జగన్ కు వైఎస్ వివేకా కుమార్తె షాక్ .. తండ్రి హత్యకేసులో సాయం కోసం 'సిస్టర్ అభయ కేసు' హక్కుల కార్యకర్తతో భేటీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తున్నా ఇప్పటివరకు కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని సొంతింట్లో వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైనప్పటినుండి ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకోలేకపోయారు. తన తండ్రి చావుకు కారణం ఎవరు అన్నది తెలుసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.

సీబీఐ దర్యాప్తులోనూ తేలని వివేకా హత్యకేసు .. మరో నిర్ణయం తీసుకున్న వివేకా తనయ
గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్యపై తీవ్రంగా స్పందించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో చంద్రబాబు వేసిన సిట్ దర్యాప్తును ఆపివేసి , వైసిపి ప్రభుత్వ హయాంలో కొత్తగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో సునీత డిమాండ్ మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సిబిఐ విచారణలో కూడా ఇప్పటివరకు ఆశించిన పురోగతి కనిపించని కారణంగా తీవ్ర అసహనంతో ఉన్న సునీత ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సిస్టర్ అభయ రేప్ , హత్య కేసులో చివరి దాకా పోరాడిన హక్కుల కార్యకర్త జోమున్
కొద్ది రోజుల క్రితం సిస్టర్ అభయపై రేప్, హత్య కేసులో తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఈ కేసులో నిందితులకు శిక్ష పడిన విషయం సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో కేరళకు చెందిన జోమున్ అనే హక్కుల కార్యకర్త చివరి వరకూ పోరాటం సాగించింది. ఫైనల్ గా సిస్టర్ అభయ పై రేప్ మరియు హత్యకేసులో దోషులకు శిక్ష పడేలా చేసింది. దీంతో ఈమె పేరు బాగా హైలెట్ అయ్యింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత హక్కుల కార్యకర్త జోమున్ తనకు సాయం చేస్తే తండ్రి హత్య కేసు ఛేదించిన అవకాశం ఉంటుందని భావించి ఆమెను కలిశారు.

జోమున్ తో వివేకా తనయ సునీత భేటీ .. తండ్రి హత్యకేసులో సాయం కోరిన సునీత
వైయస్ వివేకానంద రెడ్డి హత్య నుండి, ఇప్పటి వరకు అన్ని పరిణామాలను జోమున్ కు అర్థమయ్యేలా చెప్పారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోరాడటం కోసం జోమున్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో స్పందిస్తానని ఆమె పేర్కొన్నట్లుగా సమాచారం. తన తండ్రిని ఎవరు హతమార్చారు? ఎందుకు హతమార్చారు? వంటి సమాచారం ఇప్పటి వరకు ఈ కేసు విచారణలో వెలుగులోకి రాలేదు .

తండ్రి హత్యకేసు దర్యాప్తు విషయంలో తీవ్ర అసహనంలో సునీత
ఈ కారణంగా తీవ్ర అసహనం తో ఉన్న సునీత, తండ్రి హత్య కేసును ఛేదించడానికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే ఆమె హక్కుల కార్యకర్త జోమున్ ను కలిసి, తన తండ్రి హత్య విషయంలో ఆవేదన వెళ్లగక్కారు. ఈ కేసులో తనకు సహకరించాలని, త్వరితగతిని దోషులను పట్టుకోవడానికి సహాయం చేయాలని జోమున్ ను కోరారు.
ఈ కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి .