పోలవరం పూర్తిచేస్తాం.. సీమ కోసం మోడీ ఎంతో చేశారు: సోము వీర్రాజు, కిషన్ రెడ్డి
ఇప్పట్లో ఎన్నికలు లేవు.. అయినా ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. అవును జనంతో కలిసిపోతున్నారు. రాయలసీమ ప్రాంత సమస్యలపై బీజేపీ ఆధ్యర్యంలో కడపలో "రాయలసీమ రణభేరి" పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. సోమశిల ప్రాజెక్ట్ ముంపు బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేదని తప్పుబట్టారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ పూర్తి చేస్తారని తెలిపారు. రాయలసీమలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతామని వీర్రాజు ప్రకటించారు. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్షవైఖరికి నిరసనగా ఈ సభ జరిగింది. ఈ సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు సునీల్ దేవధర్, సోమువీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రులు పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డిలతోపాటు ఇతర రాష్ట్ర నేతలు, రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు.

రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ రణభేరిలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. జగన్ ఆరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం మోడీ ఎంతో చేశారని చెప్పారు. సీమ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జగన్ హయాంలో కునారిల్లుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
జగన్ సర్కార్‌పై బీజేపీ విమర్శలు కొనసాగుతున్నాయి. ఏం చేశారని నిలదీస్తున్నారు. హామీలకే పరిమితం అయ్యారని ఫైర్ అవుతున్నారు. ఏపీలో బలపడాలని బీజేపీ చూస్తోంది. వాస్తవానికి ఏపీ కన్నా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. రెండుచోట్ల బలపడేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.