challa ramakrishna reddy ysrcp hyderabad apollo hospital Coronavirus covid 19 వైఎస్సార్సీపీ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి politics
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూత: కరోనాతో బాధపడుతూ తుదిశ్వాస
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన రెండురోజులుగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. రెండు రోజులుగా ఆయన అపోలో ఆసుపత్రిలోని వీఐపీ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి ఇదివరకు తెలుగుదేశం, కాంగ్రెస్‌లల్లో కొనసాగారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యారు.


జిల్లా రాజకీయాలపై ముద్ర..
చల్లా రామకృష్ణా రెడ్డి స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. ఇదివరకు కోవెలకుంట్ల, అనంతరం బనగానపల్లి, పాణ్యం, డోన్, నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. 1983లో ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాణ్యం నియోజకవర్గం నుంచి ఘన విజయాన్ని అందుకున్నారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1991లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమే ఎదురైంది.

వరుస విజయాలతో అసెంబ్లీకి..
అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఘన విజాయాన్ని అందుకున్నారు. వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కోవెలకుంట్లకు బదులుగా బనగానపల్లి కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో బనగానపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మళ్లీ ఓడిపోయారు. అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.

జగన్ సమక్షంలో వైసీపీలోకి..
అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చల్లా రామకృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అంతకుముందు హామీ ఇచ్చినట్లుగా వైఎస్ జగన్.. ఆయనకు శాసన మండలి సభ్యుడిని చేశారు. కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. కరోనా వైరస్ బారిన పడ్డారు. కొద్దిరోజుల పాటు హోమ్ క్వారంటైన్లో గడిపారు. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల కిందటే అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.