ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..
తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
ఇంట్లో పని కోసం పెట్టుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు ఓ ఇంటి ఓనర్. ముస్తఫా నగర్ కు చెందిన రాములమ్మ, సుబ్బారావుల ఇంట్లో పని కోసం ఒక 13 ఏళ్ల బాలికను తెచ్చి పెట్టుకున్నారు. కరోనా కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిన బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో పని చేయడానికి పంపించారు.
గుర్గావ్ లో మరో దారుణం .. యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే 16 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం
ఈ క్రమంలో ఇంటి ఓనర్ కుమారుడు బాలికపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించే సరికి పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశాడు సదరు ప్రబుద్ధుడు. దీంతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు విషయం తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే స్థానికులు బాలికను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఈ విషయం తెలిసిన ఇంటి ఓనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించే ప్రయత్నం చేశారు. డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలని ప్రయత్నించారు.

అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం ప్రస్తుతం విషమించడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా,నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నా, ఎన్ కౌంటర్ లతో భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా బాలికలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశం హత్రాస్ లో యువతిపై సామూహిక అత్యాచారం ఘటనతో ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న వేళ ఈ రాష్ట్రం , ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా వరుసగా నిత్యం జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.