ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నిర్మించిన నూతన విమానాశ్రయంలో విమాన రాకపోకలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి విమానాశ్రయంలో రాకపోకలు,కార్యకలాపాలకు ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను డీజీసీఏ మంజూరు చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
ఓర్వకల్లు విమానాశ్రయానికి అనుమతులు రావడం శుభపరిణామమని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. ఓర్వకల్లో విమాన రాకపోకలు ప్రారంభమైతే కర్నూలులో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. కర్నూలు నుంచి విశాఖ సహా ఇతర ముఖ్య నగరాలకు ప్రయాణం సులువుగా మారుతుందన్నారు. విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు దానికి అనుమతులు తీసుకురావడం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్నారు.

ఏరోడ్రోమ్ లైసెన్స్ అనుమతులు రావడం వెనుక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల సహా తదితరుల కృషినీ ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.
కర్నూలు పట్టణానికి 18కి.మీ దూరంలోని ఓర్వకల్లులో టీడీపీ హయాంలో 2017లో విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.150 కోట్లు ఖర్చుతో ఇక్కడ రన్ వే, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం కర్నూలు విమానాశ్రయాన్ని పరిశీలించిన డీజీసీఏ అధికారులు రన్ వే,ఏటీసీ టవర్,పీటీపీ బిల్డింగ్,యాంటీ హైజాక్ రూమ్,ఐసోలేషన్ సెక్యూరిటీ,స్కానింగ్ కేంద్రం,సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నింటిపై సంతృప్తి చెందిన అధికారులు ఎట్టకేలకు తాజాగా ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను
మంజూరు చేశారు.