జగన్ రెడ్డీ... ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్, ఈ పాపం వూరికే పోదు : లోకేష్ ధ్వజం
ప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రొద్దుటూరులో పట్టపగలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరూ చూస్తుండగా దుండగులు టీడీపీ నేత సుబ్బయ్యను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీనే ఈ ఘటనకు కారణమని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రంగుల రచ్చ..పోలీస్ వాహనాలు వైసీపీ ప్రచార రథాలా?:అచ్చెన్నాయుడు, లోకేష్ ఫైర్

ఒక గొంతు నొక్కితే లక్ష గొంతులై వస్తాం
ఒక గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణచివేస్తాం జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు అంటూ పేర్కొన్న లోకేష్ ,నీ ఫ్యాషన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ సోషల్ మీడియా వేదికగా భగ్గుమన్నారు. చేనేత వర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని లోకేష్ ఆరోపణలు
మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని లోకేష్ ఆరోపణలు గుప్పించారు. హత్య చేసిన ఎమ్మెల్యే , అతని బావమరిది బంగారు రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వేటకొడవళ్లతో తండ్రిని నరికేయించావు. నువ్వు ఇచ్చే పరిహారంతో అనాధలైన ఆ పిల్లలకు తండ్రిని తేగలవా జగన్ రెడ్డి అంటూ జగన్ పై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు నారా లోకేష్.

నేడు ప్రొద్దుటూరుకు నారా లోకేష్ .. సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరు
అంతేకాదు నేడు ప్రొద్దుటూరుకు లోకేష్ వెళ్లనున్నారు. దారుణ హత్యకు గురైన టిడిపి నేత సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరు కానున్నారు. సుబ్బయ్య కుటుంబానికి ఓదార్పుగా, టిడిపి నేతలకు అండగా తాను ఉన్నారని చెప్పడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రొద్దుటూరు వెళుతున్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయని, వైసిపి హయాంలో దాడులు, దౌర్జన్యాలు పేట్రేగి పోతున్నాయని, టిడిపి నేతలు విమర్శలు గుప్పించినా, టీడీపీ అధినేత చంద్రబాబు డిజిపికి లేఖలు రాసినా ఫలితం మాత్రం శూన్యం గానే ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .