సంచలన హత్య కేసు.. స్వాతి రెడ్డి అరెస్ట్.. జైలుకు తరలింపు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్ నగర్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా స్వాతిరెడ్డి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాగర్‌కర్నూలుకు జైలుకు తరలించినట్టు సమాచారం.

ప్రియుడితో వ్వవహారం భర్తకు తెలియడంతో..
2017లో ప్రియుడు రాజేష్‌తో కలిసి స్వాతి రెడ్డి తన భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేయించింది.ప్రియుడితో వ్వవహారం భర్తకు తెలియడంతో.. అతనితో ఉన్న సంబంధాన్ని వదులుకోలేక భర్తను అంతమొందించాలనుకుంది. ప్లాన్ ప్రకారం ఓరోజు తెల్లవారుజామున రాజేష్‌ను ఇంటికి పిలిపించింది. సుధాకర్ రెడ్డి నిద్రిస్తున్న సమయంలో అతని మెడపై మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం అతని తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కాల్చేశారు.

స్వాతిరెడ్డి ప్లాన్..
సుధాకర్ రెడ్డిని హత్య చేయించిన స్వాతిరెడ్డి... అతని స్థానంలోకి రాజేష్‌ను తీసుకురావడానికి యాసిడ్ దాడి నాటకం ఆడింది. ఇందుకోసం రాజేష్ తన ముఖంపై పెట్రోల్ చల్లుకుని నిప్పంటించుకున్నాడు. రాజేష్‌ను సుధాకర్ రెడ్డిగా నమ్మిస్తూ.. అతనిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతిరెడ్డి నాటకానికి తెరలేపింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అతన్ని చేర్పించింది.

సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాజేష్‌పై సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. తమ కొడుకు ప్రవర్తనకు,ఆహారపు అలవాట్లకు ఇతనికి చాలా తేడాలు ఉన్నాయని గ్రహించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. రెండేళ్లుగా వీరిద్దరు వివాహేర సంబంధం కొనసాగిస్తున్నట్టు విచారణలో అంగీకరించారు.

ఇది తన ప్లాన్ కాదన్న రాజేష్..
నిజానికి తాను సుధాకర్‌రెడ్డిని హత్య చేయకుండా ఎక్కడికైనా దూరంగా ఇద్దరం వెళ్లిపోదామని సూచించానని పిల్లలు, తల్లిదండ్రులను వదిలిపెట్టి రావడానికి ఇష్టపడని స్వాతి మరో ప్లాన్ వేసిందని రాజేష్ విచారణలో తెలిపాడు. సుధాకర్ రెడ్డి స్థానంలో తనను తీసుకురావాలనేది ఆమె ప్లానే అని చెప్పాడు.

బెయిల్ మంజూరు అయినా...
2018 జులైలో స్వాతి రెడ్డికి బెయిల్ మంజూరైంది. అయితే ఆమెను తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు.