• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాపై దాడి చేస్తారేమో, రాజకీయాలకు గుడ్‌బై చెప్తా: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, హరీశ్‌పైనా..

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలం నర్సింహులపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో గ్రామస్తులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఆ రోజుల్లోనే నాపై దాడికి కుట్ర: ఈటల రాజేందర్

ఆ రోజుల్లోనే నాపై దాడికి కుట్ర: ఈటల రాజేందర్

అక్టోబర్ 13, 14 తేదీలలో నామీద నేనే దాడి చేయించుకుంటా అని మంత్రులు అంటున్నారు. నా మీద దాడికి ఏమైనా కుట్ర చేస్తున్నారేమో.. అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నామీద ఒక మంత్రిగారు మాట్లాడుతున్నారు. నేను చేతకాక.. ముఖం చెల్లక.. ఓడిపోతాను అనే భయంతో.. నా కార్యకర్తలతో నేనే ఈ నెల 13, 14 తేదీలలో దాడి చేయించుకొని.. కాళ్లు, చేతులకు కట్లు కట్టుకుని.. నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఓట్లు అడుగుతారు అని మాట్లాడుతున్నారు. ఇదే చెన్నూరు ఎమ్మెల్యే కూడా కమలాపూర్‌లో మాట్లాడారు. కన్నీళ్లు పెట్టడం ఈటల రాజేందర్‌కి రాదు. అలాంటి పనికిమాలిన పనులు ఈటల చేయడు. నా మీద దాడి చేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి. మాజీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్‌మెన్లు ఉంటారు. నేను మాజీ మంత్రిని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు మాత్రం ఒక్కడే గన్‌మెన్ ఉంటాడు. అయినా బయటికి పోవడానికి భయపడే వాడిని కాదు.' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

మీకోసం ఎర్ర బస్సులా నేనుంటా: ఈటల రాజేందర్

మీకోసం ఎర్ర బస్సులా నేనుంటా: ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ అబద్ధాల మాటలు పక్కనపెట్టి దళితులకు పది లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తాను లేఖ రాశానని దొంగ లేఖలు సృష్టించి.. దళితులకు పది లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు పది లక్షలు ఇచ్చినట్లుగానే.. ఇతర పేదలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడితనానికి తెరలేపారని టీఆర్ఎస్ నాయకులపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఓటుకి 20 వేలు ఇస్తారట తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకు వేయండి. చెయ్యి ఎత్తగానే ఎర్ర బస్సు ఎలా ఆగుతుందో.. నేను కూడా చెయ్యి ఎత్తగానే ఆగి పనిచేసే వాడినని ప్రజలకు ఈటల స్పష్టం చేశారు. పచ్చని సంసారాల్లో సీఎం కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని ఈటల ఫైర్ అయ్యారు. గ్రామాలను దావతులకు అడ్డాలుగా మార్చారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులను అంగట్లో సరుకులు కొన్నట్లు కొని ప్రజాక్షేత్రంలో వారిని పలుచన చేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతే.. రాజకీయాలకు గుబ్‌బై అంటూ ఈటల

టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతే.. రాజకీయాలకు గుబ్‌బై అంటూ ఈటల

అంతేగాక, హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నన్ను రాజకీయంగా చంపాలనుకుంటున్నావేమో.. కానీ నేను చావను. మీ పార్టీ 2023లో తెలంగాణ గడ్డమీద అడ్రస్ లేకుండా చేస్తా. శపించడానికి నేను రుషిని కాకపోవచ్చు కానీ.. ప్రజల కళ్లల్లో ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వృద్ధుల తరంకాదు, యువతరం చూస్తోంది. నేను రాజీనామా చేసినప్పటి నుంచి హుజురాబాద్ అట్టుడుకి పోతోంది. ఎన్నడూ కనిపించని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఇండ్లు కిరాయి తీసుకుని ఊర్లకు ఊర్లు బార్లుగా మార్చారు. నన్ను కలిసే వాళ్లపై నిఘా పెట్టి వాళ్ల ఇళ్లలోకి వెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బతిమాలినా వినకపోతే.. భయపెడుతున్నారు. నన్ను కలిసిన దళితుల ఇంటికి పోలీసులు, నాయకులు వెళ్లి బియ్యం డబ్బాలు, పప్పు డబ్బాలు చెక్ చేస్తున్నారు. కానీ, వాళ్లు భయపడుకుండా.. మా ఇళ్ల మీదకు ఎవరు పంపారంటూ మర్లపడ్డారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు. .

హరీశ్ రావు.. అందుకేనా మంత్రి పదవి నుంచి తొలగించింది?: ఈటల

హరీశ్ రావు.. అందుకేనా మంత్రి పదవి నుంచి తొలగించింది?: ఈటల

నాతో తిరిగే వాళ్ల భార్యలు ఆశావర్కర్లుగా, వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. నాతో తిరిగితే వారి భార్యల నౌఖరీ పోతుందని బెదిరిస్తున్నారు. ఇట్లా బెదిరించి, బలవంతంగా తమవైపు తిప్పుకోవాలనుకుంటే కుదురుతుందా? భయంతో కొందరు కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నప్పటికీ... తమ గుండెళ్లో పువ్వు గుర్తును పెట్టుకున్నారు. ఎన్నడూ మీ కష్టాలు చూడని వాళ్లు.. ఇప్పుడు డప్పు చాటింపు వేసి పథకాలు ఇస్తున్నారు. బీజేపీకి మద్ధతు ఇస్తున్న వారి వాడల్లో రోడ్లు వేస్తలేరు. కానీ చెరువు కట్టలపై మాత్రం రోడ్లు వేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇస్తే.. చెడ్డపేరు వచ్చి నేను కొట్టుకుపోతానని భావించారు. కానీ అక్కడ కూడా మంచి పేరు వస్తే వాళ్లు ఓర్వలేకపోయారు. రాజీనామా చేసి కూడా ప్రజలకు ఇన్నిసాధించాడని, గెలిస్తే మరెన్ని సాధిస్తాడోనని నా గురించి బిఎస్ రాములు ఆర్టికల్ రాశారు. ఫామ్ హౌస్‌లో పడుకునే సీఎం.. నేను గెలిస్తే హుజురాబాద్‌కు వచ్చి మీ కోసం నా రక్తం ఉన్నంతవరకు పనిచేస్తానంటడు, జై భీం అంటడు, జై అంబేద్కర్ అంటడు. అలాంటి పరిస్థితి రావాలా వద్దా? నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానంటే తేల్చలేదు. ఇప్పుడు మీరు ముక్కు రాయమంటే.. సమాధానం లేదు. నేను ముఖ్యమంత్రికి ఎసరు పెట్టానని హరీశ్ రావు అంటున్నాడు. నన్ను మంత్రిగా అందుకే తీసేశారా? లేక భూములు ఆక్రమించుకున్నాని తీసేశారా? మీ రెండు నాలుకల ధోరణిలో ఏది కరెక్టో చెప్పాలని ఈటల రాజేందర్ నిలదీశారు.

రాజీనామాకు సిద్ధమా కేసీఆర్.. ఈటల సవాల్

రాజీనామాకు సిద్ధమా కేసీఆర్.. ఈటల సవాల్


తన పేరుతో ఇప్పటి వరకు మూడూ దొంగ ఉత్తరాలు రాశారని. దళితబంధు ఆపాలని తాను రాసినట్లు ఓ ఉత్తరం సృష్టించారని ఈటల తెలిపారు. కాగా, అలాంటిదేమీ లేదని ఎన్నికల అధికారి ప్రకటించారు. దళితబంధు అందరికీ ఇవ్వాల్సిందే. వారికి ఆ నగదును స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి. నిరుపేదలందరికీ కులాలకతీతంగా పది లక్షలు ఇవ్వాలి. గతంలో కూడా నేను సీఎంను క్షమించమని ఉత్తరం రాసినట్లు సృష్టించారు. అవసరమైతే చచ్చిపోతా తప్ప.. ఆయనకు లొంగిపోను. దమ్ముంటే.. డబ్బులు, సారా సీసాలు, పోలీసుల దుర్మార్గాలు, అధికారుల దౌర్జన్యాలు పక్కనపెట్టి ధీరుడిలా తలపడు. మీరు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే సీఎం రాజీనామా చేయాలి. వడ్లు కొనేదిలేదన్న కేసీఆర్ వైపు ఉంటారా? కొనాల్సిందేనని చెప్పిన ఈటల వైపు ఉంటారా? సొంత స్థలాలలో ఇండ్లు కట్టుకునే జీవో ఇవ్వాలని అడిగే ఈటల వైపు ఉంటారా? ఏడేళ్లుగా ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని కేసీఆర్ వైపు ఉంటారా? పింఛన్ ఇవ్వనన్నకేసీఆర్ వైపు ఉంటారా? ఇవ్వాలని కోరిన నా వైపు ఉంటారా? నాకు మీపై సంపూర్ణ విశ్వాసం ఉంది. చాలా మంది వృద్ధులు రాజేందర్‌‌కే ఓటేస్తామంటున్నారు. కానీ, వాళ్లకు నాగుర్తు తెలియకపోవచ్చు. మీరే పువ్వు గుర్తుని గుర్తు చేసి చెప్పండి. నిన్నటి దాకా నాతో ఉన్న నాయకుడు మరొకరు వెళ్లిపోయారు. ఎవరు ఏ క్షణంలో వెళ్లిపోతారో తెలియడం లేదు. అయినా భయపడను. నాతో మీరున్నారు' ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

English summary
TRS leaders may attack on me: Etala Rajender hits at CM KCR, minister Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X