కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై టీడీపీ సీనియర్ల గుస్సా: ఎన్నికల ముంగిట్లో భగ్గు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొన్న టీడీపీకి.. ఎన్నికల ముంగిట్లో తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆ పార్టీకి చెందిన సీనియర్లు భగ్గు మంటున్నారు. అసెంబ్లీ టికెట్లు తమకు దక్కుతాయో? లేవో అనే అనుమానం, అభద్రత వారిని పట్టి పీడిస్తుండటమే దీనికి కారణం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీటును సర్దుబాటు చేస్తే.. తమ గతేమౌతుందనే భయం వారిలో నెలకొంది. ఇదే వైఖరిని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోనూ కనిపిస్తోంది. అప్పటికే అక్కడ పాతకు పోయిన టీడీపీ ఇన్ ఛార్జిల వల్ల తమ సీటుకు ఎసరు వస్తుందనే ఆందోళనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మునిగిపోయారు. కర్నూలు సీటుపై నెలకొన్న పీటముడి దీనికి నిదర్శనం.

 TDP leaders fight each other for Kurnool Assembly ticket

కర్నూలు సీటు మాకంటే మాకు అంటూ కొట్లాడుకుంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. నిజానికి వారిద్దరూ ఫిరాయింపుదారులే. రాష్ట్ర విభజనకు ముందు, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు టీజీ వెంకటేష్. 2014 అసెంబీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి, సుమారు మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆయనపై విజయం సాధించారు.

 TDP leaders fight each other for Kurnool Assembly ticket

అనంతరం- టీజీ వెంకటేష్ రాజ్యసభకు వెళ్లిపోయారు. ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లోగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని, సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు భరోసా ఇచ్చారు. అది కాస్తా బెడిసి కొట్టింది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగ లేదు. ఉన్న స్థానాలనే అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, ఇదివరకే ఇన్ ఛార్జీలుగా ఉన్న వారికీ సీట్లను సర్దాల్సిన పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటోంది. చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు టీజీ వెంకటేష్ వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. తమకు ఈ సారి టికెట్ దక్కుతుందా? లేదా? అనే భయం ఈ రెండు గ్రూపుల్లో వ్యక్తమౌతోంది.

కొత్తవారికి కర్నూలు స్థానాన్ని ఇస్తే, ఊరుకునేది లేదని రెండు వర్గాలు చంద్రబాబును హెచ్చరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ తో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించవచ్చనే వార్తలు వినిపిస్తున్నందున.. ఆయనకు తప్ప మరెవ్వరికైనా టికెట్ ఇస్తే, ఓడించి తీరుతామని ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు కరాఖండిగా తేల్చేస్తున్నారు. సిట్టింగ్ సభ్యుడినైన తనకే కర్నూలు టికెట్ కావాలంటూ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వం వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ.. ఫలితం లేదనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. టికెట్ పై ఎస్వీ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం.

 TDP leaders fight each other for Kurnool Assembly ticket

అదే సమయంలో కర్నూలు టికెట్ కోసం టీజీ వెంకటేష్ పావులు కదుపుతున్నారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ ను తన కుమారుడు భరత్ కు ఇప్పించుకోవాలని టీజీ వెంకటేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా ఆయన వెనుకాడబోరని అంటున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ గనక ఇస్తే, తాను ఎంత మాత్రమూ సహకరించబోనని, వీలైతే ఆయనను ఓడిస్తానని కూడా టీజీ వెంకటేష్ హెచ్చరిస్తున్నారు. లోకేష్ కోసం మాత్రమే తాము కర్నూలు సీటును త్యాగం చేస్తామని, మరొకరు పోటీ పడితే మాత్రం సహించేది లేదని అటు ఎస్వీ, ఇటు టీజీ ఇద్దరూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు.

నిజానికి- ఈ తరహా వాతావరణం ఒక్క కర్నూలు అసెంబ్లీ స్థానం పరిధికి మాత్రమే పరిమితం కాలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా కదిరిలో అత్తర్ చాంద్ పాషా పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన ఆయనకు ఈ సారి టికెట్ దక్కడం అనుమానమే. కదిరి పాతకాపు కందికుంట ప్రసాద్ వైపే పార్టీ అగ్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా బద్వేలులో ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములుకు టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఖరారు కాలేదు. అక్కడ వీరా రెడ్డి కుటుంబం సూచించిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. జమ్మలమడుగులో పాత కాపు పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డికి దాదాపు టికెట్ ఖరారైనట్టే. ఇక్కడ ఫిరాయింపు మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డిని కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో దింపడం ఖాయమైనట్టే. ఆదినారాయణ రెడ్డి అయిష్టంగానే ఉన్నారు. దశాబ్దాల నాటి పాత వైరం ఉన్నందున ఆది నారాయణ రెడ్డి వర్గం, రామసుబ్బారెడ్డికి ఎలా సహకరిస్తుందనేది ప్రశ్నార్థకమే.

English summary
Clash between Telugu Desam Party Rajya Sabha member TG Venkatesh and Kurnool YSRCP MLA, who joined in rulling party TDP SV Mohan Reddy for Kurnool Assembly ticket issue. Both are claiming that, we would not ready to lose the Kurnool Assembly ticket. If, Chief Minister Chandrababu Naidu son, IT minister Nara Lokesh is showing interest to fight in election from Kurnool, we can allow him only. Otherwise, We would not lose the ticket any other leader says Kurnool sitting MLA SV Mohan Reddy and TG Venkatesh. In fact, TG Venkatesh trying to get Kurnool assembly ticket for his Bharath for his political debut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X