పరువు హత్య: 2 నెలలు క్రితమే వివాహం, ఫిజియోథెరపిస్టును దారుణంగా చంపేశారు
కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలలం సృష్టించింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఆరోపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ పట్టనంలోని కిష్టప్పనగర్‌కు చెందిన ఆడం స్మిత్(30) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. అదే పట్టణానికి చెందిన యువతిని ప్రేమించిన ఆడం స్మిత్.. ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో రెండు నెలల క్రితం ఆడం స్మిత్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం నూతన దంపతులిద్దరూ కిష్టప్పనగర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆడం స్మిత్ తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆర్టీసీ కాలనీ వద్ద కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఇనుపరాడ్లతో కొట్టి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ప్రేమ వివాహం ఇష్టంలేని తన తల్లిదండ్రులే తన భర్తను హత్య చేయించారని ఆడం స్మిత్ భార్య ఆరోపిస్తోంది. స్మిత్ మరణంతో అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.