10th ప్లేస్: జమ్మికుంట టౌన్ పీఎస్‌కు గుర్తింపు, జాతీయ స్థాయిలో చోటు..
2020 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఈ ఏడాదిలో జరిగిన అద్భుతాలు, పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఇస్తుంటారు. ఆయా కంపెనీలు/ సంస్థలు ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే పోలీసు స్టేషన్లకు కూడా ఇదీ తప్పనిసరి. పీఎస్ వద్ద పనితీరు, ఆరోగ్యకర వాతావరణం, ఉత్తమ పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా పది పోలీసు స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో కరీంనగర్ జిల్లాకు చెందిన జమ్మికుంటకు కూడా చోటు దక్కింది. 10 పోలీసు స్టేషన్ల జాబితాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటించింది.

మణిపూర్ పీఎస్ ఫస్ట్..
ఫ్రెండ్లీ పోలీసింగ్, సమస్య కోసం వచ్చిన ఫిర్యాదుదారులకు అందుతోన్న సేవల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. మణిపూర్ తౌబల్ జిల్లాకు చెందిన నాంగ్పొక్సెక్మటీ పోలీసు స్టేషన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు సేలం సిటీ జిల్లాకు చెందిన ఏడబ్ల్యూపీఎస్ సురమంగళం పోలీసు స్టేషన్ దక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్ లాంగ్ జిల్లా కర్సాంగ్ పీఎస్ మూడో స్థానంలో నిలువగా.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన జమ్మికుంట టౌన్ పోలీసు స్టేషన్ పదో స్థానంలో నిలిచింది.

2015 నుంచి స్టార్ట్
గత ఎన్డీఏ హయాంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్లను ప్రకటిస్తూ వస్తున్నారు. 2015లో గుజరాత్ కచ్‌లో జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్ సందర్భంగా మోడీ సూచన చేశారు. పోలీసు స్టేషన్ల పనితీరు ఆధారంగా రేటింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో అప్పటినుంచి అన్నీ అంశాలను పరిశీలించి మరీ రేటింగ్ ఇస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం సర్వే చేయడం హోంశాఖకు తలకుమించిన భారమయ్యింది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకోవడం కష్టంగా మారింది.

నిబద్దత, నేరాల నియంత్రణ
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సర్వే చేపట్టి.. ఉత్తమ 10 పోలీసు స్టేషన్ల జాబితాను ప్రకటించారు. దేశంలో చాలా పోలీసు స్టేషన్లు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బంది, నిబద్దత, నేరాల నియంత్రణ, దేశం కోసం పనిచేసిన పీఎస్‌లకు గుర్తించామని చెప్పారు. ఈ సారి 16 వేల 671 పోలీసు స్టేషన్లలో వివిధ అంశాలను పరిశీలించామని అమిత్ షా తెలిపారు. వాటిలో 10 పీఎస్‌లను ఎంపిక చేశామని వివరించారు.

వీటిని పరిగణలోకి తీసుకున్నారు
ఆస్తి తగాదాలు, మహిళలప నేరాలు, బలహీన వర్గాలపై కేసులు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాల గుప్తింపు ఆధారంగా ఎంపిక చేశారు. మృతదేహాల గుర్తింపు అంశాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టారు. ప్రతీ రాష్ట్రం నుంచి ఒక పోలీసు స్టేషన్‌ను ఎంపిక చేశారు.