శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?
కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రియల పథకం తెరపైకి తెచ్చిన పాలక మండలి.. తాజాగా మరో నాలుగు పథకాల అమలుకు సిద్ధమైంది. దాంతో ప్రజా సేవయే పరమావధిగా సాగుతున్న మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ప్రజా సంక్షేమం పరమావధిగా..!
కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోంది. ప్రజలకు ఉపయోగకరమైన సేవలు అందించడంలో ముందుంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పలు పథకాలను అమలు చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే రూపాయికే అంత్యక్రియలు పథకం ప్రారంభించిన పాలకమండలి తాజాగా మరో నాలుగు పథకాలను తెరమీదకు తెచ్చి స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.
జులై రెండో తేదీతో పాలకవర్గం గడువు ముగియనుంది. ఆ నేపథ్యంలో మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టారు మేయర్ రవీందర్ సింగ్. శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని అమలు చేసే తీరుతెన్నులపై వివరించారు.
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూ

నాలుగు కొత్త పథకాలు ఇవే..
ఒక్క రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమానికి ప్రశంసలు వెల్లువెత్తడంతో.. ఈసారి ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు నిర్వహించే స్కీమ్ అమలు చేయబోతున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సాయంతో ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించి కార్పొరేషన్ ఆవరణలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్ చేసే విధంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు మేయర్.
చెప్పులు లేకుండా తిరిగే అనాధలకు, పేదలకు చెప్పులు అందించే విధంగా బూట్ హౌస్ పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొందరు మూలన పడేసే పాత చెప్పులు, బూట్లను సేకరించి వాటికి రిపేర్లు చేసి అవసరమైన వారికి వాటిని అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. దానికోసం కళాభారతి ఆవరణలో ఓ షెడ్డును నిర్మించనున్నట్లు వెల్లడించారు.
కొన్ని కమ్యూనిటీ హాళ్లను ఎంపిక చేసి నాలుగు రీడింగ్ రూమ్స్ ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు. సేవా దృక్ఫథంతో మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న నైట్ షెల్టర్‌లో అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
అంతిమ యాత్ర - ఆఖరి సఫర్‌కు ఉపరాష్ట్రపతి ప్రశంసలు
ఇటీవలే ఒక్క రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది కరీంనగర్ కార్పొరేషన్. స్థానికంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కార్పొరేషన్ అండగా నిలబడేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉండే వారికి భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కరీంనగర్లో ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రవేశపెట్టిన రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకోవడం విశేషం.
అంతిమ యాత్ర - ఆఖరి సఫర్ పేరిట ప్రారంభించిన ఆ పథకం వివరాలను తెలుసుకున్న వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలికి అభినందనలు తెలిపారు. పేద, ధనిక బేధం లేకుండా, కులమతాల ప్రస్తావన లేకుండా ఇంత గొప్ప స్కీమ్ అమలు చేయాలనుకోవడం భేష్ అంటూ కితాబిచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!