జగన్ క్రైస్తవుడే.. కానీ, బాబు రాక్షసుడిలా, టీడీపీది ముగిసిన అధ్యయమే: రామచంద్రయ్య నిప్పులు
అమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య. చంద్రబాబు నాయుడు ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీ రామచంద్రయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పిలవకున్నా పనిగట్టుకు వెళ్తున్న చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నాడు .. వైసీపీ నేత రామచంద్రయ్య ఫైర్

జగన్ క్రైస్తవుడే.. బాబు రాక్షసుడిలా..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే అయినప్పటికీ.. లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నాడు. అయితే, రాక్షసుల మాదిరిగా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించడంపై చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

టీడీపీ ముగిసిన అధ్యయమే..
సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీ రామచంద్రయ్య మండిపడ్డారు. విష సంస్కృతికి మూలపురుషుడు చంద్రబాబు నాయుడేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇక టీడీపీది ముగిసిన అధ్యయనమేనని సీ రామచంద్రయ్య జోస్యం చెప్పారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బోగలేదని ఎద్దేవా చేశారు.

జగన్ క్రైస్తవుడే కానీ..
జగన్మోహన్ రెడ్డి క్రైవస్తవుడే కానీ.. ఇతర మతాలను గౌరవిస్తారని.. ఆలయ మర్యాదల ప్రకారమే నడుచుకున్నారని సీ రామచంద్రయ్య చెప్పారు. తిరుమలలో కూడా జగన్ ఆలయ మర్యాదలు పాటించారని తెలిపారు. జగన్ సంతకం అనేది వ్యక్తిగతమని, దేవుడిపై నమ్మకం ఉండే ఆయన తిరుమలకు వెళ్లారని చెప్పారు. తిరుమలకు ఇంతకుముందు వెళ్లారు.. ఇకముందు కూడా వెళ్తారు అని ఆయన స్పష్టం చేశారు.

40ఏళ్ల అనుభవం ఇదేనా?
చంద్రబాబుకు నిజంగా భక్తి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను దర్శించుకోవడం కాదు.. రుషికేశ్ వెళ్లి గంగలో కూడా మునిగారని చెప్పుకొచ్చారు సీ రామచంద్రయ్య. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటివాటిని కూడా తప్పుపడతారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అనవసర విషయాలు మాట్లాడకుండా.. ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని సీ రామచంద్రయ్య హితవు పలికారు.

బాబు హయాంలో ఆలయాల పరిస్థితి ఇది..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. సదావర్తి భూముల వేలం పేరుతో స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో 40 ఆలయాలు పడగొట్టింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కనకదుర్గమ్మ భూములను చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెట్టారని, టీడీపీ హయాంలోనే అమ్మవారి కిరీటం కూడా మాయమైందని విమర్శించారు. దుర్గ గుడి, కాళహస్తి ఆలయాల్లో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!