ధర్నాలో పాల్గొనకుంటే రైతు బంధు ఆపేస్తారా.. ఎర్రబెల్లిపై షర్మిల నిప్పులు
వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. సీఎం కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్యంగా ఆమె విమర్శలు చేశారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం ఆరెకోడు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం రూరల్ మండలం మూతగూడెం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం రెడ్డి పల్లి, పల్లెగూడెం, పోలెపల్లి, గొల్లపాడు, తీర్థాల, కామంచికల్, పట్వారీగూడెం మీదుగా పాదయాత్ర సాగింది. గొల్లపాడు గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.
యాసంగి పంట కొనుగోలు గురించి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ వరుసగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

నిరసనల్లో పాలుపంచుకోని రైతులకు రైతు బంధు నిలిపివేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నట్లుగా ప్రచారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. 'ఎవరో ఎర్రబెల్లి అంట. బీజేపీకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయాలట. రైతు బంధు నిలిపేయడానికి ఎర్రబెల్లి ఎవరు? ఎర్రబెల్లికి దమ్ముంటే కేసీఆర్పై పోరాటం చేయాలి' అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు నిలిపివేయడం ఏంటీ అని ఆమె మండిపడ్డారు.
ఇదివరకు వైయస్ఆర్ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని షర్మిల తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయ పాలన అందించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అందరికీ వర్తించేలా చేశారు. ఏ నాయకులు ఆలోచన చేయకుండా, పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. కానీ కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు.