పండగలా ఎవుసం.. నిరుపేదలకు ఇళ్లు, షర్మిల హామీలు
ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల వైయస్ షర్మిల హామీలు గుప్పిస్తున్నారు. ఇవాళ్టితో పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పడమటి తండా వద్ద పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జన్ బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీ మీదుగా సాగింది. పాపట్ పల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై ధర్నా నిర్వహించారు. అనంతరం బుగ్గబంజార, కామెపల్లి మండలంలోని బర్లగూడెం, స్టేజ్ పొన్నెకల్, పొన్నెకల్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది.
సువర్ణ యుగ ఆరంభానికి నేటికి 19 ఏండ్లు నిండాయని షర్మిల చెప్పారు. వైయస్ఆర్ ఇదే రోజున (09 ఏప్రిల్ 2003) పాదయాత్ర ప్రారంభించారు. 1500 కిలోమీటర్లు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తన సంక్షేమ పథకాలతో పరిష్కార మార్గాలను చూపారు. గతేడాది ఇదే రోజు ఖమ్మం సంకల్ప సభలో తన రాజకీయ ప్రస్థానానికి పునాది పడిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవుసాన్ని పండుగ చేస్తాం. కౌలు రైతులు, రైతు కూలీలను ఆదుకుంటాం. మహిళలను ఆర్థికంగా నిలబెడతాం. ఇల్లు లేని పేద ప్రజలందరికీ ఇల్లు నిర్మించి, మహిళ పేరు మీదనే రాసి ఇస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా నడిపిస్తాం. ఇంట్లో అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. రాష్ట్రంలోని పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.

వడ్లు కొనడం చేతగాని ముఖ్యమంత్రి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. పరిపాలన చేయండని అధికారమిస్తే ధర్నాలు చేస్తారట. రాష్ట్రంలో రైతులు గత యాసంగిలో 52 లక్షల ఎకరాలు వరి వేశారు. ఈ ఏడాది 35 లక్షలు మాత్రమే వేశారు. కేసీఆర్ వరి వేయొద్దన్నందున 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయలేదు. ఆ 17 లక్షల ఎకరాల్లో కొందరు ఇతర పంటలు వేసి నష్టపోయారు. ఇంకొందరు బీడు భూములుగా వదిలేశారు. కేసీఆర్ వల్ల రైతులకు, రైతు కూలీలకు పనిదొరకకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో పండించిన 35 లక్షల ఎకరాల వరిని కూడా కొనడానికి కేసీఆర్ కు చేత కావడం లేదు. రైతు సమస్యలు పరిష్కరించడం రాదు కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై ధర్నాలు చేస్తారట. కేసీఆర్ యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రం దగ్గర ఒప్పుకొని, సంతకం పెట్టి ఈరోజు ఏమీ తెలియనట్టు రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ సంతకం పెట్టినందుకే కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోంది. కేసీఆర్ ఎవరిని అడిగి సంతకం పెట్టారు? ఏ రైతుల్ని అడిగిపెట్టారు? కేసీఆర్ సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారింది. రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల్లో వరి పండించిన రైతులు ఆగమైపోయి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.