ధాన్యం కొనుగోలుపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. 51 చెక్ పోస్టులు ఏర్పాటు.. వారివి కొనం
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా కామెంట్ చేశాయి. అయితే ప్రభుత్వం ఇవాళ మెలిక పెట్టింది. అంటే ధాన్యం కొనుగోలు చేస్తాం.. కానీ అంటూ చెప్పేసింది. యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొనుగోలు చేస్తామని చెప్పేశారు.

కీలక నిర్ణయం..
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో కేవలం తెలంగాణకు చెందిన రైతుల ధాన్యాన్ని మాత్రమే కొంటామని స్పష్టంచేసింది. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన రైతుల ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. వాస్తవానికి రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సి ఉంటుంది. కానీ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు వచ్చి విక్రయించే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఇతర రాష్ట్రాల వారివి నో
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ధాన్యం కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం రాకుండా అడ్డుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నలుదిక్కులా 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ అధికారిని నియమిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రైతుల ఆధార్ కార్డుల పరిశీలన తర్వాతే ముందుకు సాగుతామని ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి పకడ్బందీగా వరి ధాన్యాన్ని సేకరిస్తారు.

రూ.1960
ఇటు యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిన్న కేసీఆర్ మీడియాముఖంగా చెప్పారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ ప్రభుత్వం మెలిక పెట్టింది. రాష్ట్రంలోని రైతులకు ఏమీ జరగకపోయినా.. పొరుగు రాష్ట్రాల వారికి మాత్రం మింగుడుపడదు.