బంద్ వరకూ వెళ్లిన కొత్త జిల్లా డిమాండ్: సొంతజిల్లాలో జగన్‌కు సెగ
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఉగాది నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్లను సైతం జారీ చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకోవడం వల్ల అన్ని ప్రాంతాల్లోనూ జిల్లాల సంఖ్య పెరిగింది.

మొన్న హిందూపురంలో..
కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం కొన్ని చోట్ల వివాదాస్పదమైంది. ఉద్యమంగా రూపుదాల్చింది. ఏకంగా బంద్ వరకూ వెళ్లింది. అనంతపురం జిల్లా హిందూపురాన్ని కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఆందోళన చేపట్టారు. హిందూపురంలో మౌనదీక్షకు దిగారు. అక్కడితో ఆగలేదు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సైతం అందజేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామాకు సైతం వెనుకాబోనని హెచ్చరించారు.

రాజంపేటలో..
అదే తరహా పరిస్థితులు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ తలెత్తాయి. జిల్లా సాధన కోసం రాజంపేటవాసులు ఏకంగా బంద్‌కు దిగారు. ఇవ్వాళ బంద్ చేపట్టారు. కొత్త జిల్లాలను ప్రకటించిన మరుక్షణం నుంచే రాజంపేటవాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వస్తోన్నారు. అది మరింత తీవ్రమైంది. బంద్ వరకూ వెళ్లింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం బంద్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం పట్ల నిరసన..
కడప పరిధిలో ఉన్న రాయచోటిని కేంద్రంగా తీసుకుని అన్నమయ్య జిల్లాను ప్రకటించింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు దీని పరిధిలోకి చేర్చింది. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడాన్ని రాజంపేటవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పుడు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేది వారి డిమాండ్.

సమాన దూరంలో ఉండటం వల్లే..
అన్నమయ్య జన్మించిన తాళ్లపాక గ్రామం రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, దాన్ని కాదని, రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం సరికాదని రాజంపేటవాసులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వాదన మరోలా ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించితే- చిత్తూరు జిల్లాలో కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల ప్రజలకు దూరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

స్వచ్ఛందంగా బంద్..
అందుకే- అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇస్తోన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గట్లేదు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ తెల్లవారుజామున బంద్ మొదలైంది. స్వచ్ఛందంగా బంద్‌ను నిర్వహిస్తోన్నారు. దుకాణాలేవీ తెరచుకోలేదు. అఖిలపక్ష నేతలు రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలను చేపట్టారు.

బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్సులు..
ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకోవడానికి అఖిల పక్ష నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెల్లవారు జామునే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించారు. బస్సులు బయటికి రాకుండా రాళ్లు అడ్డుగా పెట్టారు. పోలీసులు వారిని అడ్డకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనకారులను పోలీసులు వెనక్కి పంపించేశారు. రాళ్లను తొలగించారు. ఆర్టీసీ బస్సు బైపాస్ మీదుగా మళ్లించారు.