btech ravi chennai tdp arrest chandrababu naidu Pulivendula kadapa బీటెక్ రవి చెన్నై టీడీపీ అరెస్ట్ చంద్రబాబు నాయుడు పులివెందుల కడప politics
అంతర్జాతీయ నేరస్థుడిలా చెన్నై ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైనేనా?: బీటెక్ రవి అరెస్ట్, చంద్రబాబు ఫైర్
చెన్నై/అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో డిసెంబర్ 19న జరిగిన దళిత మహిళ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు.

పులివెందుల ర్యాలీ కేసులోనే బీటెక్ రవి అరెస్ట్
అయితే, హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేశారని, టీడీపీ నేతలు మాత్రం తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీలు నిర్వహించారంటూ బాధిత దళిత మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో డిసెంబర్ 22న పోలీసులకు హత్యకు గురైన దళిత మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీటెక్ రవి తోపాటు 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులోనే చెన్నైలో రవిని అరెస్ట్ చేశారు.

వెనక్కితగ్గేది లేదంటూ బీటెక్ రవి
చెన్నైలో కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం బీటెక్ రవి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మూడు రోజుల వరకు సొంత ఊరిలో ఉన్నప్పుడు పట్టించుకోని పోలీసులు.. పనిమీద పొరుగు రాష్ట్రంలో ఉంటే హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు.

అంతర్జాతీయ నేరస్థుడిలా రన్ వేపై అరెస్ట్ చేస్తారా?: బీటెక్ రవి
బెంగళూరు నుంచి చెన్నై వస్తే అంతర్జాతీయ నేరస్తుడిని పట్టుకున్నట్లు విమానాశ్రయం రన్‌వేపై పోలీసులు అరెస్ట్ చేశారని రవి ఆరోపించారు. కేసులు తమకేమీ కొత్త కాదని, ప్రజల కోసం జైలుకెళ్లేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

బీటెక్ రవి అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం
ఇక బీటెక్ రవి అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం కక్షసాధింపులో భాగమేనని అన్నారు. చలో పులివెందుల నిర్వహించినందుకే రవిని అరెస్ట్ చేశారన్నారు. అధికార బలంతో టీడీపీ నేతలపై అక్రమ కేసుల బనాయిస్తున్నారని మరో టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.