సోషల్ మీడియాలోనే మైనార్టీలపై ప్రేమ, మేం అలా కాదు.. నంద్యాల ముస్లిం ఫ్యామిలీ ఇష్యూపై జగన్..
నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య దుమారం రేపుతోంది. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. అయితే బాధ్యులకు టీడీపీకి చెందిన ఒకతను సాయం చేస్తున్నారని జగన్ తెలిపారు. బెయిల్ పిటిషన్ వేశారని.. రద్దు చేయాలని కోర్టును కోరతామని చెప్పారు.

రూల్ ఆఫ్ లా..
సమన్యాయ పాలన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. కానీ కొందరు కొందరు బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో మాత్రమే మైనార్టీలపై ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము అలా కాదన్నారు. ముస్లింలను అభిమానించే పార్టీ మాది అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ముస్లింలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.

సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆదివారం అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు.

సెల్ఫీ వీడియో
కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు బెయిల్ రావడంపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.