కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : Karimnagar Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది. మధ్యలో టీడీపీ సత్తా చాటింది. ఆ తర్వాత బీజేపీ ఉనికి చాటుకుంది. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ 2004 నుంచి హవా కొనసాగిస్తోంది. అయితే 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేతిలో టీఆర్ఎస్ కు పరాభవం మిగిలింది. తిరిగి 2014లో టీఆర్ఎస్ తన ఆధిక్యం నిలుపుకోవడంతో బోయినపల్లి వినోద్ కుమార్ ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు.

1952లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో పి.డి.ఎఫ్ పార్టీ నుంచి బద్దం ఎల్లారెడ్డి విజయం సాధించారు. అదే టర్మ్ లో ఎస్.సి.ఎఫ్ పార్టీ నుంచి ఎం.ఆర్.కృష్ణ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1957-62 కాలానికి రెండోసారి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎ.ఆర్.కృష్ణ గెలుపొందారు. కరీంనగర్ లోక్‌సభకు రెండు మూడు సార్లు ఎన్నికైన నేతలున్నారు. ఎం.ఆర్.కృష్ణ, జె.రమాపతిరావు రెండుసార్లు, ఎం.సత్యనారాయణ రావు మూడుసార్లు, జువ్వాడి చొక్కారావు మూడుసార్లు, సి.హెచ్.విద్యాసాగర్ రావు రెండుసార్లు, కె.చంద్రశేఖర్ రావు (ఉపఎన్నికలతో కలిపి) మూడుసార్లు గెలిచారు.

కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ (జనరల్), వేములవాడ (జనరల్), సిరిసిల్ల (జనరల్), హుజురాబాద్ (జనరల్), హుస్నాబాద్ (జనరల్), చొప్పదండి (ఎస్సీ), మానకొండూర్ (ఎస్సీ) స్థానాలున్నాయి.

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్లయితే పురుషుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 15,50,810 మంది ఓటర్లున్నారు. అందులో
50.13 శాతంతో పురుషుల ఓట్లు 7,77,421 ఓట్లు ఉండగా, 49.86 శాతంతో 7,73,233 స్త్రీల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ స్త్రీ, పురుషుల నిష్పత్తి 995 : 1000 గా ఉన్నట్లు తెలుస్తోంది.

#LokSabhaElection2019: All about Karimnagar Constituency

1952లో తొలిసారిగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 1957-1962 నుంచి 1991-1996 వరకు దాదాపు నాలుగు దశాబ్ధాలు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా విజయపరంపర కొనసాగించింది. 1971-77 టర్మ్ లో ఎం.సత్యనారాయణ రావు తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో కొనసాగారు. ప్రస్తుతం 16వ లోక్‌సభ కొలువుదీరినప్పటికీ.. కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి 18 సార్లు ఎలక్షన్లు జరిగాయి.

2004-2009 టర్మ్ లో కరీంనగర్ లోక్‌సభకు మూడుసార్లు ఎన్నికలు జరగడం గమనార్హం. ఇక్కడి నుంచి 2004లో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ 2006లో అనూహ్యంగా కేసీఆర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ విజయం సాధించారు. అనంతరం 2008లో మరోసారి కేసీఆర్ ఎంపీగా రిజైన్ చేశారు. ఆ సమయంలో జరిగిన ఉపఎన్నికల్లో తిరిగి కేసీఆర్ గెలుపొందారు. ఒకటే టర్మ్ లో మూడుసార్లు ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో కొంత అసహనం పెరిగినట్లు కనిపించింది. దీంతో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు పట్టం కట్టారు. ఆయన చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్ ఓడిపోయారు.

2014వ సంవత్సరంలో 16వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్ బంపర్ మెజార్టీతో గెలిచారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై 2,04,652 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వినోద్ కుమార్ కు 5,05,358 (44.91%), పొన్నం ప్రభాకర్ కు 3,00,706 (26.73%), బీజేపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్ రావుకు 2,14,828 (19.09%) ఓట్లు పోలయ్యాయి.

2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ కు రాజకీయ కుటుంబ నేపథ్యముంది. కాకతీయ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, ఎల్ ఎల్ బీ పూర్తిచేశారు. 14 సంవత్సరాల వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగం ఎఐఎస్ఎఫ్ లో జాతీయస్థాయి పదవులు నిర్వహించారు. 1970-71 ప్రాంతంలో సీపీఐలో చేరి వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు. వివిధ ప్రజా ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొన్నారు. 1984 లో న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించి 1998 వరకు వరంగల్ లో ప్రాక్టీస్ చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన భార్య మాధవి డాక్టర్ వృత్తిలో ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

కరీంనగర్ కు అప్పట్లో సబ్బినాడు అనే పేరుండేది. సయ్యర్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా కరీంనగర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అదలావుంటే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కరి అనగా ఏనుగు, ఏనుగులు సంచరించే నగరం కాబట్టి కరినగరము అని పిలిచేవారట. అలా కాలక్రమంలో కరీంనగర్ అనే పేరొచ్చిందనేది మరో వాదన. పురాతన కాలం నుంచి కూడా వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధానిగా విరాజిల్లింది. సాహిత్యానికి, మేధావులకు కరీంనగర్ పుట్టినిల్లు అని చెప్పొచ్చు. అంతేకాదు విప్లవ భావజాలం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది.

గోండ్లు, కోయలు, చెంచులు, లంబాడీలు, ఎరుకల, తొటి మొదలైన అనేక గిరిజన జాతులకు ఆవాసము కరీంనగర్ ప్రాంతం. సర్వమత సమ్మేళనానికి ప్రతీక కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఇలా భిన్నమతాలకు చెందినవారు ఐకమత్యం చాటుతూ జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ స్థానంలో ప్రజల జీవనాధారంగా బీడీ పరిశ్రమ, వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వస్త్రాలు తయారుచేయడం(టెక్స్‌టైల్), వెండి నగిషీలు తీర్చిదిద్దడం (సిల్వర్ ఫిలిగ్రీ) ఇక్కడి ప్రత్యేకత.

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ లో పుణ్యక్షేత్రాలు, గడులు, కోటలు, గోదావరి నది ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతాయి. గోదావరి తీరాన సుప్రసిద్ధ కాళేశ్వరం టెంపుల్, ధర్మపురి లక్ష్మినరసింహ స్వామి ఆలయం ఉన్నాయి. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మరో పుణ్యక్షేత్రం. హుజురాబాద్ సమీపంలోని కొత్తగట్టు దగ్గర అరుదైన శ్రీమత్సగిరీంద్ర స్వామి ఆలయం భక్తులను అలరిస్తోంది.

రామగుండంలో పవర్ ప్రొడక్షన్ ఎన్టీపీసీ, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (బొగ్గు ముడిపదార్థంగా ఎరువును తయారుచేసే మొట్టమొదటి ఫ్యాక్టరీ), సింగరేణి కాలరీస్ తో పాటు తెలంగాణలో ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది కరీంనగర్.

కరీంనగర్ ఎంపీగా బి.వినోద్ కుమార్ కు ప్లస్, మైనస్ పాయింట్లు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు. అభివృద్ధి విషయంలో దృష్టి సారించినా.. నియోజకవర్గానికి పెద్దగా సమయం కేటాయించలేదనే ఆరోపణలున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టారే తప్ప నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేరనే అపవాదు మూటగట్టుకున్నారు. స్వతహాగా ఆయన లాయర్ కావడంతో న్యాయ సంబంధిత అంశాలపై పార్లమెంట్ లో చాలా బాగా ప్రస్తావించారు. హైకోర్టు విభజన, పోలవరం వివాదం, విభజన హామీలు తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

అంతేకాదు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు సాధించారు. మనోహరాబాద్ - కొత్తపల్లి, పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్లు పూర్తిచేయించడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గా పేరు మార్చడం, కాజీపేట రైల్వే డివిజన్ డిక్లేర్ చేయడం లాంటి పనులు వినోద్ కుమార్ కు ప్లస్ పాయింట్లు. ఆయన దత్తత తీసుకున్న వీర్నపల్లి గ్రామం అభివృద్ధిపథంలో పయనిస్తోంది. తాజాగా దండేపల్లి గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నా.. అభివృద్ధికి నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ లో నేత కార్మికులు ఎక్కువ. వారికోసం చొప్పదండి నియోజకవర్గంలోని రుక్మాపూర్ లో లెదర్ పార్క్ ఏర్పాటు చేయిస్తాననే హామీ నెరవేర్చలేదు. దీనికోసం 150 ఎకరాల భూమి సేకరించినా లాభం లేకుండా పోయింది. అందులో ఇప్పటికే 50 ఎకరాలు పోలీస్ శాఖకు ప్రభుత్వం కేటాయించడంతో లెదర్ పార్క్ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేనేత సమస్యలపై లోక్‌సభలో వినోద్ కుమార్ ఎన్నోసార్లు ప్రస్తావించినా.. రుక్మాపూర్ లో లెదర్ పార్క్ రాకపోవడం మాత్రం ఆయనకు బిగ్ మైనస్ పాయింట్.

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ పార్లమెంట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. విభజన సమస్యలు, బడ్జెట్ తదితర అంశాలకు సంబంధించి 102 చర్చల్లో (As On 31.12.2018) పాల్గొన్నారు. నియోజకవర్గంతో పాటు ఇతరత్రా సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి 537 ప్రశ్నలు (As On 03.01.2019) సంధించారు. అయితే ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో మాత్రం ఆయన వెనుకబడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. రికార్డుల్లోని లెక్కల ప్రకారం గడిచిన మూడున్నరేళ్లలో 7 కోట్ల 50 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. సీసీ రోడ్లకు, సామాజిక వర్గాల సంక్షేమ భవనాలకు ఆ నిధులు పెద్దమొత్తంలో వెచ్చించినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ లో ఓటర్ల నాడి పసిగట్టడం అంతా ఈజీ కాదంటారు విశ్లేషకులు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే చందంగా ఉంటుందట ఇక్కడి ఓటర్ల తీర్పు. గెలుపెవరిదో చెప్పడం కష్టమంటారు. 2004 నుంచి ఇక్కడ హవా కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. 2014 నాటి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంది.
రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా 2014 నాటి సీన్ క్రియేట్ చేసేలా టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికారపీఠంపై ఉన్న బీజేపీ కూడా 2019 ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఈనేపథ్యంలో కరీంనగర్ సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ తప్పదు.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Karimnagar Lok Sabha Constituency of Telangana. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X