• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ వివేకా హత్య విచారణ సాగేదెలా? దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు, జగన్ వ్యాఖ్యాలు

|

కడప: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత కడప జిల్లాలో చోటు చేసుకున్న ఓ రాజకీయ హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. రెండు ప్రధాన పార్టీలు ఈ హత్య చుట్టూ రాజకీయాలు చేయడం మొదలు పెట్టాయి. ఈ రెండింట్లో ఒకటి బాధిత రాజకీయ పార్టీ. మరొకటి అధికారంలో ఉన్న పార్టీ. ఎన్నికల ముంగిట్లో ఈ హత్యోదంతం చోటు చేసుకోవడం..ఈ రెండు పార్టీలు దీని నుంచి లబ్ది పొందే ప్రయత్నాలను మొదలు పెట్టాయి. అదే మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం.

గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన స్వగృహంలోనే అత్యంత దారుణంగా హత్య చేశారు. గొడ్డళ్లతో నరికి చంపిన ఆనవాళ్లు భౌతిక కాయంపై కనిపించాయి. జిల్లా పోలీసులు కూడా ఇది హత్యగానే ప్రకటించారు. ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఒకవంక దర్యాప్తు సాగుతుండగా..మరోవంక- దాన్ని పక్కదారి పట్టించేలా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యహరిస్తున్నారు. వివేకా హత్యానంతరం చంద్రబాబు, జగన్ పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు సిట్ దర్యాప్తును గందరగోళంలో పడేశాయి. అసలు విషయాన్ని పక్కన పెట్టి, ఈ వ్యాఖ్యాలకు అనుగుణంగా పనిచేసేలా ప్రభావితం చేస్తున్నాయి. దీనితో దర్యాప్తు ముందుకు సాగట్లేదని తెలుస్తోంది. దీనితో సిట్ అధికారులు తల పట్టుకుంటున్నారు.

లోక్‌సభ ఎన్నికలు 2019 : ఓటుకు 5 రకాలుగా చోటు

ఈ ఘటనలో బాధిత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. కాగా, అధికారంలో ఉన్నది తెలుగుదేశం. ఎన్నికల ముంగిట్లో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య రాజకీయ రంగు పులుముకొంది. హత్యకు కారణం మీరంటే మీరంటూ రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలచుకున్నాయి. ప్రతి ఎన్నికల సభలోనూ వైఎస్ వివేకా హత్యోదంతాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

Parties searching Political benefits in YS Viveka murder case

రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. దానికి ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్. హత్య చోటు చేసుకున్న ప్రాంతం పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కంచుకోట అనడంలో సందేహాలు అక్కర్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం కావడం, దశాబ్దాలుగా అక్కడి ఓటర్లు వైఎస్ కుటుంబాన్ని కాదని మరో పార్టీ వైపు మొగ్గు చూపకపోవడం దీనికి ప్రధాన కారణం. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

వైఎస్ వివేకా హత్య పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందంటూ పోలీసులే చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత, పోలింగ్ ముంగిట్లో, ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో వివేకాను హతమార్చడం.. వెనుక అనేక బలమైన కారణాలు ఉండొచ్చు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ఉపయోగించుకోవడంతో పాటు ప్రత్యర్థిని మానసికంగా బలహీనపర్చడానికి అధికార పార్టీ ఈ హత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిన ప్రాంతం, అక్కడి పరిస్థితులు, రాజకీయ వాతావరణం ఈ ఆరోపణలకు ప్రాతిపదికగా తీసుకోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

దీనికి అనుగుణంగా- ఓ మాజీ మంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్.. తన సొంత నివాసంలో అత్యంత దారుణంగా హత్యకు గురైతే..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. అది కనీస బాధ్యత. ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేస్తూనే.. ఆ వెనుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హత్య వెనుకు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆ హత్య వెనుక బాధిత రాజకీయ పార్టీ ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ హత్యను దగ్గరుండి, తన కళ్లతో చూసినట్టుగా రన్నింగ్ కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి సహా కొందరు టీడీపీ నాయకులు. సానుభూతి కోసం వైఎస్ జగనే తన చిన్నాన్నను హత్య చేయించారంటూ వివాదస్పదంగా స్పందించారు.

ఈ హత్య వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందని ప్రతిపక్షం ఆరోపించడం అత్యంత సహజం. పైగా హత్యకు గురైంది స్వయానా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుడు కావడం.. తెలుగుదేశాన్ని మరింత ఇరుకున పెట్టే విషయం. ఈ హత్యను సీబీఐకి విచారణకు ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయగా.. దానికి సానుకూలంగా స్పందించలేదు టీడీపీ ప్రభుత్వం. తన ఆధీనంలో, తన కనుసన్నల్లో పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, చేతులు దులుపుకొంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వయంగా బాధిత పార్టీ కావడంతో..ఆ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు, విమర్శలను పక్కన పెడితే.. అధికారంలో ఉండీ, శాంతిభద్రతలను పర్యవేక్షించే బాధ్యతను భుజాల మీదికి ఎత్తుకున్న తెలుగుదేశం కూడా వివేకా హత్య నుంచి రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నాలు చేస్తుండటం ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించింది. వివేకా హత్యను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన అధికారంలోకి వస్తే.. రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ అధికారంలోకి వస్తే ఏ విధంగా రాష్ట్రం రావణ కాష్టం అవుతుందనేది విడమర్చి చెప్పలేకపోతున్నారు.

వివేకా హత్య జరిగింది తాను అధికారంలో ఉన్నప్పుడే, తన ప్రభుత్వ హయాంలోనే అనే చిన్న లాజిక్ ను చంద్రబాబు విస్మరిస్తున్నారు. ఓ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ పెద్దగా, శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయనదే. అయినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా.. జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. హత్య జరిగిన తీరును చూసినట్టుగా వివరిస్తున్నారు.

దీని ప్రభావం సిట్ దర్యాప్తు మీద తప్పక చూపుతుందని స్వయానా వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యను రాజకీయం చేయొద్దంటూ ఆమె వేడుకున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, అది ఒక్క సీబీఐతో మాత్రమే సాధ్యపడుతుందని చెప్పారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే సిట్ వల్ల ఉపయోగం లేదని చెప్పారు.

మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యానాలు కూడా సిట్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయి. ఆయన ప్రధాన ఆరోపణలన్నీ తెలుగుదేశం పార్టీ చుట్టే చేస్తున్నారు. దీనితో- కొత్త కోణాన్ని అన్వేషించే అవకాశం సిట్ కు లభించట్లేదని అంటున్నారు. వైఎస్ జగన్ చేస్తోన్న ఆరోపణలు తెలుగుదేశాన్ని రెచ్చగొట్టేలా ఉన్నా యే తప్ప, సిట్ దర్యాప్తునకు ఉపయోగ పడేలా బలమైన సాక్ష్యాలు లోపించాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ.. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న సందర్భంలో చోటు చేసుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రెండు పార్టీలూ రాజకీయం చేశాయి. దీని ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నాయి.

English summary
Rulling Telugu Desam Party and Opposition YSR Congress Party allegedly makes YS Vivekananda Reddy murder issue is Vote Bank Politics. Both Parties trying Political benefit from this Murder. They critics each other will mislead to Special Investigation Team, Opinion said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X