ఖమ్మంలో 40 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఆవిష్కరణ ఎప్పుడంటే?
ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈ విగ్రహాన్ని నిజామాబాద్‌లో తయారుచేయిస్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌పై పనులు చురుగ్గా సాగుతున్నాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి నీటిపారుదలశాఖ అధికారులు అనుమతిచ్చారు.
మొత్తం రూ.3.25 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో ఆవిష్కరించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణుడి అవతారంలో ఉండే ఈ విగ్రహాన్ని తీగల వంతెన మధ్య ప్రతిష్టించబోతున్నారు. దీనికి సంబంధించిన బేస్మెంట్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. విగ్రహం తయారీ పనులు కూడా పూర్తవడంతో దాన్ని లకారం వద్దకు చేర్చడం, క్రేన్ ద్వారా బేస్మెంట్పై నిలబెట్టడంవంటి పనులపై నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఆవిష్కరణ రోజు పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఒక్క ఖమ్మం నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. చింతకాని మండలం పాతర్లపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. దాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుచేత ప్రారంభింపచేయాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఆయన కూడా ఈ విగ్రహ ఏర్పాటుకు అంగీకారం తెలపడంతో విగ్రహాన్ని ప్రారంభించే పనులు వేగంగా సాగుతున్నాయి.