వివేకా హత్య వెనుక బళ్లారి మైనింగ్ మాఫియా ! కేసు సీబీఐకి అప్పగింత వెనుక కారణమిదేనా ?
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవటం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తీరుతో పాటు వాడారని భావిస్తున్న ఆయుధాలు గమనిస్తే ఇది అంతర్ రాష్ట్ర హంతకుల పనిగా హైకోర్టు కూడా అనుమానించింది. అయితే సదరు అంతర్ రాష్ట్ర ముఠా బళ్లారి మైనింగ్ మాఫియానా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ హత్య- వంద అనుమానాలు..
గతేడాది మార్చి నెలలో కడప జిల్లా పులివెందులలో స్దానికంగా బలమైన నేత, మాజీ మంత్రి, మాజీ సీఎం వైఎస్ సోదరుడు, విపక్ష నేత బాబాయ్ కూడా అయిన వివేకానందరెడ్డిని ఆయన సొంత ఇంట్లోనే ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. మరుసటి రోజు ఉదయం ఆయన డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్ధలికి వెళ్లి వచ్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం బాబాయ్ గుండెపోటుతో చనిపోయారని ప్రపంచానికి చెప్పారు. ఆ తర్వాత వివేకా డ్రైవర్ పోలీసులకు వెళ్లి లొంగిపోవడం, ఆయన శరీరంపై బలమైన గాయాలున్నాయని చెప్పడంతో కథ పూర్తిగా మలుపు తిరిగింది.

మాట మార్చిన అవినాష్
తొలుత వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని బంధువులకు, కుటుంబ సభ్యులకు చెప్పిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గంటల వ్యవధిలోనే ఆయన్ను ఎవరో హత్య చేశారని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వివేకా కుటుంబ సభ్యులు హడావిడిగా హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకునే సరికి ఆయన ఇంట్లో మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి గదిలోకి తీసుకురావడం, రక్తపు మరకలను తుడిచేయడం వంటి ఘటనలు జరిగిపోయాయి. ఆ తర్వాత వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు తలకు కుట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

వైఎస్ కుటుంబంపై అనుమానాలు..
వివేకానంద రెడ్డి తొలుత గుండెపోటుతో చనిపోయారని, ఆ తర్వాత కాదు కాదు ఎవరో హతమార్చారని చెప్పడం, రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు, మృతదేహం తలకు కుట్లు వేయడం వంటి చర్యలతో ఈ హత్యకు వైఎస్ కుటుంబీకుల్లో కొందరు కారకులన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే విపక్షంలో ఉండగా ఈ హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్... అధికారంలోకి వచ్చాక అవసరం లేదని చెప్పడంతో వివేకా కుటుంంబ సభ్యుల్లో అనుమాననాలు బలపడ్డాయి. చివరికి వివేకా కుటుంబ సభ్యులతో పాటు ఈ కేసులో సిట్ పోలీసులు చేర్చిన మాజీ మంత్రి ఆదినారాయరెడ్డి కలిసి హైకోర్టును సీబీఐ విచారణ కోరారు. దీంతో ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు చివరికి సీబీఐకి అప్పగించింది.

సీబీఐకి అప్పగించడం వెనుక..
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం వెనుక కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మాత్రమే కాదు పలు కీలక కారణాలు కూడా ఉన్నాయి. పులివెందులలో ఈ హత్య జరిగిన తీరు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని, ముఖ్యంగా హత్య చేసిన తీరు గమనిస్తే అంతర్ రాష్ట్ర హంతకుల పాత్ర ఉండొచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ అంతర్ రాష్ట్ర హంతకులు ఎవరై ఉండొచ్చన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

బళ్లారి మైనింగ్ మాఫియా పనేనా
గతంలో వైఎస్ తండ్రి రాజారెడ్డి బతికున్న సమయంలోనే బళ్లారిలో మైనింగ్ పెద్దలతో వారికి సత్సంబంధాలు ఉండేవి. రాజారెడ్డి తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ బళ్లారికి చెందిన గాలి జనార్ధన్ రెడ్డితో మంచి సంబంధాలే ఉండేవి. కడపలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు గాలి జనార్ధన్ రెడ్డి సిద్ధం కావడం వెనుక కారణం కూడా ఇదే. అయితే వైఎస్ మరణం తర్వాత బళ్లారిలో మైనింగ్ క్వారీల యజమానులతో వ్యవహారాలను వివేకా చూసుకునేవారు. ఇందులో ఎక్కడైనా ఏదైనా తేడా రావడంతో మాఫియా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చేమో అన్న అనుమానాలు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత మొదలయ్యాయి. అయితే ఇందులో నిజానిజాలేమిటో సీబీఐ తేల్చాల్సి ఉంది.