కేసీఆర్పై తిరగబడండి, మంత్రులు, ఎమ్మెల్యేలకు షర్మిల అల్టిమేటం
సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆమె ప్రజా ప్రస్తాన పాదయాత్ర కొనసాగింది. చింతపల్లి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలు ఇచ్చారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాదని మండిపడ్డారు. పాలకుల కోసం ప్రజలను దోచుకునే ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కేసీఆర్ ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలమంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కు కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సైతం వంచించాడని మండిపడ్డారు. చివరి గింజ వరకు కేసీఆర్ వడ్లు కొనాల్సిందేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు గెలిపించింది వడ్లు కొనడానికా, లేక ధర్నాలు చేయడానికా? అని ప్రశ్నించారు. మోడీ వస్తే ప్రశ్నించకుండా కేసీఆర్ ఎందుకు దాక్కున్నారని నిలదీశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పై తిరగబడాలని సూచించారు. కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని కేసీఆర్ను నిలదీయాలని కోరారు.

ఇదివరకు వైయస్ఆర్ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని షర్మిల తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయ పాలన అందించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అందరికీ వర్తించేలా చేశారు. ఏ నాయకులు ఆలోచన చేయకుండా, పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. కానీ కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని.. మూడెకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేశారు. చివరికీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలను ఛీట్ చేశారని తెలిపారు.