనాతో పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీస్ శాఖలో చాలామంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. కొందరు కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరుతుండగా, మరికొందరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోతున్న వారిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కీలకంగా వ్యవహరించిన వారు, ప్రజల మన్ననలు పొందుతూ సేవలందించినవారు ఉన్నారు. ఆ కోవకి చెందిన వారు జగిత్యాల అడిషనల్ ఎస్పీ గా పనిచేస్తున్న దక్షిణామూర్తి.
జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి హఠాన్మరణంతో పోలీసుశాఖలో విషాదం నెలకొంది.
జగిత్యాల అడిషనల్ ఎస్పీ గా పనిచేస్తున్న దక్షిణామూర్తి కరోనాతో పోరాడుతూ కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఆయనకు కరోనా సోకడంతో గత వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే దక్షిణామూర్తి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు, ఆయనకు ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు బంధువులు చెబుతున్నారు.

దక్షిణామూర్తి స్వస్థలం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని అలుగునూరు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణామూర్తి ముఖ్యంగా వరంగల్ జిల్లాతో మంచి అనుబంధం ఉన్న పోలీస్ అధికారి. వరంగల్ జిల్లాలో ఎస్సైగా, సీఐగా, డిఎస్పీగా ఆయన కీలకంగా పని చేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. అంతేకాదు వరంగల్ జిల్లాలో సంచలనం కలిగించిన స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. మేడారం జాతర సమయాల్లోనూ దక్షిణామూర్తి కీలకంగా వ్యవహరించే వారు. ఇటీవల మేడారం జాతరకు స్పెషల్ ఆఫీసర్గా దక్షిణామూర్తి పనిచేశారు. గత 20 ఏళ్ళుగా చిలకల గుట్ట నుండి సమ్మక్క ఆగమన ఘట్టానికి ఆయనే కీలకంగా వ్యవహరించేవారు .
పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలు మరువలేనివి. వరంగల్ తో పాటుగా, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఆయన పని చేశారు .
ఇటీవల జిల్లాలో కరోనాతో అనారోగ్యం పాలైన పోలీసులకు ఆత్మస్థైర్యం ఇవ్వటం, చికిత్స పొంది తిరిగి వీధుల్లోకి వచ్చిన తర్వాత వారికి ఘన స్వాగతం పలకడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పోలీసుల మనోధైర్యాన్ని నింపి ఫ్రంట్లైన్ వారియర్స్ గా పని చేయడానికి కావలసిన స్ఫూర్తి నిచ్చారు. మరో ఐదు రోజుల్లో పదవి విరమణ ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దక్షిణామూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.