ఏపీఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్ల నగదు సీజ్: హైదరాబాద్-కర్నూలు
కర్నూలు: ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కర్నూలు నగరంలో కలకలం రేపింది. పంచలింగాల చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ. 1.9 కోట్ల నగదు పట్టుబడింది.

అనంతపురంలోని మారుతినగర్‌కు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేయగా వీరిద్దరి బ్యాగుల్లోని రూ. 1.9 కోట్ల నగదు బయటపడింది.

నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి, స్థానిక కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన 24ఏళ్ల వివాహిత నిర్మల పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా నిర్మల కడుపునొప్పితో బాధ పడుతుండేదని, ఈ క్రమంలోనే 7న ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. గుర్తించిన కుటుంబసభ్యులు వైద్యం కోసం కర్నూలు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని అన్నారు. మృతురాలి తండ్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.