పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి కేసులో ట్విస్ట్.. డైరీలో అలా ఎందుకు రాశారు..?
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం మృతి కేసులో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. మనోహర్ రెడ్డి బావ సత్యనారాయణ రెడ్డి తమ ఆస్తి మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి అప్పగించాలని డైరీలో పేర్కొన్నారు. కరీంనగర్‌లోని సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణంలో డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఆత్మహత్యకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టే.. సత్యనారాయణ రెడ్డి తన డైరీలో ఇలా రాసుకున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆస్తి మొత్తాన్ని టీటీడీకి ఇవ్వాలని ఎందుకు సూచించాడు.. ఒకేసారి ముగ్గురు చనిపోవడం నిజంగా ఆత్మహత్యేనా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది.
ఆరోజు అసలేం జరిగింది.. కారులో ఎక్కడికి బయలుదేరారు.. మిస్టరీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి

ఎందుకలా రాశారు..
సత్యనారాయణ రెడ్డి తన ఆస్తి మొత్తాన్ని టీటీడీకి రాసి ఇవ్వాలని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఎవరైనా చనిపోతే.. వారి ఆస్తి కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు చెందుతుంది. సత్యనారాయణ రెడ్డి తన ఆస్తిని బంధువులకు కాకుండా టీటీడీకి చెందేలా డైరీలో పేర్కొన్నారంటే.. వాళ్లతో ఆయన కుటుంబానికి సత్సంబంధాలు లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సత్యనారాయణ రెడ్డి కుటుంబం 20 రోజులకు పైగా కనిపించకుండా పోయినా.. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిసినప్పుడే.. బంధువులతో వారికి సరైన సంబంధాలు లేవా అన్న సందేహాలు తలెత్తాయి. తాజాగా దొరికిన డైరీలో వెలుగుచూసిన అంశాలను బట్టి దీనికి బలం చేకూరుతోంది.

అలా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు..?
పోలీసులు అనుమానిస్తున్నట్టు ఒకవేళ సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే.. అలాంటి పద్దతినే ఎందుకు ఎంచుకున్నారన్నది అనుమానాస్పదంగా మారింది. ముగ్గురూ అనుకునే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక సత్యనారాయణ రెడ్డి మాత్రమే ఆత్మహత్యకు ప్లాన్ చేశాడా అన్నది తేలాల్సి ఉంటుంది. ఇప్పటికైతే పోలీసులు వారిది ఆత్మహత్యే అని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి వివాదాస్పద అంశాలు గానీ,ఇతరులతో శత్రుత్వం వంటి విషయాలు గానీ వారి దృష్టికి రాలేదని తెలుస్తోంది. సత్యనారాయణ రెడ్డి డైరీతో పాటు పలు కీలక ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు.. ప్రస్తుతం విచారణను రహస్యంగా ఉంచుతున్నారు.

అసలేం జరిగింది..
కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో అనూహ్యంగా బయటపడ్డ కారులో దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)ల మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటికీ వారు కనిపించకుండా పోయి 20 రోజులు దాటిపోయింది. అంతకుముందు రోజు పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన అనే దంపతులు ఆదివారం రాత్రి కరీంనగర్ నుంచి గన్నేరువరం వెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు అలుగునూరు కెనాల్‌లో పడిపోయారు. బైక్ లైట్ వెలుతురుకి భారీగా వచ్చిన పురుగులు ప్రదీప్ కళ్లల్లో పడటంతో.. ప్రమాదవశాత్తు బైక్ కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎల్‌ఎండీ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి.. ప్రదీప్‌ను కాపాడారు. అప్పటికే కీర్తన గల్లంతయ్యారు. దీంతో కీర్తన కోసం గాలించేందుకు అధికారులతో మాట్లాడి కాలువకు నీటిని నిలిపివేశారు. దీంతో మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. కాలువలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. అందులోనే సత్యనారాయణ రెడ్డి కారు బయటపడింది. జనవరి 27న ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు.


కుటుంబ నేపథ్యం..
దాసరి మనోహర్ రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి కరీంనగర్‌లో సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ వ్యాపారం చేస్తున్నారు. మనోహర్ రెడ్డి సోదరి,సత్యనారాయణ రెడ్డి భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సత్యనారాయయణ-రాధ దంపతులకు ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది.