వారికి బెయిల్ ఇప్పించింది మీ పార్టీ నేత కాదా..? చంద్రబాబుపై సుచరిత ఫైర్
అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తోన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన కామెంట్లపై హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. జూమ్ మీటింగుల్లో పాల్గొంటూ.. హైదరాబాద్‌లో ఉంటోన్న చంద్రబాబు ప్రభుత్వంపై చిల్లర మల్లర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేయాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ 306 ప్రకారం కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. కానీ టీడీపీ న్యాయవాది ద్వారా నిందితులకు బెయిల్ ఇప్పిస్తే దాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్‌కు కూడా వెళ్లిందన్నారు.

అప్పుడు ఏమైంది..?
ప్రతి అంశంపైనా సీఐబీ విచారణకు డిమాండ్ చేస్తున్నారని.. మరీ చంద్రబాబు హయాంలో జరిగిన మహిళా అధికారి వనజాక్షిపై దాడి, విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలపై ఎందుకు అదే విచారణ కోరలేదని ఆమె ప్రశ్నించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర అరెస్టును కూడా రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. జైలు, బెయిల్, శిక్షల గురించి చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.

రాజకీయాలు సరికాదు..
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై రాజకీయాలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ఉల్మా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ ఫారూక్ కోరారు. నిందితులకు బెయిల్ ఇప్పించిన టీడీపీ.. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని ఆరోపించారు. టీడీపీ కార్యదర్శిగా ఉన్న న్యాయవాది నిందితులకు బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు. అధికారంలో ఉండగా ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని ముఫ్తీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రాజమండ్రిలో ఒక మసీదు మౌజమ్ హత్యకు గురైతే ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయలేకపోయారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇదీ విషయం..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.