Kadapa: జగన్ సొంత జిల్లాలో చంద్రబాబు టూర్: సమన్వయ కమిటీ భేటీకి సీనియర్లు డుమ్మా..!
కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించబోతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించబోతుండటం ఇదే తొలిసారి. ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు.
చంద్రబాబు కు కొత్త టెన్షన్: 14 ఏళ్ల స్టే తొలిగింపు..విచారణ షురూ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ..!

మరో విడత జిల్లా స్థాయి సమీక్షలు ఆరంభం..
ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వంటి కొన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ముగిశాయి. ఆ తరువాత సమీక్షలకు కొద్దిగా విరామం ఇచ్చారు. మరో విడత సమావేశాలకు తెర తీశారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపతో ఈ వరుస భేటీకు శ్రీకారం చుట్టారు. జిల్లా రాజకీయాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు వంటి అంశాలపైనా చంద్రబాబు ఆరా తీస్తారని తెలుస్తోంది.

సమన్వయ కమిటీ సమావేశానికి సీనియర్లు డుమ్మా..
చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ను నిర్ధారించడానికి బుధవారం ఉదయం కడపలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి సారథ్యం వహించారు. ఈ సమావేశానికి దాదాపు సీనియర్ నాయకులందరూ డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, పాలకొండ్రాయుడు, జిల్లా తెలుగు యువత నాయకుడు ప్రసాద్ బాబు, సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీటెక్ రవి, శివనాథ రెడ్డి గైర్హాజరయ్యారు.

కొంపలు ముంచుతోన్న వైసీపీ..
సమావేశం ముగిసిన అనంతరం అమర్ నాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలతో మమేకమై వారికి భరోసా ఇవ్వడానికే చంద్రబాబు జిల్లా పర్యటనలు చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంపలు ముంచే కార్యక్రమాలను చేపట్టిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యక్రమాలను దూరం పెట్టిందని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల వల్లే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని, వాటినే పక్కన పెట్టడం జగన్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని అన్నారు.

పెట్టుబడులు పెట్టడానికి విముఖత..
రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడానికి పారిశ్రామికవేత్తలు విముఖత వ్యక్తం చేస్తున్నారని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీని ప్రోత్సహించామని, ఇప్పుడు అంతా తిరోగమిస్తోందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు తన హయాంలో అహర్నిశలు శ్రమించారని, పెట్టుబడులను ఓ కొలిక్కి తీసుకొచ్చారని అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని జగన్ అతి తక్కువ సమయంలో అధోగతి పాలు చేశారని మండిపడ్డారు.

వరదలు లేని చోట ఎందుకు ఇసుక కొరత ఎలా
ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. వరదలు లేని జిల్లాల్లో ఇసుక కొరత ఎలా ఏర్పడిందని ఆయన నిలదీశారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారనడాని ప్రభుత్వ వ్యతిరేక విధానాలే నిదర్శనమని చెప్పారు. సంస్థాగతంగా, గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతం చేసే దిశగా అడగులు వేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తల్ల మనో దైర్యాన్ని నింపి అండగా ఉంటామని అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!