130 మంది రైతులకు చెక్కులు పంపిణీ.. నంద్యాలలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వివిధ జిల్లాలో పర్యటిస్తూ.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కదం తొక్కారు. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి సాయం అందించారు. ఇవాళ నంద్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.
శిరివెళ్ల గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో 130 మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేస్తారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ కు పవన్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళతారు.

మధ్యలో పలుచోట్ల ప్రజలతో ముఖాముఖి సమావేశం అవుతారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో సిరువెళ్లలో మధ్యాహ్నాం 2.30 గంటలకు పవన్ కల్యాణ్ ముఖాముఖి సమావేశం అవుతారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆ తర్వాత ప్రసంగం చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఒక్కో కుటుంబానికి తలా రూ.లక్ష అందజేస్తున్నారు. తాము చేసే సాయంతో పోయిన ప్రాణాలు తిరిగి రావని.. కానీ ఆ కుటుంబానికి భరోసా కలుగుతుందని మాత్రం చెబుతున్నారు. జగన్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని పవన్ విమర్శలు చేస్తునే ఉన్నారు. అధికారం చేపట్టేవరకు ఒకలా.. చేపట్టిన తర్వాత మరొలా బీహెవ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.