టీడీపీ నేత హత్యపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలనం .. చౌడేశ్వరీ ఆలయంలో సత్య ప్రమాణం
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి నేత నందం సుబ్బయ్య దారుణ హత్య నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక చౌడేశ్వరీ ఆలయానికి వెళ్లి ఈ హత్యతో సంబంధం లేదని సత్య ప్రమాణం చేశారు . ఏపీలో ఓ మర్డర్ కేసు వివాదంలో ఎమ్మెల్యే ఆలయంలో ప్రమాణం చెయ్యటం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది .


టీడీపీ నేత హత్యతో స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై , అలాగే కడప మున్సిపల్ కమిషనర్ రాధ పై అతడి భార్య అపరాజిత ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తన భర్త మృతికి కారణం వారేనని, ఎఫ్ఐఆర్లో వారి పేర్లు కూడా నమోదు చేయాలని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

చౌడేశ్వరీ ఆలయంలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలో తనపై వస్తున్నహత్య ఆరోపణలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చౌడేశ్వరి ఆలయంలో ప్రమాణం చేసి తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని భగవంతుని ఎదుట ప్రమాణం చేశారు. తెలుగుదేశం నేతల విమర్శలకు భయపడి ప్రమాణం చేయడం లేదని ప్రొద్దుటూరు ప్రజల కోసమే ప్రమాణం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

టిడిపి నేత హత్యతో తనకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధం దని స్పష్టీకరణ
టిడిపి నేత హత్యతో తనకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధం లేదని పేర్కొన్నారు. సుబ్బయ్యను హత్య చేయమని తానెప్పుడూ చెప్పలేదని , హత్య గురించి తనకు ముందే తెలిసి ఉంటే చౌడమ్మతల్లి సాక్షిగా ఆపి ఉండేవాడినని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. టిడిపి నేత హత్య జరిగిన విషయం ప్రొద్దుటూరు ప్రజలకు ఎలా తెలిసిందో తనకు అలాగే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. తాను ఏదైనా తప్పు చెబితే అమ్మవారి శిక్షకు గురవుతారని పేర్కొన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాను చెప్పింది వాస్తవమైతే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు .

ఇటీవల పెరిగిపోయిన సత్యప్రమాణాల హడావిడి
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఆలయాలలో సత్య ప్రమాణాల దాకా వెళ్లడం తెలిసిందే. మొదట అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణాలతో మొదలుపెట్టిన ఈ తంతు, ఆ తర్వాత విశాఖకు పాకింది. విశాఖ తూర్పు నియోజకవర్గం లోని సాయి బాబా ఆలయంలో సత్య ప్రమాణానికి రావాలని వెలగపూడి రామకృష్ణ బాబు విజయసాయి రెడ్డి కి సవాల్ చేశారు.

తూర్పు గోదావరిలో మొదలై కడప దాకా పాకిన సత్య ప్రమాణాలు
విజయసాయికి బదులు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ విజయనిర్మల సాయిబాబా ఫోటో పట్టుకొని వెలగపూడి ఇంటికి వెళ్లి హడావుడి చేసింది. తూర్పు గోదావరిలో మొదలై కడప దాకా పాకిన సత్య ప్రమాణాలు ఇప్పుడు ఏపీలో చర్చకు కారణం అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా కడప జిల్లాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఎదుట టిడిపి నేత హత్యతో తనకు సంబంధం లేదని సత్య ప్రమాణం చేయడం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.