కర్నూల్ జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ .. తాజా, మాజీ ఎమ్మెల్యేల అవినీతి భాగోతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి అవినీతి ఒకరు బయట పెట్టుకుంటున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకుంటూ అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై చెలరేగిన అవినీతి ఆరోపణల వివాదం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
ఇక తాజాగా కర్నూలు జిల్లాలోనూ టిడిపి, వైసిపి నేతల మధ్య అవినీతి ఆరోపణల రచ్చ మొదలైంది. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్ళు విసురుతున్నారు. తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ చర్చలకు సిద్ధమంటూ ఇరువురూ ప్రకటనలు చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న అవినీతి ఆరోపణలు బనగానపల్లె ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి.

జనార్దన్ రెడ్డి 22 కేసులలో నిందితుడు , కబ్జాదారుడు : ఎమ్మెల్యే ఆరోపణ
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 22 కేసులలో నిందితుడని, భూ కబ్జాదారుడని, బీసీ జనార్దన్ రెడ్డి పై ఉన్న అన్ని కేసులకు ఎఫ్ఐఆర్ లను చూపిస్తానని , బనగానపల్లెలో ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూడా కబ్జా చేసిందేనని మాజీ ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టారు తాజా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. అంతేకాదు అవినీతిపరుడైన బీసీ జనార్దన్ రెడ్డికి తనను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. కత్తి పట్టుకుంటానని అంటున్న చూసి జనార్దన్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడనని, ఆయన అవినీతిని బయట పెట్టడం కోసం ఎక్కడ చర్చకు పెట్టినా సిద్ధమేనంటూ ప్రకటించారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు : ఎమ్మెల్యే పై మాజీ రివర్స్ దాడి
ఇక ఎమ్మెల్యే చేసిన అవినీతి ఆరోపణలపై మండిపడిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత బీసీ జనార్దన్ రెడ్డి , ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల అతి ప్రాచీన ఆలయాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.

డిబేట్ కు సిద్ధం అని ప్రకటించిన నేతలు
ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అక్రమాలను ఎత్తి చూపుతున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రామిరెడ్డి పై ఆరోపణలు గుప్పించారు. తాను కూడా ఎమ్మెల్యే అవినీతి ,అక్రమాలు బయట పెట్టడానికి డిబేట్ కు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు.
ఇలా తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఒకరి అవినీతి బాగోతాన్ని మరొకరు బయటపెడుతున్న తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఒకరి అవినీతి ఇంకొకరు బయటపెడుతూ రచ్చ చేస్తున్న నాయకులు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్ళు విసురుతూ, సత్య ప్రమాణాలకు కూడా దిగుతుంటే ప్రజలు రాజకీయ నాయకుల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నేతలు సైతం ఇలా ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టి రచ్చ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.