తాగిన మైకంలో రెండు నెలల బిడ్డను నేలకేసి కొట్టి చంపిన తండ్రి
తాగిన మైకంలో ఓ కన్న తండ్రి పసికందు పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిని విచక్షణ కోల్పోయిన ఆ తండ్రి నేలకేసి కొట్టి చంపేశాడు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా లో జరిగిన ఈ ఘటనలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే, కన్నబిడ్డ ఉసురు తీశాడు.
మల్కాపురం గ్రామానికి చెందిన బాలిరెడ్డి భార్య లక్ష్మి కేసీ కాలువ పక్కన ఉన్న బంగ్లా లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2 నెలల క్రితం వారికి ఒక పాప పుట్టింది. పాపకు దుర్గ అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డను, అభం శుభం ఎరుగని పసి దాన్ని తాగిన మైకంలో భార్యతో గొడవపడి, భార్యమీద కోపం బిడ్డ మీద చూపించాడు.
భార్య భర్తలు గొడవ పడుతున్న సమయంలో ఏడుస్తున్న బిడ్డను చూసి, బిడ్డ నోట్లో పాలసీసా కుక్కేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు .

అప్పటికి ఏడుపు ఆపకుంటే నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బిడ్డ తలకు గాయమై ప్రాణాలు కోల్పోయింది. తాగిన మైకంలో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి న తండ్రి తెల్లారి లేచి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చూసి ఆవేదన చెందినా బిడ్డని తిరిగి బ్రతికించుకోలేని స్థితిలో, గుట్టుచప్పుడు కాకుండా బిడ్డ మృతదేహాన్ని ఖననం చేయాలని ప్రయత్నించాడు. బాలిరెడ్డి కేసీ కాలువ పై మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకొని వెళుతుండగా ఈ విషయం తెలిసిన పోలీసులు బాలి రెడ్డిని అరెస్టు చేశారు.