ఆళ్లగడ్డలో ఆధిపత్య పోరు.. భూమా దంపతులు విగ్రహాల ఆవిష్కరణ, అఖిలప్రియ వర్సెస్ కిశోర్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా రెడ్డి గుర్తుకు వస్తారు. ఆళ్లగడ్డలో మరోసారి భూమా రెడ్డి పేరు వస్తోంది. అయితే ఇప్పుడు విగ్రహాల వివాదం నేపథ్యంలో చర్చకు వస్తోంది. భూమా నాగిరెడ్డి దంపతులు మరణించిన సంగతి తెలిసిందే. నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా తన సొంత స్థలంలో నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలను బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన కిశోర్ రెడ్డికి తెలియకుండా భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పాలాభిషేకం కూడా చేశారు.

అఖిలప్రియ ఇలా..
అఖిల ప్రియ చేసిన చర్యపై కిశోర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాం వ్యక్తంచేశారు. నాగిరెడ్డి వర్థంతి ఇవాళ కావడంతో ఆ విగ్రహాలను భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి ఆవిష్కరించారు. అనంతరం పాలాభిషేకం చేశారు. దీంతో కిషోర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అఖిలప్రియ తనకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. గత కొంత కాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండటంతో వివాదం తలెత్తినట్లు తెలిసింది.

అంతకుముందే శోభ
భూమా నాగిరెడ్డి మరణానికి ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి 2014, ఏప్రిల్ 24న కారు ప్రమాదంలో మరణించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసిన శోభానాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. ఆ తరువాత వైసీపీలో జాయిన్ అయ్యారు.2014 ఎన్నికల ప్రచారంలో నంద్యాలలో వైఎస్ షర్మిలతోపాటు శోభానాగిరెడ్డి కూడా వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి, శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు.

ఇలా ప్రమాదం
దీబగుంట్ల సమీపంలో గల జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 24వ తేది ఉదయం 11.05 గంటలకు మరణించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే.