సీఎం జగన్ సొంత జిల్లాలో న్యూ ఇయర్ కు ఘర్షణలతో స్వాగతం, కత్తులతో దాడులు, నెత్తురు పారించిన నేతలు
ఏపీ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి . సీఎం సొంత జిల్లాలో వైసీపీ శ్రేణుల మధ్య వర్గ పోరు నెలకొంది .కొత్త ఏడాది మొదటి రోజునే కడప జిల్లాలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఘర్షణకు కారణమైంది. వైసిపి నేతలు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివాన కావడంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.
టీడీపీ నేత హత్యపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలనం .. చౌడేశ్వరీ ఆలయంలో సత్య ప్రమాణం

పాయసం పల్లిలో వైసిపి వర్గాల మధ్య ఘర్షణ
కడప జిల్లా కమలాపురం వీరపునాయునిపల్లె మండలం పాయసం పల్లిలో వైసిపి రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరువర్గాల వారు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు తెగబడ్డారు . కొత్త ఏడాది వేడుకల దృష్ట్యా సోషల్ మీడియాలో పోస్టులు , కేక్ కటింగ్ నేపధ్యంలో మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గాల మధ్య చెలరేగిన వివాదం చివరికి దాడులకు పాల్పడే దాకా వెళ్ళింది. న్యూ ఇయర్ సందర్భంగా పాయసం పల్లి లో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేయడానికి సిద్ధపడగా , మరో వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి దానికి అభ్యంతరం తెలిపారు.

న్యూ ఇయర్ కేక్ , విషెస్ విషయంలో గొడవ .. కత్తులతో దాడి
v పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో సుధాకర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం నచ్చని మహేశ్వర్ రెడ్డి హిందువులకు సంబంధించి ఉగాది పండుగ జరుపుకోవాలని ఇలా ఎందుకు న్యూ ఇయర్ జరుపుకోవాలని వాదానికి దిగారు. ఈరోజు ఉదయం కేక్ కట్ చేయడానికి సుధాకర్ రెడ్డి ప్రయత్నం చేయగా, ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. మొదట రాళ్ల దాడి చేసిన వారు, తర్వాత కత్తులతో తెగబడ్డారు ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా,మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

లైసెన్సుడ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపిన వైసీపీ నేత
ఘర్షణ నేపథ్యంలో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి తనకు ఉన్న లైసెన్సుడ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు. వైసీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
న్యూ ఇయర్ మొదటి రోజునే కడపలో వైసీపీ నేతలు ఘర్షణలతో స్వాగతం చెప్పి నెత్తురు పారించారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో ఉన్నారు. ప్రస్తుతం పాయసంపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది .