pawan kalyan janasena party cbi probe ap government ycp ys jagan mohan reddy kurnool పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిబిఐ దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు
సుగాలి ప్రీతి మృతి కేసులో మేం కోరిందే జరిగిందన్న పవన్ కళ్యాణ్
సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. సీఎం జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట మేరకు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. సుగాలి ప్రీతీ కేసును సీబీఐకి అప్పగించటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
సుగాలి ప్రీతి కేసును సీబీఐ కి అప్పగించిన సీఎం జగన్ .. ఉత్తర్వులు జారీ

సుగాలి ప్రీతి కుటుంబ పోరాటానికి బాసటగా నిలిచిన జనసేనాని
2017 లో కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్ లో చదువుతోన్న పార్వతి, రాజు నాయక్ కుమార్తె సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక ఆమె మృతి ఆత్మహత్య కాదని అత్యాచారం చేసి హత్య చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి కావటంతో అప్పటి నుండి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇక వారి పోరాటానికి బాసటగా ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా నిలిచిన విషయం తెలిసిందే .

సీబీఐకి అప్పగించటం పట్ల పవన్ హర్షం
ప్రభుత్వాన్ని ఈ కేసు విషయంలో నిలదీసిన పవన్ కళ్యాణ్ సీబీఐ దర్యాప్తు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సుగాలి ప్రీతీ కేసు విషయంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న చాలా మంది ఉన్నారని, ఇక వారందరికీ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.

ఆ తల్లిదండ్రుల బాధ పగవారికి కూడా రాకూడదన్న పవన్
మూడేళ్ళ కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతిపై అత్యాచారం, హత్య జరగగా ఆమె తల్లిదండ్రులు కుమిలిపోయారన్నారు. వారి కడుపు కోత, ఆవేదన, ఆక్రందనను తాను స్వయంగా చూశానన్నారు పవన్ కళ్యాణ్ . తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదని పవన్ పేర్కొన్నారు. ఇక ప్రీతి తల్లి నడవలేని స్థితిలో చక్రాల కుర్చీలో మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆమె చెప్పిన అమానవీయ సంఘటన విని ఈ పరిస్థితి ఏ పసిపాపకూ రాకూడదని భావించానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.


అందరి పోరాట ఫలితమే ప్రభుత్వ నిర్ణయం
ఆ సంకల్పంతోనే ఈ నెల 12న కర్నూలు వీధులలో సుగాలి ప్రీతీ కేసులో న్యాయం కోసం గొంతెత్తానని పేర్కొన్నారు. సీఎం జగన్ సీబీఐ విచారణ వెయ్యటంతో చివరికి ఆ బాలిక తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు స్వాంతన కలిగిందన్నారు. ఈ పోరాటంలో అండగా ఉన్న కర్నూలు ప్రజానీకానికి, పాత్రికేయులకు, ప్రజా సంఘాలకు పవన్ అభినందనలు తెలిపారు. అందరి పోరాట ఫలితమే ప్రభుత్వ నిర్ణయం అని పవన్ అభిప్రాయపడ్డారు .