నందికొట్కూరు వైసీపీలో అంతర్గత పోరు .. సొంత పార్టీ నేతలపై శిఖండి రాజకీయాలంటూ బైరెడ్డి ఫైర్
కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారటమే కాదు తాజాగా బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత పోరుకు అద్దం పడుతున్నాయి .
కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ... కర్రలు,రాళ్ళతో దాడి

నందికొట్కూరు వైసీపీలో అంతర్గత కలహాలు ... బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వ్యాఖ్యలతో బట్టబయలు
నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ లు అధికార పార్టీలో కలిసి పనిచేస్తున్నా ఒకరిమీద ఒకరు అంతర్గతంగా యుద్ధాలే చేస్తున్నారు . ఎన్నికల సమయం నుండి రెండు వర్గాలుగా పనిచేస్తున్న వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి పెద్ద తలనోప్పిలా తయారైంది. తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3 ఏళ్లు గడిచిన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిద్ధార్థ రెడ్డి ప్రత్యర్థి వర్గంపై విరుచుకు పడిన తీరు అక్కడి అంతర్గత కలహాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

వైసీపీ జెండా మోసిన వారికి న్యాయం జరగటం లేదని మండిపడిన సిద్ధార్ద్ రెడ్డి
నందికొట్కూరు పార్టీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా రెండు వర్గాలు ఘర్షణలకు దిగాయి. ఇప్పుడు తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వార్నింగ్ వైసిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇద్దరు ముగ్గురు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పెద్ద నాయకులు అనుకునేవాళ్ళు తమ పంథా మార్చుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. నందికొట్కూరు లో వేలు పెడతాం ,రాక్షసానందం పొందుతాం అంటే సహించేది లేదని తేల్చిచెప్పారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

నియోజకవర్గంలో పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపాటు
నియోజకవర్గంలో పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కార్యకర్తలకు నష్టం చేస్తే సహించేది లేదంటూ తేల్చి చెప్పారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ నాయకులు రెండుగా విడిపోయి గత కొంతకాలంగా ఘర్షణలకు దిగుతున్న నేపథ్యంలో, తాజాగా బాహాటంగా వారు చేస్తున్న వ్యాఖ్యలు వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నందికొట్కూరు నియోజకవర్గం పంచాయితీ ఇప్పటికే సీఎం జగన్ దగ్గరకు పలుమార్లు వెళ్ళింది.